9గంటలు రెస్క్యూ ఆపరేషన్: ప్రాణాలతో బయట పడ్డ బలవంత్ రెడ్డి

9గంటలు రెస్క్యూ ఆపరేషన్: ప్రాణాలతో బయట పడ్డ బలవంత్ రెడ్డి

హైదరాబాద్: మురుగు నీటిని కట్టడి చేసేందుకు సెల్లార్ లో మరమ్మత్తు చేస్తుండగా గోడకూలి కార్మికుడు ఇరుక్కుపోయిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 9గంటల పాటు కార్మికుడు బలవంత్ రెడ్డి(32) కూలిన శిథిలాల కిందే ఉన్నాడు. కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ శ్రీ నిలయం ఎన్క్లేవ్ లో ఉన్న సాయిరాం బృందావన్ అపార్ట్మెంట్ సెల్లార్ లోకి వర్షాకాలం డ్రైనేజీ నీరు వస్తుంటుంది. ఈ నీటిని కట్టడి చేసేందుకు అపార్ట్మెంట్ అసోసియేషన్  సెల్లార్ రిటైనింగ్ వాల్ చుట్టూ మరమ్మత్తుల  పనులు చేపడుతున్నారు. రిటర్నింగ్ వాల్ చుట్టూ రెండు ఫీట్ల గుంత తవ్వుకుంటూ వెళ్లగా సెల్లార్ లోనే మరోవైపు ఉన్న గోడ కూలి కార్మికులపై పడింది. దీంతో కార్మికుడు శిథిలాల్లో ఇరుక్కుపోయాడు. 

ఈ విషయాన్ని వెంటనే అపార్ట్మెంట్ వాసులు జిహెచ్ఎంసి అధికారులకు తెలియజేయగా... సంఘటన స్థలానికి చేరుకున్న కూకట్ పల్లి జోనల్ కమిషనర్, అభిలాష అభినవ్ దగ్గర ఉండి ఎన్ డీఆర్ఎఫ్ బృందం, అగ్నిమాపక పోలీసులతో సహాయ చర్యలు చేపట్టారు. సుమారు 9గంటల పాటు శిథిలాల లోపలనే ఉన్నాడు కార్మికుడు. కార్మికునికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అతనికి ఆక్సిజన్ పైప్ అమర్చారు. పక్కనే ఒక డాక్టర్ ఉండి అతని పల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉన్నారు. 9గంటల తర్వాత క్షత గాత్రుడిని రెస్క్యూ చేసి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.