మంచి, చెడుల జోడెడ్ల బండైన.. సోషల్ మీడియా

ప్రజాస్వామ్యం అనే నాలుగు స్తంభాలాటలో కనిపించని ఆరో స్తంభంగా సోషల్ మీడియా మానవ మస్తిష్కాలపై అంతర్ వాహిణిగా ఆవహించింది. సోషల్ మీడియాలో ట్విట్టర్, ఇన్స్​స్టాగ్రాం, ఫేస్​బుక్, వాట్సప్, టెలీ గ్రామ్, యూట్యూబ్ లాంటి మాధ్యమాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. వ్యవస్థపై తనకున్న అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి  చక్కటి వేదికగా సోషల్ మీడియా సిద్ధం అయ్యింది. భారత్ లాంటి జనాభా అధికంగా ఉండి అభివృద్ధి చెందుతున్న దేశంలో సోషల్ మీడియా వాడకంలో అగ్రభాగంగా ఉంది. 2022లో ఒక సర్వే ప్రకారం దేశంలో470.1 మిలియన్ యూజర్లు క్రియాశీలకంగా ఉండి ప్రతినెల4.2% వృద్ధి రేటు ఉండటం గమనార్హం. దేశ జనాభాలో 33.4% మంది  ప్రతి రోజు సగటున సుమారు 2 నుంచి 6 గంటల పాటు సోషల్ మీడియా వివిధ మాధ్యమాల్లో గడుపుతున్నారన్నది ఒక అధికారిక అంచనా. 

ట్విట్టర్ ఫేస్​బుక్ లాంటి మాధ్యమాల్లో నాయకులు వ్యక్త పరిచే అభిప్రాయాలే మీడియా సంస్థలకు వార్తలుగా నిలిచే పరిస్థితి నెలకొని ఉన్న సందర్భాలు కోకొల్లలు. దేశంలో సామాన్యుడి నుంచి పెద్ద సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా మానియాలో  హల్​చల్ చేస్తున్నారు. లైక్​లు, కామెంట్​ల అన్వేషణలో తమను తాము మరచి పోతున్నసందర్బాలను చూస్తున్నాం. ఇంతగా సోషల్ మీడియా ప్రభావం సమాజం మీద ఎందుకున్నది అని నిశితంగా గమనిస్తే గ్లోబలైజేషన్ కాలంలో మనిషి మానసిక స్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. మార్కెట్ మాయాజాలంలో కొట్టుకు పోతున్నారు. సమాజంలో పెరిగిపోతున్న హింస ప్రవృత్తి, పని వత్తిడి, మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులు, ప్రభుత్వాల అసమర్థ పాలన అంతా నిత్యజీవితంపై తిరుగు లేని ప్రభావానికి లోనుచేస్తున్నాయి. ఈ వత్తిడి నుంచి ఉపశమనంలో సోషల్ మీడియా ఒక ఓదార్పుగా మారింది.

లక్ష్మణ రేఖ దాటడమే సమస్య

భారత రాజ్యాంగంలో ఆర్టికల్19(1)(a) ప్రకారం దేశంలోని పౌరులందరికి భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదించింది. పత్రికలు, మీడియా, ప్రచార సాధనలన్నీ  కూడా ఈ ఆర్టికల్ ప్రకారమే తమ భావ వ్యక్తీకరణ వ్యక్తం చేయవచ్చు. కానీ అది ఇతరుల స్వేచ్ఛకు భంగం వాటిల్లకూడదు. కానీ నేడు యూట్యూబ్ చానెల్ పేరుమీద  అసత్య విష ప్రచారాల హోరు జోరుగా సాగుతోంది. రాజ్యాంగం ప్రసాదించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ లక్ష్మణ రేఖ దాటుతుందన్న విమర్శలున్నాయి. రానున్న2023 ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్ర కీలకం కానుంది. అన్ని పార్టీలు తమ అనుబంధ విభాగంలో సోషల్ మీడియా విభాగాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయంటే  దాని ప్రాధాన్యత అనివార్యమైనదిగా మారిపోవడమే. యూరప్, లాటిన్ అమెరికా లాంటి దేశాల్లో ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేయడంలో సోషల్ మీడియా పాత్ర ఘనమైనది. చాలా దేశాలు ప్రభుత్వాలనే మార్చిన ఘనత సోషల్ మీడియాకు దక్కుతుంది. ప్రజలను ప్రభావితం చేయడంలో సోషల్ మీడియా ప్రాధాన్యత గుర్తించిన ఆయా ప్రభుత్వాలు తమ విధానాలను డిజిటల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం అలవాటు చేసుకుంటున్నాయి.

ఎన్నికల మాధ్యమైంది

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కూడా సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగిపోయింది. వివిధ పార్టీల సోషల్ మీడియా విభాగాలు ఎంతో యాక్టివ్​గా పనిచేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను నైతికంగా దెబ్బతీయడం ఆ పార్టీల్లోని లోగుట్టుల్ని ప్రచారం చేయడంలో సోషల్ మీడియాదే ప్రధాన పాత్రగా మారింది. ట్రోలింగ్ పేరుతో వ్యక్తులను టార్గెట్ చేస్తూ విష ప్రచారాలతో తప్పుడు దోషాలు ఆపాదిస్తూ, నూరిపోస్తూ కనీస విలువలను పాటించకుండా అబద్దాలను అద్దుతున్న సందర్భాలు లేకపోలేదు. 

వేదాలు ఉపనిషత్తులు పురాణాలకు కూడా తప్పుడు భాష్యాలు అంటగట్టి అవమానించిన సందర్భాలు అనేకం. వాట్సప్, యూట్యూబ్​లో వస్తున్న కథనాల్లో నిజమెంత అంటే నేతి బీరకాయలో నెయ్యి వెతకడమే. ప్రభుత్వ అవినీతి, నేతల అక్రమాలను బోనులో నిలబెట్టిన సందర్భాలు ఉన్నా, సుపారి వార్తలు వైరల్ చేసే విష సంస్కృతిని సోషల్ మీడియా మూటగట్టుకుంది. సోషల్ మీడియా విజ్ఞాన, వినోదంగా మిగిలితే మంచిదే. కానీ లక్ష్మణ రేఖ దాటితేనే అసలు సమస్య.

- దొమ్మాట వెంకటేష్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్