ఉత్పాదక శక్తి పెంపుతో రైతుల ఆదాయం పెరగాలి : తెలంగాణ రైతు సంఘం

ఉత్పాదక శక్తి పెంపుతో రైతుల ఆదాయం పెరగాలి : తెలంగాణ రైతు సంఘం

ఐ క్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. చిరుధాన్యాల ద్వారా అందే పోషక విలువలు, వాతావరణ వేడి దుష్ఫలితాలను ఎదుర్కొనే శక్తి గల ఈ పంటల గుణగణాలను దృష్టిలో పెట్టుకొని ఐక్యరాజ్య సమితి భారత ప్రతిపాదనను అంగీకరించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చిరుధాన్యాల ఉత్పాదకతను జెన్యు మెరుగుదల, మేలురకం విత్తనాల సరఫరా, మెరుగు పరిచిన పంట యాజమాన్య చర్యల ద్వారా ఉత్పత్తిని పెంచాలని సూచించింది. చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి వీటిని ప్రజా పంపిణీ వ్యవస్థలో చేర్చాలని,  పారిశ్రామిక స్థాయిలో చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించాలని, తద్వారా ఎగుమతులు పెంచడానికి దోహద పడుతుందని కేంద్ర వ్యవసాయోత్పత్తుల ఖర్చులు, ధరల కమిషన్ (2023-–24) భావించింది.

ధాన్యాల దిగుమతులు తగ్గాలి

ఇప్పుడు వంట ధాన్యాలు, పప్పు ధాన్యాలు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పంటల ఉత్పాదక శక్తిని పెంచడానికి వీటి ఉత్పత్తి సాంకేతికతను మెరుగుపర్చేలా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా వీటిని శుద్ధిపరిచే యూనిట్లను కూడా ఆధునీకరించాలి. దీనికోసం ఒక ప్రత్యేక మిషన్ పద్ధతిలో పథకాన్ని ప్రవేశ పెట్టాలి. ముఖ్యంగా ఆవాలు, వేరుశనగ, సోయా చిక్కుడు నూనె, పొద్దు తిరుగుడు నూనె గింజల విషయంలో ఈ మిషన్ కార్యక్రమాలు కొనసాగాలి. పప్పు ధాన్యాల దిగుమతి ఇటీవల కొంత మేర తగ్గినప్పటికీ మూడింట రెండొంతలు పైగా మైసూర్ పప్పు, దిగుమతి అవుతుంది. కంది పప్పులో 15 శాతం, మినుము పప్పులో 17 శాతం దిగుమతులమీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఈ దిగుమతులమీద ఆధారపడడాన్ని తగ్గించేందుకు పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలి. వీటిలో ఆధునీకరించిన ఉత్పత్తి పద్ధతులను ప్రవేశ పెట్టాలి. రైతులకు ప్రోత్సాహం లభించేలా తదనుగుణమైన మార్కెటింగ్, ప్రభుత్వ సేకరణ ఉండాలి.

ఉత్పత్తి సాంకేతికాల అందుబాటులో తేడా

ఇప్పటికే అందుబాటులో ఉన్న ఉత్పత్తి సాంకేతికాల ఉత్పత్తి సామర్థ్యం వాస్తవంగా రైతులకు లభిస్తున్న ఉత్పాదకతకు చాలా తేడా ఉంది. ఈ లోటును తగ్గించడానికి సమగ్ర పంటల యాజమాన్యాన్ని, కొత్త సాంకేతికాలను, ఉత్పత్తి ఉపకరణాలు సరైన సమయంలో రైతులకు అందేలా హైబ్రిడ్ విత్తనాలతో సహా చర్యలు తీసుకోవాలి. జరుగుతున్న పరిశోధనలకు, రైతులకు విస్తరణ సేవల ద్వారా అందుతున్న సమాచారాన్ని మెరుగు పర్చాలి. రాష్ట్ర స్థాయిలో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలి. దేశంలో వ్యవసాయరంగంలో ఇప్పుడు రైతులకు అందుతున్న రుణాలలో చాలా వ్యత్యాసాలు వచ్చాయి. ముఖ్యంగా చిన్న, -సన్నకారు రైతులకు అందుతున్న రుణాలలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. అందువల్ల, సరైన విధానాలను చేబట్టి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న కమతాల రైతులకు కూడా రుణ సౌకర్యం అందుబాటును మెరుగు పర్చాలి.

