ఐటీడీఏపై సర్కార్ ఫోకస్..ప్రక్షాళన, పూర్వ వైభవం దిశగా అడుగులు

  •     ఐదేండ్లుగా సమావేశాలకు నోచుకోని పాలకమండలి
  •     సమస్యలతో సతమతమవుతున్న గిరిజనులు 
  •     గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆదరణ కోల్పోయిన ఐటీడీఏ

ఆదిలాబాద్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) కొన్నేండ్లుగా అస్తవ్యస్తంగా మారింది. గిరిజనుల అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన ఐటీడీఏ.. పాలకుల నిర్లక్ష్యానికి గురై ఆదరణ కోల్పోయింది. ఏండ్ల తరబడి ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోవడం, గత ప్రభుత్వం వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు.

రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం గిరిజానాభివృద్ధి సంస్థపై ఫోకస్ పెట్టింది. ఐటీడీఏలకు పూర్వ వైభవం తీసుకొస్తామని డిప్యూటీ సీఏం భట్టి విక్రమార్క ఇటీవల భద్రాచలం పాలక మండలి సమావేశంలో ప్రకటించడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల్లో ఆశలు చిగురించాయి. 

నిత్యం పీఓల బదిలీ..

గిరిజనుల సమస్యల పరిష్కారం, అభివృద్ధి అంశాలపై ప్రతి మూడు నెలలకోసారి చేపట్టాల్సిన ఐటీడీఏ పాలక మండలి సమావేశాలు గత ఐదేండ్లుగా నిర్వహించలేదు.  చివరిసారిగా 2019 అక్టోబర్ లో నిర్వహించి, ఆ తర్వాత పాలకులు దాని ఊసే ఎత్తలేదు. ఎలాంటి చర్చలు లేకపోవడంతో గిరిజన అభివృద్ధి, సంక్షేమం కోసం ఐటీడీఏ ద్వారా చేపడుతున్న పథకాలకు నిధులు విడుదల కావడం లేదు. దీంతో గిరిజనులకు ఆర్థిక సహాయ పథకాలు అందని ద్రాక్షగానే మిగిలాయి. నిత్యం పీఓల బదిలీ సైతం వారి అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది.

ఐటీడీఏ పీఓగా పనిచేసే అధికారులు గిరిజనుల సంక్షేమంతోపాటు వారి సంస్కృతిని, జీవన శైలి, ఆర్థిక పరిస్థితి తెలుసుకుని పనిచేసి వారి అభివృద్ధికి పాటుపడాలి. అయితే గిరిజనుల పరిస్థితి తెలుసుకొని, వారికి దగ్గరయ్యేలోపే ఇటీవల పీవోలను బదిలీ చేస్తుండటంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని ఆదివాసీ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.  ఐటీడీఏ గ్రీవెన్స్ నామమాత్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

చాలా సందర్భాల్లో పీఓకు బదులు కిందిస్థాయి అధికారులు గ్రీవెన్స్ తీసుకోవడంతో ఆదివాసీలు సైతం అంతగా ఆసక్తి చూపడం లేదు. గ్రీవెన్స్​లో ఫిర్యాదులు ఇచ్చినా వాటి పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేకపోవడంతో సమస్యలను పట్టించుకోవడంలేదని ఆరోపణలు ఉన్నాయి.

ఎక్కడి సమస్యలు అక్కడే..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో ప్రతి ఏడాది వేసవిలో నీటి ఎద్దడి నెలకొం టోంది. ఐటీడీఏ పరిధిలోని నార్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, సిరికొండ, గాదిగూడ, కెరమెరి, తిర్యాణి, లింగాపూర్ తదితర మండలాల్లోని దాదాపు 50 గ్రామాల్లో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు ఎప్పుడు సరఫరా అవుతుందో తెలియని పరిస్థితి. దీంతో కిలోమీటర్లు నడుచుకుంటూ వాగులు, చెలిమెల నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. ప్రతి ఏడాది ఈ సమస్యలపై అధికారులకు ఆదివాసీలు విన్నవిస్తున్నా శాశ్వత పరిష్కారం చూపడం లేదు.

కొన్ని గ్రామాల ప్రజలు కలెక్టరేట్​వద్ద ఆందోళనకు సైతం దిగారు. గత ప్రభుత్వాలు రోడ్లు, వంతెనలు నిర్మించకపోవడంతో వర్షకాలంలో బయటకు వెళ్లలేక ఆదివాసీలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అత్యవసరమైతే ప్రమాదకరంగా వాగుదాటాల్సిన పరిస్థితి. వైద్యం కోసం వాగులు దాటలేక గతంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సరైన రోడ్డు

వంతెన మార్గాలు లేక ప్రతి ఏడాది గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. ఇలాంటి ఎన్నో సమస్యలపై దృష్టిపెట్టాల్సిన ఐటీడీఏలు నామమాత్రంగా మారాయి. ఈ నేపథ్యంలో కొత్త సర్కార్ ఐటీడీఏలపై దృష్టి పెట్టింది. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై పూర్తిస్థాయిలో ప్రణాళిక రూపొందించేందుకు
 సిద్ధమవుతోంది. 

ఇన్​చార్జి మంత్రి రివ్యూ మీటింగ్..

పదేండ్ల కాలంగా ఐటీడీఏల్లో నిధులు లేక అభివృద్ధి నీరుగారిపోయింది. గిరిజనులకు విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు వంటి కనీస సదుపాయాలు సరిగా అందలేదు. గిరిజనుల జీవన ప్రమాణాలు అనుకున్న స్థాయిలో మెరుగుపడటం లేదని గిరిజన సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీడీఏలను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది.

ఉమ్మడి జిల్లా ఇన్​చార్జి మంత్రిగా ఉన్న సీతక్క గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఐటీడీఏ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఐటీడీఏ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి సీతక్క హామీతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీగా నిధులు కేటాయించి ఐటీడీఏ బలోపేతానికి కృషి చేయాలని ఆయా సంఘాల నాయకులు కోరుతున్నారు.