పదవులు అమ్ముకున్నట్టు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా : కడియం శ్రీహరి

పదవులు అమ్ముకున్నట్టు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా : కడియం శ్రీహరి

పదవులు అమ్ముకున్నట్టు నిరూపిస్తే.. పోటీ నుంచి తప్పుకుంటా
ఎమ్మెల్యే రాజయ్యకు ఎమ్మెల్సీ కడియం సవాల్​
దళితబంధు పేరుతో డబ్బులు దండుకున్నావని ఫైర్​
వేల కోట్ల ఆస్తులున్నట్లు రుజువు చేస్తే దళితులకు రాసిస్తానని వెల్లడి

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : అధికార పార్టీకి చెందిన స్టేషన్​ఘన్​పూర్​ఎమ్మెల్మే రాజయ్య, ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకున్నది. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల నియోజకవర్గంలోని​తాటికొండ, హిమ్మత్​నగర్​లో ఎమ్మెల్యే రాజయ్య, కడి యం శ్రీహరిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కడియం సోమవారం స్టేషన్​ఘన్​పూర్​లో మీడియాతో మాట్లాడుతూ రాజయ్యకు గట్టిగా కౌంటర్​ ఇచ్చారు. ‘30 ఏండ్ల నా రాజకీయ జీవితంలో ఏ ఒక్కరికైనా పని ఇచ్చి, పదవులు ఇచ్చి డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే.. స్టేషన్​ఘన్​పూర్​లో నీకు నేను పోటీకి రాను’ అని సవాల్​ విసిరారు.‘దళితబంధు పేరుతో నువ్వు పేద దళితుల వద్ద లక్షల రూపాయలు దండుకోలేదా? అమాయక దళిత బిడ్డలు వారి భార్యల మెడలోని పుస్తెలతాళ్లు కుదువపెట్టి నీకు డబ్బులు అప్పజెప్పలేదా? దళితులకు బీఫాంలు అమ్ముకోలేదా’ అని కడియం రాజయ్యను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

సింగపూర్, మలేషియా, బెంగళూరు, గుంటూరు లో తనకు వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఆధారాలు చూపిస్తే స్టేషన్​ఘన్​పూర్​ నియోజకవర్గ దళిత బిడ్డలకు రాసిస్తానని కడియం పేర్కొన్నారు. వారం రోజుల్లో ఎవిడెన్స్​తో రాకపోతే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. ‘రాజయ్యకు నన్ను చూస్తే భయం.. అందుకే పార్టీ మీటింగ్​లకు పిలువడు. ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వానించడు’ అని విమర్శించారు.

కుటుంబంపై ఆరోపణలు చేస్తే జాగ్రత్త 

తన కుటుంబం గురించి అనవసర ఆరోపణలు చేయొద్దని రాజయ్యను కడియం తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ‘నాతో పోట్లాడు.. పొలిటికల్​గా విభే దించు.. రాజకీయ విమర్శలు చెయ్.. అంతేగానీ నా కుటుంబంపై అనవసర ఆరోపణలు చేస్తే తస్మాత్​ జాగ్రత్త’ అని మండిపడ్డారు. ‘నా తండ్రి కులం బైండ్ల.. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం నా తండ్రి కులమే నా కులం అవుతుంది. నా కులం నా బిడ్డలకు వర్తిస్తుంది. నువ్వు ఎందుకు అసహనంతో మాట్లాడుతున్నావో అర్థం కావడంలేదు’ అని ఫైర్​ అయ్యారు. ‘నీలా నేను మాట్లాడితే నీ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంది’ అని అన్నారు. ‘నేనంటే నీకు భయం.. నా బిడ్డకూ భయపడ్తున్నావా.. నియోజకవర్గ ప్రజలు నీ వెంటే ఉంటే భయం ఎందుకు.. పల్లెనిద్రలు చేస్తే గ్రామాల్లో ఎందుకు నిలదీశారు.. ఎందుకు తరిమికొట్టిన్రు’ అని ఎద్దేవా చేశారు.