అమెరికా వింత ప్లాన్.. 520 అణుబాంబులతో సూయజ్ కు ఆల్టర్నేటివ్!

కొన్నిసార్లు ముందూ వెనుకా ఆలోచించకుండా దూకుడుగా తీసుకునే నిర్ణయాలు ఎంత విడ్డూరంగా ఉంటాయో ఆ సమయంలో  బుర్రకు తట్టదు. తర్వాత స్థిమితంగా చెక్ చేసుకుంటే విషయం బోధపడుతుంది. అలాంటి పరిస్థితే దాదాపు 60 ఏండ్ల క్రితం అగ్రరాజ్యం అమెరికాకు ఎదురైంది. ఈజిప్టులో ఉన్న సూయజ్ కెనాల్‌కు ఆల్టర్నేటివ్‌గా మరో కెనాల్ నిర్మించాలని ఆలోచన చేసింది. ఇటీవల సూయజ్ కెనాల్‌లో ఎవర్ గ్రీన్ షిప్‌ ఇరుక్కుపోయిన ఘటన నేపథ్యంలో అమెరికా మంచి నిర్ణయమే తీసుకుంది కదా అనిపిస్తుంది. కానీ ఆల్టర్నేటివ్‌ కెనాల్ నిర్మాణానికి అమెరికా ఎంచుకున్న విధానం తెలిస్తే ఎంతటి మూర్ఖపు ఆలోచన చేసిందో అర్థమవుతుంది. 10 లక్షల 40 వేల టన్నుల అణు బాంబులు వాడి సూయజ్ కెనాల్‌కు సమాంతరంగా తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌లో అమెరికా భారీ కెనాల్ తవ్వాలని అనుకుంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లో 100 కిలోల లోపు బరువున్న రెండు అణు బాంబులు వేస్తేనే జరిగిన విధ్వంసం, విడుదలైన రేడియేషన్‌ గురించి తెలిసీ, యూఎస్ మళ్లీ బాంబులతో కెనాల్ తవ్వే ఆలోచన ఎట్ల చేసిందో మరి!

ఈజిప్టులోని సూయజ్ కెనాల్‌లో అడ్డం తిరిగి నిలిచిపోయిన ఎవర్ గ్రీన్ షిప్ వారం రోజుల కష్టం తర్వాత మళ్లీ సెట్ రైట్ అయింది. కానీ ఆ ఏడు రోజుల టైమ్‌లో కొన్ని వందల షిప్‌ల రాకపోకలు నిలిచిపోయాయి. అప్పటికే కెనాల్‌లో ప్రయాణిస్తున్న భారీ కార్గో షిప్‌లన్నీ నిలిచిపోవడంతో కొత్తగా అటు వెళ్లాల్సిన వేరే షిప్‌లకు కూడా ఇబ్బంది ఎదురైంది. దీంతో వేల కోట్ల డాలర్ల నష్టం జరిగిందని ప్రపంచ  ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ సూయజ్ కెనాల్‌కు ఆల్టర్నేటివ్‌గా మరో మార్గం ఉంటే ఇతర షిప్‌లకైనా సమస్య ఉండేది కాదు కదా? అని ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ ఆలోచన ఇప్పుడు కాదు అమెరికాకు ఎప్పుడో వచ్చింది. అయితే ఆ ఐడియా రావడం వెనుక పెద్ద చరిత్రే ఉంది.

సూయజ్‌ కెనాల్ ఇట్ల వచ్చింది..

ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ది పీర్సింగ్ ఆఫ్ ది ఇస్తమస్ ఆఫ్ సూయజ్ పేరిట ఒక కమిషన్ ఏర్పాటు చేసుకుని ఈజిప్టు, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా సహా మొత్తం ఏడు దేశాలు కలిసి సూయజ్ కెనాల్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నాయి. సూయజ్ కెనాల్ కంపెనీని ఏర్పాటు చేసి 1859లో సూయజ్ కెనాల్ తవ్వకాన్ని  మొదలు పెట్టారు. ఈజిప్టుకి, యూరప్‌కి మధ్య ఉన్న మధ్యధరా సముద్రాన్ని, ఈజిప్టు కింది భాగంలో ఉన్న ఎర్ర సముద్రాన్ని కలుపుతూ దాదాపు 1,500 అడుగుల లోతున 6 వేల అడుగుల వెడల్పుతో ఈ కెనాల్ తవ్వారు. 192 కిలో మీటర్ల పొడవైన ఈ కాలువ తవ్వకానికి పదేండ్ల టైమ్ పట్టింది. అమెరికా, యూరప్ నుంచి ఆసియా దేశాలకు సముద్రంలో నౌక ప్రయాణానికి ఈ కాలువ అందుబాటులోకి రావడంతో ఆఫ్రికాను చుట్టి వచ్చే పని తప్పిపోయింది. మధ్యధరా సముద్రం, సూయజ్ కాలువ, ఎర్ర సముద్రం మీదుగా హిందూ మహాసముద్రంలోకి నౌకలు రావడం స్టార్ట్‌ అయింది. దీంతో వేల కిలోమీటర్ల దూరం తగ్గిపోయింది. 

