ఐక్యరాజ్య సమితి మౌనం సరికాదు

ఐక్యరాజ్య సమితి పేరులోనే దేశాల ఐక్యత ఉంది. దేశాలన్నీ  కలసి ఉంటేనే శాంతి సాధ్యమవుతుంది. శాంతే లక్ష్యంగా పని చేసే ప్రపంచ అత్యున్నత సంస్థ ఇది. తన చార్టర్ లో ప్రధాన సూత్రం కూడా దేశాల మధ్య శాంతిని, స్నేహాన్ని పెంపొందించడమే. కొద్ది రోజులుగా ఉక్రెయిన్ ను రష్యా ఏ క్షణమైనా ఆక్రమించవచ్చు అనే వార్తలు చూస్తున్నాం. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్​పై రష్యా దాడిని అడ్డుకుంటామని, రష్యా యుద్ధానికి దిగితే తగిన గుణపాఠం చెప్తామని అమెరికా హెచ్చరికలు చేస్తున్నది. ఇలాంటి టైమ్​లో ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలు తగ్గింపు, యుద్ధాన్ని నిలువరించే ఒక్క ప్రకటన కూడా ఐక్యరాజ్య సమితి నుంచి వెలువడటం లేదు. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం పెరుగుతుంటే ఐక్యరాజ్య సమితి సైలెంట్​గా ఉండడం, యుద్ధాన్ని ఆపేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యకరం. అమెరికా వల్లే యూఎన్‌ మౌనంగా ఉందని  ప్రపంచ ​పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా కనుసన్నల్లో

ఏ దేశమైన ఇతర దేశాలపై దాడి దిగితే అడ్డుకోవాల్సిన  బాధ్యత యూఎన్‌పై ఉంది.  ఉక్రెయిన్-–రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ పరిస్థితిలో కూడా సంస్థ ముఖ్య కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ నోరు విప్పకపోవడం చూస్తే సమితి పూర్తిగా అమెరికా చెప్పు చేతలలో ఉన్నట్లు అర్థమవుతోంది. కొన్నాళ్లుగా యూఎన్‌ పని తీరు అసంతృప్తికరంగా ఉంటున్నది. నార్త్‌ కొరియా న్యూక్లియర్​ వెపన్స్​పై రీసెర్చ్​లు చేస్తున్నా చప్పుడు చేయట్లేదు. ఆ దేశానికి ఒక్క హెచ్చరిక కూడా చేయకపోవడం సమితి వైఫల్యమే. ఉక్రెయిన్‌పై రష్యా, అమెరికాలు ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేస్తుంటే శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించకుండా చోద్యం చూస్తున్నది. 

జర్మనీ​ చాన్స్​లర్ చొరవ

ఉద్రిక్తతలు పెరిగిన టైంలో జర్మనీ రంగంలోకి దిగింది. జర్మనీ చాన్స్​లర్ ​ఓలాఫ్‌ షోల్జ్‌ రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ముందుకు వచ్చారు. సోమవారం ఉక్రెయిన్, మంగళవారం రష్యాలో పర్యటించి ఇరు దేశాల నేతలతో సమావేశమై యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నాలు చేశారు. ఓ యూరోపియన్ దేశం శాంతికి నడుం కట్టడం నిజంగా విశేషం. ఉక్రెయిన్ సావర్నిటీకి ఎటువంటి ముప్పు రానీయమని అమెరికా భరోసా ఇస్తోంది. అదే టైమ్​లో యుద్ధానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ క్యాపిటల్‌ కీయివ్‌లో జనాలు..  యుద్ధం దేనికి సమాధానం కాదంటూ శాంతి ర్యాలీ చేపట్టారు.  

ఏం చేయాలి

ఇంతా జరుగుతున్నా.. ఐక్యరాజ్య సమితి ఎలాంటి ప్రకటన చేయకుండా, చర్యలు చేపట్టకుండా సైలెంట్ గా ఉండడం కరెక్ట్​ కాదు. దేశాల మధ్య శాంతి సాధన అనే తన మెయిన్ టార్గెట్​కు సమితి ఇస్తున్న విలువ, గౌరవం ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఇంకా లేటు చేయకుండా వెంటనే రంగంలోకి ఉక్రెయిన్– రష్యాల మధ్య శాంతి స్థాపనకు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ఉద్రిక్తతలను తగ్గించి ఉక్రెయిన్ ప్రజల్లో యుద్ధభయాన్ని పోగొట్టాలి. ఆ దిశగా సమితి తన పాత్ర పోషిస్తుందని ఆశిద్దాం.