ఫారిన్ వర్సిటీలకు ఓకే

ఫారిన్ వర్సిటీలకు ఓకే

ఫారిన్ వర్సిటీలకు ఓకే
ఇండియాలో క్యాంపస్​లు ఓపెన్ చేసేందుకు ఓకే
డ్రాఫ్ట్ రూల్స్ విడుదల చేసిన యూజీసీ 
ఆఫ్ లైన్ కోర్సులకు మాత్రమే అనుమతి 
ఆన్ లైన్, డిస్టెన్స్ కోర్సులు పెట్టేందుకు నో  

విదేశాల్లోని ప్రముఖ వర్సిటీలు ఇకపై మన దేశంలోనూ క్యాంపస్ లను ఓపెన్ చేయొచ్చని యూజీసీ  ప్రకటించింది. వర్సిటీల్లో అడ్మిషన్లు, ఫీజుల వంటి అంశాలపై యూజీసీ గురువారం డ్రాఫ్ట్ రూల్స్ ను విడుదల చేసింది.

న్యూఢిల్లీ : విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీలు కూడా ఇకపై మన దేశంలో క్యాంపస్ లను ఓపెన్ చేయొచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. వర్సిటీల్లోకి అడ్మిషన్లు, ఫీజుల క్రైటేరియా, నిధుల నిర్వహణ వంటి అంశాలపై యూజీసీ గురువారం డ్రాఫ్ట్ రూల్స్ ను విడుదల చేసింది. అయితే, దేశంలో క్యాంపస్ లను ఏర్పాటు చేసే విదేశీ వర్సిటీలు ఆఫ్ లైన్ మోడ్ లో మాత్రమే కోర్సులు నిర్వహించాలని, ఆన్ లైన్ లేదా డిస్టెన్స్ మోడ్ కోర్సులను ఆఫర్ చేయొద్దని యూజీసీ చైర్ పర్సన్ ఎం. జగదీశ్ కుమార్ స్పష్టం చేశారు. కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ)లో పేర్కొన్న మేరకు దేశంలో ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ తో విద్యను అందించేందుకు విదేశీ వర్సిటీలకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. ఫీజులు, అడ్మిషన్ల ప్రాసెస్ ను ఆయా వర్సిటీలే నిర్ణయించుకోవచ్చని, అయితే ఇవి రీజనబుల్, ట్రాన్స్ పరెంట్ గా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. తొలిదశలో పదేండ్ల కాలానికి విదేశీ వర్సిటీలకు అనుమతి ఇస్తామని, ఆ తర్వాత 9వ ఏడాదిలో రివ్యూ చేసి, నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే రెన్యువల్ చేస్తామన్నారు. ప్రస్తుత డ్రాఫ్ట్ రూల్స్ పై ఫీడ్ బ్యాక్ ను పరిశీలించిన తర్వాత ఈ నెల చివరికల్లా పూర్తిస్థాయి గైడ్ లైన్స్ ను రూపొందిస్తామని ఆయన వెల్లడించారు.

యూజీసీ డ్రాఫ్ట్ రూల్స్ ఇవే..

* మన దేశంలో క్యాంపస్​లను ఓపెన్ చేసే విదేశీ వర్సిటీలు ప్రపంచంలోని టాప్ 500 వర్సిటీల్లో చోటు పొంది ఉండాలి. లేదంటే సబ్జెక్ట్ వైజ్ గా ప్రపంచ ర్యాంకింగ్ లో మెరుగైన స్థానంలో ఉండాలి. సొంత దేశంలో ప్రముఖ వర్సిటీగా పేరు అయినా పొంది ఉండాలి. 

* విదేశీ వర్సిటీల నుంచి వచ్చే అప్లికేషన్లను పరిశీలించి, అనుమతులు ఇచ్చేందుకు యూజీసీ ప్రత్యేకంగా ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆయా వర్సిటీల క్రెడిబిలిటీ, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ను బట్టి ఈ కమిటీ సిఫారసులు చేస్తుంది. 

* ఫారిన్ వర్సిటీలు పూర్తి స్వతంత్రంగా పనిచేయాలి. అలాగే ఇండియా లేదా విదేశాల నుంచి ఫ్యాకల్టీని నియమించుకోవచ్చు. అయితే, వర్సిటీల ఫ్యాకల్టీ నిర్దేశించిన కాలం వరకూ క్యాంపస్ లోనే నివసించాలి. 

* విదేశీ వర్సిటీల నిర్వహణ, కోర్సులు.. దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత్వం, మిత్రదేశాలతో సంబంధాలు, మోరాలిటీ వంటి వాటికి భంగం కలిగించేలా ఉండకూడదు. 

* వర్సిటీలకు నిధుల నిర్వహణ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఈ చట్టానికి లోబడే విదేశాల నుంచి నిధులు తేవడం, సొంత దేశాలకు నిధులు ట్రాన్స్ ఫర్ చేసుకోవడం వంటివి చేయాలి. నిధుల నిర్వహణపై ఆడిటింగ్ చేసి, ఏటా రిపోర్ట్​ను 
సమర్పించాలి.