కేంద్ర బడ్జెట్ 2022 భూ రికార్డుల నిర్వహణలో రెండు కీలక సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఒక ప్రత్యేకమైన భూమి గుర్తింపు సంఖ్యను ఇవ్వడం, నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (NGDRS) ద్వారా ‘ఒకే దేశం..-ఒకే రిజిస్ట్రేషన్’ లక్ష్యంగా డీడ్‌లు, డాక్యుమెంట్‌ల రిజిస్ట్రేషన్ చేయడం. ఈ భూమి రికార్డు యాజమాన్య సంస్కరణ దేశంలోని సమాఖ్య లక్షణానికి ఎట్లా సరిపోతుంది. భారతదేశంలో భూ పరిపాలన సమస్యలను ఎలా పరిష్కరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. భూమి విషయాలు రాజ్యాంగపరంగా రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. భూమి రాష్ట్ర సబ్జెక్ట్ అయినందున, క్రమబద్ధమైన భూ రికార్డు నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక హక్కు. సమర్థవంతమైన భూ రికార్డుల నిర్వహణ భూమి విషయంలో ఉండే వివాదాల పరిష్కారానికి, భూ రికార్డులలోని తప్పిదాలను తొలగించడానికి, స్థిరమైన భూ వినియోగ ప్రణాళికకు కూడా కీలకం.
వివిధ శాఖల (రెవెన్యూ, సర్వే & సెటిల్‌మెంట్, రిజిస్ట్రేషన్) మధ్య సమన్వయ లోపం కారణంగా భూమి రికార్డులు ఇప్పటికీ అస్తవ్యస్తంగానే ఉన్నాయి. 2020లో తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాల చట్టం వచ్చింది. చట్టం రాకముందే ధరణి పేరుతో భూ రికార్డుల కోసం పోర్టల్‌ను రూపొందించారు. అయితే, భూమి కొనుగోలుదారులు, అమ్మకందారులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడంలో 2020 చట్టం, ధరణి పోర్టల్ రెండూ విఫలమయ్యాయి.
భూ పరిపాలనలో అనేక మార్పులు
ఈ పరిస్థితులలో కొత్త ప్రభుత్వానికి రెండు చర్యలు తప్పలేదు. ఒకటి ధరణి పోర్టల్ ప్రక్షాళన, రెండోది 2020 చట్టం సవరణ. గ్రామాల్లో పట్వారీ వ్యవస్థను రద్దు చేయడంతో, భూ పరిపాలనలో అనేకమార్పులు వచ్చాయి. చాలావరకు గ్రామస్థాయి భూ రికార్డులు మాయమయ్యాయి. ప్రభుత్వ భూముల రికార్డులు మారాయి. చారిత్రక రికార్డులు చాలా తక్కువగా ఉన్నాయి. గత 76 ఏండ్ల కాలంలో వివిధ చట్టాల ప్రకారం ప్రాథమికంగా భూమిని రక్షించడానికి, యాజమాన్య పరిరక్షణకు, కనీసం 15 నుంచి 18 రకాల భూ రికార్డులు ఉన్నాయి. వీటిలో అనేక రికార్డులు తారుమారు చేశారు. ధ్వంసం చేశారు. సంస్థాగత భూ యాజమాన్య రికార్డులు కూడా అందుబాటులో లేవు. అనేక ప్రభుత్వ సంస్థలు కూడా భూముల సర్వే చేయలేదు. ప్రభుత్వం లీజు లేదా కౌలు కింద ఇచ్చిన భూములను, రికార్డులు లేకపోవడంతో, లీజుదారులు ‘సొంతం’ చేసుకున్నారు. ఇంకొక రైతులు, ఇతరులు తమ భూములకు సంబంధించిన రికార్డులను మంచిగా భద్రపరుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ముసాయిదా ఆర్.ఒ.ఆర్ 2024 చట్టం మీద ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకున్నది. ఇది చాలా మంచి పని. భారత రాజ్యాంగం చట్టాలను చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణ ఖచ్చితంగా చేయాలని నిర్దేశించింది. గత 10 ఏండ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి ప్రక్రియ ఏనాడూ తలపెట్టలేదు.
