
కొచ్చి: కేరళలోని కొచ్చిలో ఉద్యోగుల పట్ల ఒక ప్రైవేట్ కంపెనీ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. కొచ్చిలోని హిందుస్తాన్ పవర్ లింక్స్ అనే కంపెనీ సేల్స్ టార్గెట్స్ చేయడంలో ఫెయిల్ అయిన ఉద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. వాళ్లను కుక్కల కంటే హీనంగా ట్రీట్ చేసింది. ఈ కంపెనీ చేసిన దుశ్చర్యకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
కుక్కలకు వేసినట్టుగా మెడలో బెల్ట్ కట్టి మోకాళ్లపై నడిపించి సదరు కంపెనీ అమానుషంగా ప్రవర్తించింది. ఆ కంపెనీ వాళ్లకు నెలకు 6 వేల నుంచి 8 వేల మధ్యనే జీతం చెల్లిస్తుందని.. బానిసలుగా చూస్తుందని ఒక ఇన్ స్టాగ్రాం పేజ్ పేర్కొంది. కేరళ ప్రభుత్వం ఈ వీడియో ఆధారంగా ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపారు. ఆ కంపెనీ ఉద్యోగుల స్టేట్ మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఈ ఘటనకు ఆ కంపెనీ మాజీ మేనేజరే కారణమని ఉద్యోగులు ఆరోపించారు.
ఈ టోటల్ ఎపిసోడ్ లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. తనను ఎలా టార్చర్ చేశారో చూడండని వీడియోను వైరల్ చేసిన సదరు ఉద్యోగి పోలీసుల విచారణలో పూర్తిగా ప్లేటు తిప్పేశాడు. ఇప్పటికీ తాను అదే సంస్థలో పనిచేస్తున్నానని, అది కొన్ని నెలల క్రితం వీడియో అని చెప్పుకొచ్చాడు. అప్పట్లో మేనేజర్గా పనిచేసిన వ్యక్తి చేసిన అరాచకం తాలూకా దృశ్యాలని, ఆ మేనేజర్ ను ఉద్యోగం నుంచి కంపెనీ తొలగించిందని చెప్పాడు. ఆ వీడియోను వాడుకుని కంపెనీ గుడ్ విల్ ను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆ ఉద్యోగి చెప్పడం కొసమెరుపు. కేరళ కార్మిక సంక్షేమ శాఖకు, పోలీసులకు కూడా ఇదే వాంగ్మూలాన్ని బాధితుడు ఇవ్వడం గమనార్హం.