ప్రపంచ జనాభా పైపైకి :  సోషల్​ ఎనలిస్ట్ డా.తిరునహరి శేషు

ప్రపంచ జనాభా పైపైకి :  సోషల్​ ఎనలిస్ట్ డా.తిరునహరి శేషు

ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో జన్మించిన పాపతో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరినట్లుగా ఐక్యరాజ్యసమితి తాజాగా ప్రకటించింది. 1830లో 100 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా 1987 నాటికి 500 కోట్లకు పెరిగితే 1987 నుంచి 2022 వరకు ఈ 35 ఏండ్లలో 800 కోట్లకు పెరిగింది. 2037 నాటికి 900 కోట్లకు, 2057 నాటికి 1000 కోట్లకు పెరగవచ్చు అని అంచనా. కొన్నేండ్లుగా జనాభా వృద్ధిరేటు నెమ్మదిస్తున్నప్పటికీ విద్య, ఆరోగ్య రంగాల్లో పురోగతి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ప్రపంచ జనాభా వృద్ధికి కారణాలుగా ఐక్యరాజ్యసమితి జనాభా నిధి పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు జనాభా పెరుగుదలతో పాటు ఆ పెరుగుదల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించలేకపోతున్నాయి. 1848లో మాల్టస్  ప్రచురించిన యాన్ ఎస్సే ఆన్ ది ప్రిన్సిపుల్స్ ఆఫ్ పాపులేషన్ అనే గ్రంథంలో జనాభా పెరుగుదల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు, జనాభా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు గురించి ప్రస్తావించారు. కానీ జనాభా పెరుగుదలను నియంత్రించడంలో ఇండియా సహా ప్రపంచంలోని అనేక దేశాలు సక్సెస్ ​కాలేకపోతున్నాయి. 

జనాభా విస్ఫోటనం

1951లో భారత దేశ జనాభా36 కోట్లుగా ఉంటే అది 2011 నాటికి 121 కోట్లకు పెరిగింది. ఈ 60 ఏండ్లలోనే దేశంలో జనాభా 85 కోట్లు అదనంగా పెరిగింది. ప్రస్తుతం దేశ జనాభా 141 కోట్లుగా ఉన్నదని అనధికారిక లెక్క. ఈ దశాబ్దంలో జనాభా 20 కోట్లు అదనంగా పెరిగింది. ఈ పెరుగుదల నైజీరియా జనాభాకు సమానం కాగా, బంగ్లాదేశ్, రష్యా, జపాన్, ఫిలిప్పైన్స్ జనాభా కంటే ఎక్కువ. ఇలా జనాభా ఏ స్థాయిలో పెరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. దేశం ఎదుర్కొంటున్న అనేక సామాజిక, ఆర్థిక సమస్యలకు జనాభా పెరుగుదల కూడా కారణమే. అందుకే దీనిపై మరింత దృష్టి పెట్టాలి. 1981 నుంచి దేశంలో జనాభా వార్షిక పెరుగుదల రేటు, దశాబ్ద పెరుగుదల రేటు తగ్గుతున్నప్పటికీ పెరుగుదలను ఆశించిన స్థాయిలో నియంత్రించలేకపోతున్నాం. 2050 నాటికి జనాభా166 కోట్లకు చేరనుంది.

భవిష్యత్​ భారత్​దే!

రష్యా ఒక్కటే మాత్రం తక్కువ జనాభా సమస్యను ఎదుర్కొంటున్నది. పుతిన్ ప్రభుత్వం అల్ప జనాభా సమస్యను అధిగమించడానికి మదర్ హీరోయిన్ అవార్డును ప్రవేశపెట్టారు.10 లేదా అంతకంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్న రష్యా మహిళను ఈ అవార్డుకు ఎంపిక చేయటంతో పాటు ఒక మిలియన్ రష్యన్ రూబుల్(13 లక్షల రూపాయలు) కూడా ఈ అవార్డు కింద అందజేస్తారు. జనాభా పెరుగుదల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టిన చైనా దేశం.. వృద్ధుల జనాభాతో నిండిపోయే ప్రమాదంలో పడింది. ఈ సమస్య పరిష్కారం దిశగా చైనా ప్రభుత్వం ఒకే బిడ్డ సంతానం విధానాన్ని ఎత్తివేయక తప్పలేదు. ప్రపంచంలో భారత దేశం జనాభాలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ 2023 నాటికి భారత జనాభాలో యువశక్తి 28.7 శాతంగా ఉండబోతుంది. ఈ అనుకూలత ప్రపంచంలో మరే దేశానికి లేదు. యువభారతానికి నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే అన్ని రంగాల్లో భారత్​ముందడుగు వేయడమే కాదు ప్రపంచ స్థాయి పోటీని తట్టుకొని ప్రభుత్వం, ప్రజలు ఆశిస్తున్నట్టుగా భారత్ విశ్వగురువుగా మారే అవకాశం లేకపోలేదు. మానవ వనరుల నాణ్యతను పెంచి వాటిని ఉపయోగించుకునే ప్రణాళికలను ప్రభుత్వాలు రూపొందించాలి. అధిక జనాభా పరిమాణం ఆర్థిక అభివృద్ధికి ప్రతిబంధకమైతే జనాభా నాణ్యత ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందనటంలో  సందేహమే లేదు. ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లకు చేరిన సందర్భంలో ఐక్యరాజ్యసమితి జనాభా నిధి ఆశిస్తున్నట్లుగా ఇది వేడుక చేసుకోవాల్సిన సందర్భమే. కానీ అదే సమయంలో కోట్లాదిమంది శాంతియుతంగా జీవించడానికి అనువైన ప్రపంచాన్ని ఎలా సృష్టించాలో అందరూ ఆలోచించాలి. 800 కోట్ల ఆశలు. అవకాశాలు. స్వప్నాలకు మన భూమండలం ఆవాసం అని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి ట్విట్ చేసింది. భూమండలం జన మండలంగా మారిన ఈ తరుణంలో యుద్ధాలకు ఇది సమయం కాదు. ప్రపంచమంతా కలిసి నడుస్తూ గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టి పర్యావరణాన్ని కాపాడుకుంటే ప్రపంచ మానవాళి మనుగడ ప్రమాదం నుంచి బయటపడుతుంది.

- డా.తిరునహరి శేషు,  సోషల్​ ఎనలిస్ట్