- ప్రభుత్వానికి విజిలెన్స్ ఫైనల్ రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీకి ఫౌండేషన్ లాంటి సీకెంట్ పైల్స్ ఫెయిల్ అవ్వడం వల్లే బ్యారేజీ కుంగిందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక తేల్చింది. వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే దానికి నష్టం జరిగిందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ నివేదిక సమర్పించినట్టు తెలిసింది. ఇటీవల డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్‌తో సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా రిపోర్ట్ సమర్పించాలని జస్టిస్ ఘోష్ ఆదేశించడంతో వారంలో ఇస్తామని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఇటీవల అప్పటి ఈఎన్‌సీ జనరల్ మురళీధర్‌తో పాటు సీడీవో అధికారులను డిపార్ట్‌మెంట్ విచారించింది. ఆయా వివరాలతో ఫైనల్ రిపోర్టును ప్రభుత్వానికి రెండ్రోజుల కింద సమర్పించినట్టు సమాచారం. గత ప్రభుత్వం డిజైన్లను పలుమార్లు మార్చడంతోనే బ్యారేజీకి సమస్యలు వచ్చాయని రిపోర్టులో పేర్కొన్నట్టు తెలిసింది. ‘‘సీకెంట్ పైల్స్ మన దేశంలో లేకున్నా గత ప్రభుత్వం వాటివైపే మొగ్గు చూపింది. హైడ్రాలిక్ స్ట్రక్చర్లకు సీకెంట్ పైల్స్‌ను వాడకున్నా.. మనకు వాటి నిర్మాణానికి అవసరమైన గైడ్‌లైన్స్ లేకున్నా సీకెంట్ పైల్స్‌కే వెళ్లింది. అక్కడి నేలకు అవి సరిపోవని రిపోర్టులు చెప్పినా, జియోటెక్నికల్ పరీక్షలు, జాధవ్‌పూర్ యూనివర్సిటీ స్టడీలో కోల్ బెడ్ ఆనవాళ్లు బయటపడినా.. అలాగే ముందుకెళ్లింది. డిజైన్ల విషయంలో పలుమార్లు కాంట్రాక్ట్ సంస్థ కూడా జోక్యం చేసుకుంది” అని రిపోర్ట్‌లో పేర్కొన్నట్టు తెలిసింది.
ఇంజినీర్లు పట్టించుకోలేదు..
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం నుంచి నిర్వహణకు వరకు ఇంజినీరింగ్ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారని రిపోర్ట్‌లో పేర్కొన్నట్టు తెలిసింది. మేడిగడ్డలో 2019లోనే లోపాలు బయటపడినా కనీస చర్యలు తీసుకోలేదని, నిర్వహణను గాలికొదిలేశారని వెల్లడించినట్టు సమాచారం. ‘‘కాంట్రాక్ట్ సంస్థకు లబ్ధి చేకూరేలా ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే సబ్‌స్టాంషియల్ కంప్లీషన్ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.
పైగా అగ్రిమెంట్‌లోని ఒప్పందం ప్రకారం ఇవ్వొచ్చంటూ చెప్పారు. వ్యాప్కోస్ సూచించినట్టు ఆర్‌సీసీ డయాఫ్రం వాల్‌తో నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా.. అందుకు గత సర్కారు ఒప్పుకోలేదు. తక్కువ ఖర్చుతోనే సీకెంట్ పైల్స్‌తో బ్యారేజీ నిర్మాణం పూర్తవుందని చెప్పి.. అంచనాలను రెట్టింపు చేశారు. కాంట్రాక్ట్ సంస్థ అడిగిందే తడువుగా బ్యాంక్ గ్యారంటీలు, చెల్లింపులు చేశారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు బ్యారేజీ నాణ్యత గురించి అస్సలు పట్టించుకోలేదు” అని రిపోర్ట్‌లో పేర్కొన్నట్టు తెలిసింది.