రూల్స్‌కు తగ్గట్టు గోవా ప్లాంట్ లేదని వెల్లడి
న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్‌కు యూఎస్ ఎఫ్‌డీఏ వార్నింగ్ లెటర్ ఇష్యూ చేసింది. ఈ ఏడాది కంపెనీ గోవా ప్లాంట్‌ను పరిశీలించిన ఎఫ్‌డీఏ , రూల్స్‌కు తగ్గట్టు ప్లాంట్ నిర్వహణ లేదని, ఈ ప్లాంట్‌లో తయారైన డ్రగ్స్ క్వాలిటీ బాగోలేదని పేర్కొంది. లేబరేటరీను కంట్రోల్ చేసే మెకానిజం ఫెయిలయ్యిందని గ్లెన్‌మార్క్ ఎండీకి రాసిన వార్నింగ్ లెటర్‌లో వివరించింది. కరెంట్ గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ (సీజీఎంపీ) రూల్స్‌ను గ్లెన్‌మార్క్ బార్డెజ్ (గోవా) ప్లాంట్ ఫాలో కావడం లేదని తెలిపింది. ఈ ప్లాంట్‌లో డ్రగ్ ఫార్ములేషన్స్‌ను కంపెనీ తయారు చేస్తోంది. ‘మీ విధానాలు లేదా తయారీ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, హోల్డింగ్ సీజీఎంపీ రూల్స్‌కు తగ్గట్టు లేవు. మీ డ్రగ్ ప్రొడక్ట్స్ క్వాలిటీ తక్కువగా ఉంది’ అని యూఎస్ ఎఫ్‌డీఏ పేర్కొంది.
ఈ ఏడాది మే 12 నుంచి మే 20 మధ్య గ్లెన్‌మార్క్ గోవా ప్లాంట్‌ను ఎఫ్‌డీఏ పరిశీలించింది. రిజెక్ట్ అయిన డ్రగ్ బ్యాచ్‌లపై చేస్తున్న ఇన్వెస్ట్‌గేషన్‌ను ఇతర బ్యాచ్‌లు, డోస్‌ల సామర్థ్యం వంటి అంశాల్లో జరపడంలో కంపెనీ ఫెయిలయ్యిందని వివరించింది. ప్రొడక్షన్ విషయంలో రాత పూర్వకమైన విధానాలు ఏర్పాటు చేయడంలో ఫెయిలయ్యిందని వార్నింగ్ లెటర్‌లో ఎఫ్‌డీఏ పేర్కొంది. లేబరేటరీ కంట్రోల్ మెకానిజమ్‌ను ఏర్పాటు చేయలేదని ఆక్షేపించింది. ఈ లెటర్ అందుకున్న తర్వాత నుంచి 15 వర్కింగ్ డేస్‌లో రాత పూర్వకంగా స్పందించాలని పేర్కొంది. గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలపాలంది.