ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వేములవాడ, వెలుగు :వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజామున ధర్మగుండంలో స్నానమాచరించిన భక్తులు తడిబట్టలతో లక్ష్మీ గణపతి స్వామి, రాజరాజేశ్వర స్వామి, రాజరాజేశ్వరి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామికి ఇష్టమైన కోడె మొక్కు చెల్లించుకున్నారు. గండాలు తొలిగిపోవాలని గండ ద్వీపం వద్ద నూనె పోసి, కళ్యాణ కట్ట తలనీలాలు, చిన్న పిల్లల పుట్టు వెంట్రుకలు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అలాగే  భీమేశ్వర స్వామి ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.  

పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం:ఎమ్మెల్యే రవిశంకర్ 

చొప్పదండి,వెలుగు: పల్లెల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలంలోని కాట్నపల్లిలో అంబేద్కర్ సంఘం, మల్లన్నపల్లిలో మహిళా సంఘ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తోందన్నారు. మిషన్ భగీరథతో మంచినీరు అందిస్తున్నామని, నీరు రాని గ్రామాలకు త్వరలో సమస్యను పరిష్కరిస్తామన్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామాలకు జీపీ భవనాలు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


భూ నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వండి:ఎమ్మెల్యే కోరుకంటి

గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం ఏరియాలోని ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ 4 వల్ల నష్టపోయిన లింగపూర్, మేడిపల్లి భూ నిర్వాసితులకు ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ ప్యాకేజీ ఇవ్వాలని, ఓపెన్ కాస్ట్ బ్లాసింగ్‌‌‌‌లతో కూలిన, బీటలు వారిన ఇండ్లకు పరిహారం చెల్లించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. సోమవారం హైదరాబాద్‌‌‌‌లో సింగరేణి సీఎండీ శ్రీధర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి సంస్థ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలని, పలు ప్రాంతాల్లో రోడ్లు, సైడ్‌‌‌‌ డ్రైన్లు, సెంట్రల్‌‌‌‌ లైటింగ్‌‌‌‌, లైబ్రరీ బిల్డింగ్‌‌‌‌, సీనియర్‌‌‌‌ సిటిజన్‌‌‌‌ హాల్స్‌‌‌‌, పార్క్‌‌‌‌ల నిర్మాణం చేపట్టాలని శ్రీధర్​ను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పై విషయంలో సీఎండీ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే
 పేర్కొన్నారు.


టీఆర్ఎస్, బీజేపీ లీడర్ల వాగ్వాదం

జమ్మికుంట, వెలుగు : పట్టణంలోని పురాతన శివాలయంలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో టీఆర్ఎస్, బీజేపీ లీడర్లు వాగ్వాదం చేసుకున్నారు. ఆర్యవైశ్యులు, రైస్​, కాటన్​ మిల్లర్ల సంఘం ఆధ్వర్యంలో ఆనాథలు, నిరుపేదల కోసం నిత్యాన్నదాన పథకాన్ని ఏడాది పొడవున నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. సోమవారం ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్​టి.రాజేశ్వర్​ రావు, జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడు చందా రాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు హజరయ్యారు. ఈక్రమంలో అన్నం వడ్డించడానికి టీఆర్ఎస్ నేతలు ముందుకు రాగా వారి నుంచి బీజేపీ నేతలు ఇస్తరాకుల కట్టలు, అన్నం నిండిన బేషన్ గిన్నలను గుంజుకోవడంతో నేతల మధ్య వాగ్వాదం జరిగింది. చందా రాజు, సంపత్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఎమ్మెల్యే ఈటల వారిని సముదాయించారు. దీంతో ఇరు పార్టీల లీడర్లు నినాదాలు చేసుకుంటూ బయటకు వెళ్లిపోయారు.


సంగ్రామ యాత్ర సభను సక్సెస్​ చేద్దాం:బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంగోపాల్ రెడ్డి  

చిగురుమామిడి, వెలుగు: డిసెంబర్​15 కరీంనగర్​లో జరిగే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను సక్సెస్​చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని పలు గ్రామాలలో బిజేపీ లీడర్లతో ఆయన మాట్లాడారు. ఆయన వెంట బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మురళి మనోహర్ తదితరులు ఉన్నారు. చొప్పదండి/రామడుగు:సంగ్రామ యాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ కోరారు. సోమవారం బీజేపీ మండలాధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో చొప్పదండి మండలం గుమ్లాపూర్, ఆర్నకొండ,​ కాట్నపల్లి, సాంబయ్యపల్లి, చాకుంట, వెదురుగట్ట, కొలిమికుంట, రుక్మాపూర్​, రేవెల్లి గ్రామాలలో యాత్ర  బహిరంగ సభ ఆహ్వాన పత్రాలను అందివ్వడంతోపాటు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చొప్పదండిలో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో లీడర్లు లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, కార్యకర్తలు​ పాల్గొన్నారు.

గన్నేరువరం: బీజేపీ బహిరంగ సభ పోస్టర్లను సోమవారం పార్టీ మండలాధ్యక్షుడు నగునూరి శంకర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ స్టేట్​లీడర్​సొల్లు అజయ్ వర్మ, మండల ఉపాధ్యక్షుడు మునిగంటి సత్తయ్య, నాయకులు మచ్చ బాలరాజు, వినయ్ ,అభిషేక్, బోయిని శివాజీ, రాజేందర్ పాల్గొన్నారు.కరీంనగర్ రూరల్: సంగ్రామ యాత్ర ముగింపు సభకు ప్రజలు అధిక సంఖ్యలో రావాలని పటాన్ చెరువు బీజేపీ లీడర్, పార్టీ మండల ఇన్​చార్జి ఎడ్ల రమేశ్​పిలుపునిచ్చారు. కరీంనగర్ రూరల్ మండలాధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో బొమ్మకల్​టీవీ గార్డెన్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 15న జరిగే సభకు ముఖ్యఅతిథిగా జేపీ నడ్డా హాజరవుతారని తెలిపారు. కోనరావుపేట :ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనడానికి కోనరావుపేట మండల బీజేపీ లీడర్లు సోమవారం తరలివెళ్లారు. ఈ సందర్భంగా కోనరావుపేటకు చెందిన మాజీ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బోయిని నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ లీడర్ ముదాం వెంకటేశ్ బీజేపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి సురేందర్ రావు, మోహన్, నాయకులు పాల్గొన్నారు. 

గడువులోగా పనులు పూర్తి చేయాలి:మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ టౌన్, వెలుగు: నగరంలో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనులు 2023 ఏప్రిల్ లోపు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం స్మార్ట్ సిటీ ఫేజ్2 పనుల్లో భాగంగా ఓల్డ్ పవర్ హౌస్​నుంచి నాఖా చౌరస్తా, మంగలివాడ  చౌరస్తా నుంచి వరాహ స్వామి టెంపుల్, టవర్ సర్కిల్ ఏరియా, రాజు టీ స్టాల్ రోడ్డుతో పాటు బొమ్మకల్ చౌరస్తా లో చేపడుతున్న పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు వేగంగా పూర్తి చేయాలని, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావొద్దని స్పష్టం చేశారు. పనుల పురోగతిపై  కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, రహదారుల శాఖలో ఉద్యోగాలను ప్రకటించడంతో ఆర్అండ్ బీ ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్ సుడా డైరెక్టర్ రవివర్మ, స్మార్ట్ సిటీ ఇంజనీర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.