జగిత్యాల, వెలుగు : ‘కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి సీఎం కేసీఆర్, లిక్కర్ బిజినెస్ లో కవిత మస్తు సంపాదించిండ్రు , ఎవరు ఎంత ఇచ్చిన కాదనకుండా తీసుకోండి" అంటూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో స్థానిక బీఆర్ఎస్ లీడర్ సింగిల్ విండో చైర్మన్ రాజ నర్సింగ రావు ఓ వర్గానికి చెందిన సంఘ భవనంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ.. బీఆర్ఎస్ లీడర్ల ముందే సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాము కష్టపడితేనే తెలంగాణ వచ్చిందని కానీ మధ్యలో వచ్చినవారు ఉడుముల్లాగా పార్టీలో ప్రవేశించారన్నారు. ఈ సందర్భంగా ఏ పార్టీ నాయకులు డబ్బులు ఇచ్చినా తీసుకోవాలని, కానీ రాష్ట్రం కోసం కష్టపడ్డ తమను కాపాడుకోండి అంటూ అక్కడున్న వారిని శోభ అభ్యర్థించారు.