- రూ.3.55 కోట్ల బిల్లులు చెల్లించకుండా బెదిరిస్తున్నరు
- నా కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యం
- బాధిత కాంట్రాక్టర్ పర్వతాలు ఆవేదన
బషీర్ బాగ్, వెలుగు : వనపర్తి సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి తనకు సబ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మించి తప్పుడు వర్క్ ఆర్డర్ కాపీ ఇచ్చి రూ.3.55 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని నాగర్ కర్నూల్ జిల్లా కోడేరుకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ బాధితుడు పర్వతాలు ఆరోపించారు. హైదరాబాద్ లోని బషీర్బాగ్ప్రెస్క్లబ్లో తన భార్య నాగమ్మతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. సబ్ కాంట్రాక్ట్ తీసుకొని కూలీలతో పనిచేయించే తనకు పెద్దమందడి ఎంపీపీ, ప్రస్తుత వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి పరిచయమయ్యారని తెలిపారు.
ఎస్ఈడబ్ల్యూ సదరన్ కంపెనీలో చాలా పనులు చేశానని, పెద్దపెద్ద కాంట్రాక్టు చేస్తుంటానని, వనపర్తి జిల్లాలో కూడా రూ.600 కోట్ల ఇరిగేషన్ వర్క్స్ చేశానని మేఘారెడ్డి తనను నమ్మించారని ఆయన పేర్కొన్నారు. ‘‘ఛత్తీస్ గఢ్ లో రైల్వే కాంట్రాక్ట్ వచ్చిందని, అక్కడ సబ్ కాంట్రాక్ట్ ఇస్తానని హైదరాబాద్ కొత్తపేటలోని గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఛత్తీస్ గఢ్ దంతేవాడలో సహకరిస్తే భవిష్యత్తులో పెద్ద కాంట్రాక్టులు ఇప్పిస్తానని, అవసరమైతే ఏ అకౌంట్ ఇప్పిస్తానని నమ్మించాడు. 2017 జనవరిలో తాను ఛత్తీస్ గఢ్ లో పనులు ప్రారంభించానని చెప్పాడు. అదే ఏడాది ఫిబ్రవరి 6న వనపర్తిలోని గ్రీన్ పార్క్ హోటల్ లో వర్క్ ఆర్డర్ కాపీ నాకు ఇచ్చి నెలలో 20 రోజులు అక్కడే ఉండి పనిచేయించాడు.
తీరా బిల్లులు అడిగితే ఇంకా సదరన్ కంపెనీ వాళ్లు ఇవ్వలేదని, కచ్చితంగా ఇస్తారని చెప్పాడు. అనుమానం వచ్చి కంపెనీ వద్దకు వెళ్లి వాకబు చేయగా, డబ్బులు ఎప్పుడో ఇచ్చామని చెప్పారు. ఈ విషయంపై మేఘారెడ్డిని అడగగా వందల కోట్ల ఇరిగేషన్ వర్క్ చేశానని, డబ్బులు వడ్డీతో సహా ఇస్తానని, మళ్లీమళ్లీ అడగకు అని బెదిరింపులకు పాల్పడ్డాడు” అని పర్వతాలు తెలిపారు. రూ.10 లక్షలు అకౌంటు ట్రాన్స్ ఫర్ చేయగా ఇంకా రూ.3.55 కోట్ల బిల్లులు ఇవ్వలేదని ఆయన వెల్లడించారు.
ఆయన ఇంటికి వెళ్తే సెక్యూరిటీ, పోలీసులతో గెంటించి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేఘారెడ్డి డబ్బులు ఇవ్వకపోతే కుటుంబంతో సహా ఆయన ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటామని పర్వతాలు, నాగమ్మ దంపతులు కన్నీటి పర్యంతం అయ్యారు.