వడ్డెరల బతుకులు  మారేదెన్నడు?

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి దూరమైన అనేక సంచార జాతులు స్వరాష్ట్రంలోనైనా తమ బతుకులు మారుతాయని ఆశపడ్డాయి. కానీ వారి జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ప్రభుత్వం సంక్షేమం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నా.. వాటి ఫలాలు అందని వారు ఇంకా ఎంతో మంది ఉన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు దక్కక ఇంకా వారు పేదరికంలోనే మగ్గుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వారి సంక్షేమం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది.

బ్రిటీష్ ప్రభుత్వం వడ్డెరలను1871లో క్రిమినల్ యాక్ట్ లో చేర్చింది. ఆ భయంతో వడ్డెరలు సంచార జీవులుగా మారారు. ఏ నేరం చేయకున్నా వారు సంచారులుగా ఏండ్ల పాటు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యం తర్వాత భారత ప్రభుత్వం1950 ఆగస్టు 31న అప్పటి వరకు వడ్డెరలపై ఉన్న క్రిమినల్ యాక్ట్ ను తొలగించింది.1975లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరామన్ కమిషన్ దేశంలోని కులాల సమీక్షలో భాగంగా విముక్త జాతుల కులాలను కూడా సమీక్షించింది. వడ్డెర కులంతో పాటు విముక్త జాతుల్లో ఉన్న లంబాడి, ఎరుకల, యానాది కులాలను షెడ్యూల్డ్ తెగలో చేర్చిన కమిషన్ .. వడ్డెర కులానికి ప్రత్యేక భాష లేదన్న కారణంగా ఈ ఒక్క వర్గాన్ని బీసీల్లో చేర్చింది. దీని వల్ల వడ్డెరలు అన్ని రకాలుగా అన్యాయానికి గురయ్యారు. విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కోల్పోయారు. దీంతో1950 నుంచి ఇప్పటి వరకు తమను షెడ్యూల్డ్ తెగలో చేర్చాలని వారు ప్రభుత్వాలతో పోరాటం చేస్తూనే ఉన్నారు.

రిజర్వేషన్లలో అన్యాయమే..

దేశ వ్యాప్తంగా వడ్డెరలది దాదాపు 4 నుంచి 6 కోట్ల జనాభా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు 20 లక్షల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుత తెలంగాణ సీఎం గతంలో మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నపుడు వడ్డెర కులాన్ని షెడ్యూల్డ్ తెగలో చేర్చే ప్రయత్నం చేస్తానని హామీ చెప్పారు. కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా ఉండి 8 ఏండ్లు కావస్తున్నా వడ్డెరలను పట్టించుకోలేదు. ఆ సామాజిక వర్గం నాయకులను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. వడ్డెరల ప్రధాన వృత్తి చెరువులు, కుంటలు, బావులు తవ్వడం, రహదారులు, ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో పాలుపంచుకోవడం. ఇలాంటి పనుల్లో ప్రభుత్వ పరంగా వచ్చే కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ, ఎస్టీ, వడ్డెరలకు కలుపుకొని15 శాతం రిజర్వేషన్స్ ఉండే. దాదాపు 6 శాతం పనులు ప్రభుత్వ పనుల కాంట్రాక్టుల నుంచి 2015 వరకు వడ్డెరలకు వచ్చేవి. కానీ రాష్ట్రం ఏర్పాటు తరువాత 2017లో 15 శాతం ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టు పనుల రిజర్వేషన్స్ 24 శాతానికి పెంచారు. అయితే ఆ రిజర్వేషన్లలో 15 శాతం ఎస్టీలకు, 6 శాతం ఎస్సీలకు ప్రకటించి మిగిలిన 3 శాతం పనుల్లో వడ్డెరలతో పాటు సగరులను కలిపి ఇచ్చారు. ఇలా వడ్డెరలకు స్వరాష్ట్రంలో అన్యాయం జరిగింది. 20 లక్షలకు పైగా ఉన్న వడ్డెరల ప్రధాన వృత్తిని గమనించి వారికి ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. 

ఫెడరేషన్​కు పాలకవర్గం లేక..

తెలంగాణ ఏర్పాటుకు ముందె వడ్డెరలకు ఫెడరేషన్ ఉంది. అయితే ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు. రాష్ట్రం ఏర్పడి జరిగి 8 ఏండ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు ఆ ఫెడరేషన్ కు పాలక వర్గం లేదు. నిధుల విడుదల కూడా నామమాత్రమే. ఫెడరేషన్ ద్వారా ఆర్థిక సాయం పొందడం కోసం ప్రభుత్వ నిబంధనల మేరకు సొసైటీలుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. లబ్ధి పొందింది శూన్యమే. ప్రస్తుతం రాయి పని, చెరువులు, బావుల తవ్వకాలు బాగా తగ్గాయి. ప్రభుత్వం వడ్డెరలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన అవకాశాలు చూపించాల్సి ఉన్నా.. అలా చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర ఫెడరేషన్ కోసం కనీసం రూ.1000 కోట్లు కేటాయించి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రాయి, మట్టి, పనులు చేస్తూ వడ్డెర లు ప్రాణాలు పోగొట్టుకుంటున్న సందర్భాలు చాలా ఉంటున్నాయి. అలాంటి వారికి ప్రభుత్వం 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. శాశ్వత అంగవైకల్యం కలిగితే కనీసం రూ.10 లక్షలు అందజేయాలి. 
‌‌‌‌- శ్రీనివాస్ తిపిరిశెట్టి, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర  సంచార జాతులం సంఘం