మునుగోడులో వినూత్నంగా 33 మండలాల వీఆర్ఏల నిరసనలు

మునుగోడు మండలంలో వీఆర్ఏలు రోడ్డెక్కారు. కేసీఆర్ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ..పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నల్లగొండ జిల్లాలోని 33 మండలాలకు చెందిన వీఆర్ఏలు వినూత్నంగా నిరసన తెలిపారు. 2019లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వీఆర్ఏలు కోరారు. పే స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడు పట్టణంలో బోనాలు, బతుకమ్మ, పోతారాజుల వేషధారణలో ప్రదర్శన చేపట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మునుగోడు ఉప ఎన్నికలో వెయ్యి మందితో నామినేషన్ వేసి, వీఆర్ఏల సత్తా ఎంటో చూపిస్తామని హెచ్చరించారు. 

వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ రెండేళ్ల క్రితం హామీ ఇచ్చినా ఇప్పటివరకూ అమలు చేయలేదన్నారు. తాము సమ్మెకు వెళ్లి34 రోజులు పూర్తవుతున్నా రాష్ర్ట ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా తమను చర్చలకు పిలిచి.. డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఒకవేళ తమ సమస్యలను పరిష్కరించకపోతే లక్ష వీఆర్ఏల కుటుంబాలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని హెచ్చరించారు. పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇవ్వాలని కోరారు.