1956 వార్‌‌ తర్వాత అమెరికా నిర్ణయం

మొదట్లో ఈ సూయజ్ కాలువ ఆపరేషన్ ఫ్రాన్స్‌ కంట్రోల్‌లో ఉండేది. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటన్ ప్రొటెక్షన్ ఇచ్చి నడిపించింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం టైమ్‌లో జర్మనీ సూయజ్ కెనాల్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నించింది. ఈసారి బ్రిటన్ మిత్రదేశాల బలగాలు అడ్డుకుని రక్షణగా నిలిచాయి. వార్ 1939 నుంచి 1945 వరకే జరిగినా, బలగాలు మాత్రం 1954 వరకు అక్కడే ఉన్నాయి. అయితే 1956లో ఈజిప్టు తమ దేశంలో నిర్మించాలనుకున్న ఒక భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సోవియట్ యూనియన్ సాయం చేస్తామనడంతో ఈజిప్టు అటు వైపు కూటమిలో చేరడం, ఆ తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలతో సూయజ్ కెనాల్‌ తమ దేశంలో ఉన్నందున, అది తమ జాతిసంపద అంటూ జాతీయం చేస్తున్నామని 1956 జూలై 29న ఈజిప్టు ప్రెసిడెంట్ గామల్ అబ్దుల్ నాజర్ ప్రకటించారు. దీంతో గుర్రుగా ఉన్న బ్రిటన్, ఫ్రాన్స్​లు ఈజిప్టుపై యుద్ధానికి దిగాయి. ముందు తమ మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌తో ఈజిప్టుపై అటాక్ చేయించి, ఆ తర్వాత రంగంలోకి దిగి తమ ప్రతీకారం తీర్చుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఐక్యరాజ్యసమితి, ఇజ్రాయెల్ జోక్యం చేసుకున్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్, ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చి అవి వెనుకడుగేసేలా చేశాయి. బ్రిటన్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్‌ విలువను కుప్పకూల్చి ఆ దేశాన్ని యుద్ధం విరమించేలా ఐక్యరాజ్యసమితి చేసింది. దీని తర్వాత ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికా ఎదిగింది. ఆ వార్ సమయంలో కొన్ని నెలల పాటు సూయజ్ కెనాల్‌లో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ టైమ్‌లోనే సూయజ్ కెనాల్‌కు ఆల్టర్నేటివ్‌పై యూఎస్ దృష్టి పెట్టింది. ఈజిప్టుకు పక్కనే ఉన్న ఇజ్రాయెల్‌ను ఇందు కోసం ఎంచుకుంది. అటు మధ్యధరా, ఇటు ఎర్ర సముద్రాన్ని కలిపేలా మధ్యలో ఉన్న ఇజ్రాయెల్‌లోని నెగెవా ఎడారిలో కెనాల్‌ను తవ్వాలని నిర్ణయించింది.

రాజకీయ, వాతావరణ అంశాలు పట్టించుకోలే

అణు బాంబులతో కెనాల్ తవ్వితే వేగంగా పూర్తవుతుందని అమెరికా అనుకుంది. కానీ అసలు రాజకీయ, పర్యావరణ పరంగా ఉండే ఫ్యాక్టర్స్​ని ఏ మాత్రం పట్టించుకోలేదు. అమెరికా అనుకున్న దాని ప్రకారం ఇజ్రాయెల్‌లో మొత్తం 256 కిలోమీటర్ల పొడవునా వేల అడుగుల లోతైన కాలువ తవ్వాలి. ఇందులో 208 కిలోమీటర్ల దూరం ప్రతి ఒకటిన్నర కిలోమీటర్‌‌కు 2 వేల టన్నుల బరువైన అణు బాంబులను నాలుగేసి చొప్పున పెట్టాలని అనుకుంది. ఈ ప్రకారం మొత్తం 520 ఆటం బాంబులు. అంటే మొత్తంగా 10 లక్షల 40 వేల టన్నుల బరువు. ఈ రేంజ్‌లో అణు బాంబులు పేలిస్తే అమెరికా అనుకున్నట్టు భారీ లోతు కాలువ ఏర్పడడం సాధ్యమేనేమో కానీ, వాటి నుంచి విడుదలయ్యే అటామిక్ రేడియేషన్, ఆ తర్వాత ఆ ప్రాంతంపై పడే ఎఫెక్ట్స్, సముద్రపు నీరు, అందులోని జీవాల పరిస్థితి వంటి వాటిపై ఆ టైమ్‌లో ఏ మాత్రం ఆలోచన చేయలేదు. హీరోషిమాలో 64 కిలోల అణుబాంబు వేస్తేనే దశాబ్దాల పాటు ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అలానే ఉందన్నది ప్రపంచానికి తెలిసిందే.  పైగా ఇజ్రాయెల్‌లో ఈ పని చేస్తుంటే ఆ దేశం పక్కనే ఉన్న దాని శత్రు దేశాలు సౌదీ సహా ఇతర అరబ్ కంట్రీస్ ఏవీ దీనికి ఒప్పుకొనే ప్రసక్తే ఉండదని పొలిటికల్ ఇష్యూను కూడా అమెరికా ఆలోచించలేదు. 

మామూలుగా తవ్వాలంటే భారీగా ఖర్చయితదని..

సూయజ్ కెనాల్‌కు ఆల్టర్నేటివ్‌గా ఇజ్రాయెల్‌లో కెనాల్‌ను తవ్వాలనుకున్న అమెరికా మామూలుగా మనుషులు, అందుబాటులో ఉన్న యంత్రాలతో ఈ పని చేస్తే భారీ ఖర్చుతో పాటు కొన్నేండ్ల సమయం పడుతుందని తేల్చింది. ఎలాగైనా వేగంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసేయాలనుకున్న ఆ దేశానికి ఓ వింత ఐడియా వచ్చింది. తమ చేతిలో ఉన్న అణు బాంబులు వాడి కాలువ తవ్వితే ఎలా ఉంటుందన్నది ఆలోచించింది. దీనిపై ఫీజిబులిటీ రిపోర్ట్‌ కూడా రెడీ చేయించింది. 1963లో రెడీ అయిన ఆ రిపోర్టును రహస్యంగా ఉంచిన అమెరికా 1996లో బయటపెట్టింది. అణు బాంబులతో వేగంగా, తక్కువ ఖర్చుతో 256 కిలోమీటర్ల కెనాల్ పూర్తి చేసేయొచ్చని ఆ రిపోర్టులో ఉంది.

ప్రయోగాలు చేసి పక్కన పడేసిన్రు

1963లో తయారు చేసిన రిపోర్టులో ఇటు ఎన్విరాన్‌మెంటల్, పొలిటికల్ విషయాలేవీ ప్రస్తావించకుండా అక్కడ కెనాల్ తవ్వేయొచ్చని, అణు బాంబులు, తవ్వకం, ఇంజనీరింగ్ వర్క్స్, సేఫ్టీ ప్రోగ్రామ్స్ అన్నింటికీ కలిపి 57.6 కోట్ల డాలర్ల ఖర్చు అవుతుందని తేల్చారు. కానీ ఆ తర్వాత అమెరికాలో వేర్వేరు చోట్ల కొన్ని కాలువ నిర్మాణం కోసం శాంపిల్ టెస్టింగ్ చేసేందుకు ఎడారుల్లో 27 అణు బాంబు పేలుళ్లు చేసి, భారీ భూప్రకంపనలు, రేడియేషన్ తీవ్రతను అమెరికా అటామిక్ ఎనర్జీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో ఇజ్రాయెల్‌లో కెనాల్ తవ్వకం ప్రతిపాదనను అమెరికా ప్రభుత్వం1974లో పక్కన పడేసింది.