భూ రికార్డుల నిర్వహణ ప్రైవేటు సంస్థ అధీనంలో..
భూరికార్డులు డిజిటలీకరణ నేపథ్యంలో భూమి రికార్డుల నిర్వహణలో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థల పాత్ర కూడా పెరిగింది. పెరుగుతున్నది. ధరణి పోర్టల్ రూపకల్పన, నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ వంటి పనులు ఒక ప్రైవేటు కంపెనీ చేసింది. ఇప్పటికీ, భూమి రికార్డుల డేటాబేస్ ఈ సంస్థ అధీనంలోనే ఉన్నది. ఈ సంస్థకు కేవలం రూ.166 కోట్లు ఇచ్చి ఇన్ని పనులు చేయించిన వైనం, ధరణి అవకతవకలలో ఈ సంస్థ పాత్ర మీద కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. గత ప్రభుత్వం ఈ సంస్థతో చేసుకున్న ఒప్పందం మీద ప్రస్తుత ప్రభుత్వం విచారణ కూడా మొదలుపెట్టింది.
ప్రైవేటు సంస్థ నిర్ణాయక పాత్రపై జాగ్రత్తలు అవసరం
అత్యంత కీలకమైన భూమి రికార్డుల నిర్వహణలో ఒక ప్రైవేటు సంస్థకు నిర్ణాయక పాత్రనివ్వడం ఆశ్చర్యకరం. ధరణి, రాబోయే భూమాత, ఇంకా ప్రభుత్వ ఇతర సమాచార సేకరణ వాహికలు ప్రైవేట్ కంపెనీల చేతులలో, రాజకీయ పార్టీల చేతులలో పడకుండా తగిన జాగ్రత్తలు ముసాయిదా ఆర్ఒఆర్ చట్టంలో పొందుపరచాలి. చట్టంలో పారదర్శక వ్యవస్థకు పునాదిగా ఒక సెక్షన్ ఉండాలి. 1971 చట్టంలో ROR (భూ రికార్డు) ప్రజలు తనిఖీ చేసుకోవచ్చు అని స్పష్టంగా పేర్కొన్నది. తగిన రుసుము చెల్లిస్తే సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలి అని కూడా నిబంధన ఉన్నది. ప్రజా తనిఖీకి అనుగుణంగా భూమాత రికార్డు నిర్మాణం ఉండాలి. గ్రామ స్థాయి నుంచి మండలం, జిల్లా తరువాత రాష్ట్ర వ్యాప్త రికార్డుగా ఈ ముసాయిదా చట్టం గుర్తించాలి.
అవినీతిని వెలికితీయాలి
2024 ముసాయిదా ధరణి భూ రికార్డు మీద నిర్మాణం అవుతుంది అని చెబుతున్నది. అట్లా చేస్తే ధరణి పోర్టల్ రికార్డు గందరగోళం కొత్త భూమాత పోర్టల్ లో పునరావృతం అవుతుంది. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి క్లిష్ట సమస్యలు సృష్టించిన రికార్డును ప్రామాణికంగా తీసుకుంటే వివాదాలు ఇంకా జటిలం అవుతాయి. ధరణి వల్ల నష్టపోయిన రైతులు, ఇతరులకు పరిహారంగా, నష్టాలు చేకూర్చిన వ్యవస్థ జవాబుదారీతనం 2024 ముసాయిదాలో ప్రతిబింబించాలి. ధరణి ద్వారా జరిగిన అవినీతిని వెలికి తీయడానికి 2024 ముసాయిదాను ఉపయోగించాలి. అవినీతిపరులకు, తప్పుడు రికార్డులు సృష్టించేవారికి, రికార్డులను తారుమారు చేసేవారి మీద చట్టరీత్యా చర్యలు 2024 ముసాయిదాలో పెట్టాలి.
రైతులను బెదిరించే సాధనంగా ధరణి పోర్టల్
ధరణి పోర్టల్ వాడుకుని అప్పటి ప్రభుత్వం కూడా దుస్సాహస చర్యలకు పూనుకున్నది. ధరణి పోర్టల్ ను రైతులను బెదిరించే సాధనంగా వాడుకున్నది. వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణను ఆయా రైతులు ఒప్పుకోనందుకు, ధరణి పోర్టల్లో వారి అనుమతి లేకుండా, ఒక చట్టపరమైన పద్ధతి లేకుండా భూములను నిషేధిత జాబితాలో చేర్చి తెలంగాణ మౌలిక సదుపాయాల కార్పొరేషన్ పేరు మీద భూములు బదలాయించింది అప్పటి ప్రభుత్వం. కొత్త ప్రభుత్వం అంతే సులువుగా తిరిగి రైతుల పేర్లను పెట్టి, ఆయా సర్వే నంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సి ఉండగా ఇప్పటికీ చేయలేదు. 2024 ముసాయిదాలో ఇట్లాంటి అతిక్రమణలకు తావు లేకుండా నిబంధన పెట్టాలి. ప్రభుత్వం భూ సేకరణ చెయ్యాలంటే దానికి ఒక ప్రత్యేక చట్టం ఉంది. అధికారం ఉంది కదాని భూమి రికార్డును ఇష్టానుసారం మార్చే అధికారం ప్రభుత్వానికి కూడా ఉండకూడదు.
పాస్‌బుక్ చేతిలో..భూమి కబ్జాలో..
2024 ముసాయిదాలో ఇప్పటివరకు ఉన్న అన్ని రకాల చట్టపర భూ రికార్డులను ఒక షెడ్యుల్ కింద గుర్తించాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే 2020 చట్టం ఏ రికార్డు ఆధారంగా (పహనీ, సేత్వార్, వగైరా) కొత్త భూ రికార్డు తయారు చేశారో, చెయ్యాలో స్పష్టం చెయ్యలేదు. ఫలితంగా, ప్రజల వద్ద ఉన్న పాస్‌బుక్స్ కాదని 70 ఏండ్ల కిందటి యజమానికి సరి కొత్తగా హక్కు కలిపించింది ధరణి పోర్టల్. భూమి కబ్జాలో ఉంది, పాస్ పుస్తకం చేతిలో ఉంది. ధరణిలో తమ పేరు లేక వేల మంది రైతులు అల్లాడుతున్నారు.
ఆర్ఒఆర్ చట్ట సవరణ అత్యంత అవసరం
భూమి రికార్డు నిర్వచనం కూడా 2024 ముసాయిదాలో పెట్టాలి. భూమి రికార్డు అంటే ఏమిటి, ఆ రికార్డులో ఎటువంటి వివరాలు ఉంటాయి అని కూడా 2024 ముసాయిదా చట్టంలో ఒక షెడ్యూల్ గా ప్రకటించాలి. 2024 ముసాయిదాలో భూవినియోగం గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. తెలంగాణ భూభాగంలో అడవుల విస్తీర్ణం కనీసం 33 శాతం ఉండాలి. ఇంకా ఇతర రకాల భూమి వినియోగం శాతం కూడా పొందుపరుస్తూ భూమాత పోర్టల్ భూమి కొనుగోళ్ళు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఈ మేరకు పరిమితులు కలిగి ఉండాలి. మొత్తానికి తెలంగాణలో భూమి రికార్డులకు సంబంధించి అనేక కొత్త సమస్యలు వచ్చిన నేపథ్యంలో ఆర్ఒఆర్ చట్ట సవరణ అత్యంత అవసరం. అయితే, దీని రూపకల్పన ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలి. సామాన్యులు, రైతులకు సులువుగా ఉండేటట్టు ఆ చట్టం, ఆ చట్టం ద్వారా ఏర్పడే భూమాత పోర్టల్ ఉండాలి.
- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్