గద్వాల కోట గోడ కూలుతోంది! కనుమరుగవుతోన్న రాజుల చరిత్ర

గద్వాల కోట గోడ కూలుతోంది! కనుమరుగవుతోన్న రాజుల చరిత్ర
  •   పురాతన బావులు కబ్జాదారుల పాలు  
  •   చారిత్రకత కట్టడాలపై ప్రజాసంఘాల పోరాటం 
  •   భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వం పరిరక్షించాలని డిమాండ్

గద్వాల, వెలుగు : వందల ఏండ్ల చరిత్ర కలిగిన గద్వాల కోట గోడ కూలిపోతున్నాయి. రాజుల కాలం నాటి బావులు కబ్జాలకు గురవుతున్నాయి. దీంతో వారసత్వ సంపదను కాపాడి భవిష్యత్‌‌‌‌ తరాలకు అందించాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దీక్షలు, నిరసనలు నిర్వహిస్తున్నారు. కొందరు వ్యక్తుల కారణంగా ఇప్పటికే పలు పురాతన కట్టడాలు, స్థలాలు కనుమరుగు అయ్యాయని, మిగిలిన వాటినైనా రక్షించాలని డిమాండ్‌‌ చేస్తున్నారు.

ఇదీ కోట చరిత్ర

కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య ఉండే నడిగడ్డ సంగమం విద్వత్ గద్వాల దాదాపు 800 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. గద్వాలలో నడిబొట్టున పెద్ద సోమ భూపాలుడు (నల్ల సోమనాద్రి) 1663లో గద్వాల కోట గోడను నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. 21 బురుజులు, 20 అడుగుల వెడల్పు.. 40 అడుగుల ఎత్తులో మట్టితో గద్వాల కోట ను వృత్తాకారంలో నిర్మించారు. 

కోట గోడను దాటి శత్రువులు లోపలికి రాకుండా కోట చుట్టూ 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల లోతు రాతి కట్టడంతో కందకాలను నిర్మించారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన గద్వాల కోట  నేడు శిథిలావస్థకు చేరింది. దానిని పరిరక్షించకపోవడంతో రోజురోజుకు కోట గోడ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 

కబ్జా కోరల్లో పురాతన బావులు

రాజుల కాలంలో గద్వాలలో రాతితో బావులను నిర్మించారు. చొక్కామ్మ బావి, లింగమ్మ బావి, కొత్త బావి, దొర బావి, పూల బావి, చేపల బావి అలా నిర్మించినవే. వాటిలో ఇప్పటికే పూల బావి కనుమరుగైంది. కొత్త బావి కబ్జాకు గురైంది. చేపల బావి, దొర బావి శిథిలావస్థకు చేరాయి. వాటిని పరిరక్షించి పునరుద్ధరిస్తే టూరిస్ట్ ప్లేస్ గా మారుతుంది. కానీ వాటిపై అధికారు ఎవరు దృష్టి పెట్టడం లేదు. దీంతో బావులు అన్యాక్రాంతమవుతున్నాయి. 

 పరిరక్షించాలని పోరాటం

గద్వాలలోని పురాతన బావులు, కోటను, రాజుల చరిత్రను పరిరక్షించాలని సీనియర్ సిటిజన్ ఫోరం, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పోరాడుతున్నాయి. ఇందులో భాగంగా ర్యాలీలు, నిరసన దీక్షలు చేస్తున్నాయి. కొత్త బావిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం నిరసన దీక్షను చేపట్టారు. కబ్జా చేసిన కొత్త బావిని వెంటనే పునరుద్ధరించాలని కోరాయి. 

డీపీఆర్ కు కలెక్టర్ ఆదేశం

గద్వాల కోట గోడ, చారిత్రాకత బావుల పరిరక్షణకు డీపీఆర్(డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్) రూపొందించాలని కలెక్టర్ సంతోష్ ఈనెల 4న ఆర్కిటెక్ శ్రీలేఖను ఆదేశించారు. అదే రోజు గద్వాల టౌన్ లోని పురాతన కట్టడాలు, బావులను కలెక్టర్ పరిశీలించారు. డీపీఆర్ ఎప్పుడు వస్తుందో..? ఎప్పుడు పరిరక్షణకు చర్యలు చేపడతారోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

చారిత్రక కట్టడాలను పరిరక్షించాలి 

గద్వాలలోని ప్రాచీన, చరిత్రకత కట్టడాలను పరిరక్షించడానికి  ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలి.  గద్వాల చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడున్న వారసత్వ సంపదను కాపాడుకోకుంటే చరిత్రను ఎంతో నష్టపోతాం.  

 – బోరవెల్లి పవన్ కుమార్, తెలుగు లెక్చరర్

రాజ వంశీయుల దృష్టికి తీసుకెళ్లాం 

గద్వాలలోని రాజుల చరిత్రను రాజ వంశీయుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే పురాతన కట్టడాలు, వారసత్వ సంపదను పరిరక్షించేందుకు ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.  పురాతన కట్టడాలను, బావులను కబ్జా కానివ్వకుండా పోరాటం చేస్తాం.

- మోహన్ రావు, 
సీనియర్ సిటిజన్ ఫోరం చైర్మన్, గద్వాల