మార్కెట్​ ఫీజులను హేతుబద్ధీకరించాలి

వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడానికి అవసరమైన మౌలిక సౌకర్యాల సమస్యలను పరిష్కరించాలి. వ్యవసాయ విలువ గొలుసులను మెరుగు పర్చాలి. వ్యవసాయోత్పత్తుల నాణ్యత ప్రమాణాలను (శానిటరీ, పైటో శానీటరి కండిషన్స్) మెరుగు పర్చాలి. వ్యవసాయోత్పత్తుల వాణిజ్యాన్ని ఆటంకపరుస్తున్న సాంకేతికాలను అధిగమించాలి. విలువ పెంచిన ఉత్పత్తుల ఎగుమతులను, సేంద్రీయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి ప్రోత్సహించాలి. గ్రామీణాభివృద్ధి సెస్సు లాంటి పన్నులతో సహా కొన్ని రాష్ట్రాలు మార్కెట్ ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఫలితంగా ఆయా వ్యవసాయోత్పత్తుల సేకరణ భారంగా మారిపోయింది. ఇటువంటి మార్కెట్లలో ప్రైవేట్ సంస్థలు పాల్గొన లేకపోతున్నాయి. అందువల్ల, వ్యవసాయోత్పత్తుల మార్కెట్లలో వివిధ రాష్ట్రాలు విధిస్తున్న ఫీజులను హేతుబద్ధీకరించి మద్దతు ధరలో కొంత శాతంగా కాక క్వింటాలుకు నిర్దిష్టమైన మొత్తాన్ని మార్కెట్ పన్నుగా వసూలు చేసే పద్ధతిని ప్రవేశ పెట్టాలి.

పరిశోధనలకు నిధులు పెంచాలి

2016 ఖరీఫ్ నుంచి ప్రారంభమైన ప్రధానమంత్రి ఫసల్​బీమా యోజన పరిధి కొన్ని ప్రాంతాలకే విస్తరించింది. దీనికి ప్రధాన కారణం రైతుల్లో పంటలబీమాపై సరైన అవగాహన లేకపోవడమే. అందువల్ల, పంటల బీమా సానుకూల అంశాలను రైతుల దృష్టికి తీసుకురావడానికి మల్టీ మీడియా ప్రచారాన్ని చేబట్టాలి. భారత వ్యవసాయంలో ఇప్పుడు సాగుకు కూలీల కొరత పెద్ద ఎత్తున ఎదురవుతుంది. ఇంత వరకు యాంత్రీకరణలో ప్రగతి పెద్ద ఎత్తున జరిగినప్పటికీ దీన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఉన్న స్వయం పోషక బృందాలను, రైతుమిత్ర బృందాలను వినియోగించుకోవాలి. 

రైతులకు ఎప్పటికప్పుడు వ్యవసాయోత్పత్తుల ధరలపై తాజా సమాచారాన్ని అందించడానికి ధరల ముందస్తు సమాచారం అందే విధంగా ఈ వ్యవస్థను పని చేయించాలి. ఈ సంస్థ ఎప్పటికప్పుడు డిమాండ్ సరఫరాలను ఆధునిక సాంకేతికం ద్వారా అంచనా వేయాలి. వ్యవసాయోత్పత్తిని, వాటి పోటీ తత్వాన్ని పటిష్ట పరిచేందుకు వీలుగా వ్యవసాయ పరిశోధనల అభివృద్ధి కోసం నిధులను  అభివృద్ధి చెందిన దేశాలలాగ పెద్ద ఎత్తున నిధులను కేటాయించాలి. ఈ విషయంలో కొనసాగుతున్న స్తబ్దతను కొనసాగించరాదు. వ్యవసాయోత్పత్తిలో కనీసం ఒక్క శాతం స్థూల విలువను పరిశోధనలకు కేటాయించాలి.

నేలల్లో సేంద్రియ  పదార్థం తగ్గుతోంది

నేలల పోషక యాజమాన్యంలో కొనసాగుతున్న అశాస్త్రీయ ధోరణుల వల్ల ప్రధాన పోషకాల వినియోగంలో అసమానతలు, సూక్ష్మ, రెండోస్థాయి లోపాలు, నేల ఉత్పాదక శక్తిని క్షీణింపజేస్తున్నాయి. అలాగు నేలల్లోని సేంద్రీయ పదార్థం స్థాయి తగ్గిపోతున్నది. ఈ దుస్థితి నుంచి బయట పడటానికి పోషక ఆధారిత ఎరువుల రాయితీల్లో యూరియాను కూడా చేర్చాలి. అలాగే రైతుకు రాయితీతో ఇచ్చే ఎరువుల బస్తాలపై పరిమితులు విధించాలి. ఈ పరిమితిని ఇప్పుడు వంటగ్యాస్ ‘సిలిండర్ల సరఫరాలను నియంత్రిస్తున్నట్లుగా’ ఉండాలి. తద్వారా ఎరువుల సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవాలి. ఇలా మిగిలిన నిధులతో పరిశోధనలను, మౌలిక సౌకర్యాలను మెరుగుపర్చాలి.

- మూడ్ శోభన్, సహాయ కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం