- రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పిలుపు
- ఘనంగా ప్రారంభమైన అగ్రికల్చరల్యూనివర్సిటీ వజ్రోత్సవాలు
గండిపేట, వెలుగు: వ్యవసాయ రంగంలో 2047 నాటికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదగాలని వర్సిటీ చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. అందరి భాగస్వామ్యంతో వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణలో పురోగతి సాధించాలని సూచించారు. శుక్రవారం రాజేంద్రనగర్ లోని పీజేటీఏయూ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన అగ్రికల్చరల్యూనివర్సిటీ వజ్రోత్సవాలను ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
కిసాన్ మేళా, వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. తర్వాత ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వజ్రోత్సవాల మీనియేచర్ పైలాన్ ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్యతో కలిసి ప్రారంభించారు. కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ గుర్తింపు పత్రాలని అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్మాట్లాడుతూ.. 60 ఏండ్లుగా అగ్రికల్చరల్యూనివర్సిటీ వ్యవసాయ అభివృద్ధికి అసమాన సేవలను అందించిందన్నారు. సొనామసూరి, తెలంగాణ సోనా వంగడాలను రూపొందించిందన్నారు.
భవిష్యత్ ప్రణాళికల అమలులో పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి అధునాతన టెక్నాలజీని వ్యవసాయ రంగంలోకి విస్తృతంగా తీసుకురావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఎస్బీఐ సాయంతో త్వరలో ఏఐ ల్యాబ్ ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. వ్యవసాయ విద్యని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫీజులు తగ్గించడం స్వాగతించదగినదన్నారు. అలాగే స్పోర్ట్స్‌కాంప్లెక్స్ లో నిర్వహించిన కిసాన్ మేళాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులని ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రతి వ్యవసాయ కాలేజీ పరిధిలో ఒక ‘మోడల్ అగ్రికల్చర్ ఫాం’ను అభివృద్ధి చేయాలన్నారు. నీతి ఆయోగ్ సభ్యులు రమేశ్‌చంద్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయానికి మూలమైన విత్తనాలు 90 శాతం ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లడం దురదృష్టకరమన్నారు. శాస్త్రవేత్తలు గ్రామాలను దత్తత తీసుకోవాలన్నారు.
భవిష్యత్తులోసహకార వ్యవసాయ విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. కిసాన్ మేళా వేదికపై పలువురు రైతులకు అవార్డులు అందజేశారు.