న్యూఢిల్లీ: ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి వేదిక ఖరారైంది. ఈ నెలాఖర్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరుగుతుందని బీసీసీఐ వర్గాలు సోమవారం తెలిపాయి. ‘ఐపీఎల్ వేలం రియాద్‌లో జరుగుతుంది. దీని గురించి అన్ని ఫ్రాంచైజీలకు సమాచారం అందింది. ఈ నెల 24, 25వ తేదీల్లో వేలం ఉండొచ్చు’ అని పేర్కొన్నాయి. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్ వంటి ఇండియా స్టార్లు బరిలో నిలిచిన నేపథ్యంలో ఈ మెగా వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పది ఫ్రాంచైజీల వద్ద మొత్తంగా 641.5 కోట్లు ఉన్నాయి. 204 స్లాట్స్ ఖాళీగా ఉండగా.. ఇందులో 70 స్థానాలు విదేశీ ఆటగాళ్ల కోసం కేటాయించారు. రిటెన్షన్ విండోలో అన్ని ఫ్రాంచైజీలు కలిపి 46 మంది ప్లేయర్లు రిటైన్ చేసుకున్నాయి. ఇందుకోసం రూ. 558.5 కోట్లు ఖర్చు చేశాయి.