మెట్ పల్లి, వెలుగు : గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను సీఐ బూతులు తిట్టిండని జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలం మెట్లచిట్టపూర్ గ్రామస్థులు పోలీస్ స్టేషన్లో బుధవారం ఆందోళన చేశారు. వీడీసీ సభ్యులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణపై వీడీసీ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. ఎనిమిది సంఘాలు ఓ వైపు, రెండు సంఘాలు మరో వర్గంగా ఏర్పడ్డాయి. తమను గ్రామ బహిష్కరించారని రెండు కుల సంఘాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మెట్ పల్లి ఎస్సై వీడీసీ సభ్యులను స్టేషన్ కు పిలిపించాడు. శనివారం ఎనిమిది కుల సంఘాల నుంచి ఎనిమిది మంది వీడీసీ సభ్యులు స్టేషన్ కు వచ్చారు.
సీఐ లక్ష్మీనారాయణ వీరిని ఆఫీస్ లోకి పిలిచి అసభ్య పదజాలంతో దూషించి, అన్ని కుల సంఘాలపై కేసులు నమోదు చేస్తామని బెదిరించారని వారు పేర్కొన్నారు. వీరు గ్రామస్థులకు తెలియజేయడంతో గ్రామస్థులు డీఎస్పీ కి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆందోళన చేశారు. తమను అకారణంగా ఎందుకు బూతులు తిట్టారని సీఐని నిలదీశారు. ఆందోళన చేస్తున్న వారిని సీఐ సముదాయించారు. ఇరువర్గాలను పిలిపించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సీఐ చెప్పడంతో గ్రామస్థులు వెనుదిరిగారు. ఈ విషయమై సీఐ లక్ష్మీనారాయణను వివరణ కోరగా.. తాను ఎవరినీ బూతులు తిట్టలేదని, గ్రామంలో వీడీసీ సభ్యుల మధ్య సమస్య సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించానని తెలిపారు.