ఇంగ్లీషు టీచర్తో ఎందుకు మాట్లాడిన్రు? పాలకుర్తిలో విద్యార్థినులను తిట్టి చితకబాదిన వైస్ ప్రిన్సిపాల్

ఇంగ్లీషు టీచర్తో ఎందుకు మాట్లాడిన్రు? పాలకుర్తిలో విద్యార్థినులను తిట్టి చితకబాదిన వైస్ ప్రిన్సిపాల్
  • పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్ ను నిలదీసిన పేరెంట్స్  
  • పాలకుర్తి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఘటన

పాలకుర్తి, వెలుగు : ఇంగ్లీషు టీచర్ తో ఎందుకు మాట్లాడారంటూ విద్యార్థినులను వైస్ ప్రిన్సిపాల్ చితక బాదిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. బాధిత విద్యార్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాలకుర్తి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి మాథ్స్ టీచర్ గానూ విధులు నిర్వహిస్తుంది. అదే స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ కృష్ణవేణితో ఆమెకు వ్యక్తిగత విబేధాలు నెలకొన్నాయి.  

విద్యార్థినులు ఎవరైనా ఇంగ్లిషు టీచర్ తో మాట్లాడితే వైస్ ప్రిన్సిపాల్ సహించేది కాదు. బుధవారం రాత్రి స్టడీ అవర్ లో తొమ్మిదో తరగతి విద్యార్థినులు సిరి, అశ్విని, శ్రావ్య, సిరి చందనతో పాటు మరో నలుగురు  స్టూడెంట్స్ ఇంగ్లీష్ టీచర్ కృష్ణవేణితో మాట్లాడారు. దీంతో వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి విద్యార్థులను పిలిచి బూతులు తిడుతూ కర్రతో చేతులపై కమిలి పోయేలా కొట్టింది. 

బాధిత విద్యార్థులు తమ పేరేంట్స్ కు ఫోన్ చేసి చెప్పుకున్నారు. గురువారం పలువురు పేరెంట్స్ స్కూల్ కు వద్దకు వెళ్లి తమ పిల్లలను ఎలా కొడతారని నిలదీశారు. ఏదైనా పొరపాటు చేస్తే తమకు చెప్పాలి కదా అని ప్రశ్నించారు. కాగా.. ప్రిన్సిపాల్ స్వరూప కూడా విద్యార్థులు, పేరెంట్స్ తో మాట్లాడారు. బయటకు చెబితే నష్టపోతారని ఆమె హెచ్చరించారు. చివరకు బాధిత విద్యార్థులతోనే టీచర్లు తమను కొట్టలేదని చెప్పించారు.