ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీకి ఎంత చరిత్ర ఉందో, దాన్ని ఆనుకొని ఉన్న కృష్ణవేణి(బీ) హాస్టల్‌కు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వంటి ఎంతో మంది మేధావులు, ఉద్యమకారులు ఇందులో ఆశ్రయం పొంది చదువులు పూర్తిచేశారు. అటువంటి దశాబ్దాల చరిత్ర కలిగిన బిల్డింగ్‌కు రిపేర్లు చేయించడంలో వర్సిటీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏడాదిగా ఖాళీగా పెట్టారు. ఓయూ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు పరిశీలించి రూ.కోటిన్నర ఖర్చుతో రిపేర్లు చేయొచ్చని ప్రతిపాదనలు చేయగా అవి కూడా బూజుపట్టాయి. ఫండ్స్లేవంటూ పట్టించుకోవడంలేదు. కాగా ఇటీవల రూ.40 కోట్లతో కొత్త హాస్టల్ బిల్డింగ్నిర్మించాలని అధికారులు పూనుకోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్విభాగం సూచించినట్లు కోటిన్నర కేటాయిస్తే మరో 20 ఏండ్ల పాటు కృష్ణవేణి బిల్డింగ్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఏడాదిగా రెనోవేషన్ చేయట్లేదని తెలుసుకున్న కొందరు ఓల్డ్ స్టూడెంట్లు ఫండ్స్ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
వందేండ్ల చరిత్ర
ఓయూ క్యాంపస్‌లోని బీ హాస్టల్ ది సుమారు వంద ఏండ్ల చరిత్ర. ఆర్ట్స్ కాలేజీ కట్టిన టైంలోనే దీనిని కూడా నిర్మించారు. రాయిగిరి నుంచి తెప్పించిన రాయి, డంగు సున్నంతో నిర్మించిన రెండంతస్తుల బిల్డింగ్‌లో 110 గదులు ఉన్నాయి. ఏండ్లుగా దాదాపు 400 మంది విద్యార్థులకు ఇందులో అకామిడేషన్ కల్పిస్తున్నారు. మొదట్లో ఆర్ట్స్, సైన్స్ స్టూడెంట్లను ఇందులో ఉంచారు. ఏటా స్టూడెంట్ల సంఖ్య పెరుగుతూ రావడంతో తర్వాత కేవలం సైన్స్ స్టూడెంట్లకే పరిమితం చేశారు. అయితే కొన్నేండ్లుగా తరచూ హాస్టల్గదుల్లోని శ్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. మైనర్ రిపేర్లు చేస్తూ నెట్టుకొచ్చిన వర్సిటీ అధికారులు, పూర్తిస్థాయిలో రెనోవేట్చేయాలని ప్రతిపాదించారు. అప్పటి నుంచి వీసీలు మారుతున్నారే కానీ హాస్టల్ బిల్డింగ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. విద్యార్థులను పూర్తిగా ఖాళీ చేయించి వదిలేశారు. అదిగో.. ఇదిగో అంటూ నెట్టుకొస్తున్నారే తప్ప బాగుచేయడం లేదు. దశాబ్దాలుగా స్టూడెంట్లతో కళకళలాడిన హాస్టల్ ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది.
ఫండ్స్ మేం ఇస్తామంటూ..
బీ -హాస్టల్లో ఉండి చదువుకున్న ఎంతో మంది ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారిలోని ఐదుగురు ఓల్డ్ స్టూడెంట్లు రెనోవేషన్‌కు అయ్యే ఖర్చు భరిస్తామని ముందుకు వచ్చినట్లు సమాచారం. కృష్ణవేణి హాస్టల్తమకు ఎంతో సెంటిమెంట్అని, ఎంతో మందిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన హాస్టల్ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని ఇటీవల ఓయూ అధికారులను కలిసినట్లు తెలిసింది. ఇప్పటికే ఆ ఐదుగురు ఓల్డ్ స్టూడెంట్లు హాస్టల్ రిపేర్లకు ఎస్టిమేషన్ వేయించినట్లు సమాచారం.
త్వరలోనే బాగుచేస్తం
కృష్ణవేణి(బీ) హాస్టల్‌ను పూర్తిగా మూసివేయలేదు. రిపేర్లు చేయాల్సి ఉంది. అందుకే స్టూడెంట్లను ఖాళీ చేయించాం. ఇదొక చారిత్రక బిల్డింగ్. రూ.2 కోట్లతో రిపేర్లు చేయిస్తాం. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.
– ప్రొఫెసర్ రవీందర్, ఓయూ వీసీ