
మనం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి దాయాది దేశమైన పాకిస్తాన్ భారతదేశానికి బద్దశత్రువుగానే కొనసాగుతోంది. కానీ, కొన్ని సంవత్సరాలు ఇరుదేశాల ప్రజల మధ్య శాంతియుతంగా సుహృద్భావ వాతావరణం కొనసాగింది. ఆ శాంతియుత వాతావరణంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయంటే, అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1960లో కరాచీకి ప్రయాణించి పాకిస్తాన్‌తో ఇండస్ రివర్ వాటర్ ఒప్పందంపై సంతకం చేశారు.
కానీ, 1962లో భారతదేశం, చైనా మధ్య జరిగిన యుద్ధం తర్వాత చైనా పాకిస్తాన్‌తో కలిసి భారతదేశాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవడానికి చేతులు కలిపింది. ఈ నేపథ్యం భారతదేశం చైనాతోపాటు పాకిస్తాన్‌కు కూడా ఉమ్మడి శత్రువుగా మారిపోయింది. భారతదేశం1960లో ఇండస్ వాటర్ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ.. 1965లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెద్ద యుద్ధం జరిగింది. అనంతరం 1965లో జరిగిన యుద్ధం తరువాత కార్గిల్ నుంచి తీవ్రవాదుల తరిమివేత, సర్జికల్ స్ట్రైక్‌ల తదుపరి ఉద్వేగాలు కొనసాగుతూనే ఉన్నాయి.
కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల టెర్రరిస్టులు జరిపిన ఉగ్రదాడి, టెర్రరిస్టుల అటాక్‌లో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోవడంతో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెప్పాలని, టెర్రరిస్టులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్‌ను శిక్షించాలని అత్యధిక సంఖ్యలో భారతీయులు కోరుకుంటున్నారు. అయితే, పాకిస్తాన్ సైనిక బలం భారతదేశానికి సాటి రాదనేది వాస్తవమే. కానీ, మనం గుర్తించాల్సిన వాస్తవం ఏమిటంటే, పాకిస్తాన్‌తో యుద్ధం అంటే చైనాతో కూడా పరోక్షంగా యుద్ధం చేయడమే అని గుర్తించాలి.
చైనా బహిరంగంగా పాకిస్తాన్‌తో కలిసి భారత్‌పై యుద్ధం చేయదు. కానీ, భారతదేశంపై యుద్ధమంటే చైనా పాకిస్తాన్‌కు పూర్తిస్థాయిలో పరోక్షంగా ఆయుధ సంపత్తితోపాటు అన్నిరకాల మద్దతు ఇస్తుంది. ఎన్నో దశాబ్దాలుగా చైనా-- పాకిస్తాన్ సైన్యానికి నిధులు, ఆయుధాలను సమకూరుస్తోంది. భారతదేశంపై టెర్రరిస్టులు చేస్తున్న దాడులను చైనా ఒక ప్రేక్షకుడిలా మౌనంగా గమనిస్తూనే, పాకిస్తాన్ భారతదేశాన్ని వేధించడాన్ని ఎంజాయ్ చేస్తోంది.
యుద్ధం ఎలా ముగుస్తుందో చెప్పలేం
ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధాలు చాలా సులభంగా ప్రారంభించవచ్చు. కానీ, ఏ దేశం కూడా యుద్ధం ఎలా ముగుస్తుందో ముందుగా చెప్పలేదు. శక్తిమంతమైన రష్యా 2022 ఫిబ్రవరిలో తనకంటే చిన్న దేశమైన ఉక్రెయిన్‌తో ప్రత్యక్ష యుద్ధం ప్రారంభించింది. కానీ, రష్యా ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో చిక్కుకుపోయింది. జపాన్, జర్మనీ రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించినా ఓడిపోయాయి. అమెరికా, ఫ్రాన్స్ వియత్నాంతో 25 సంవత్సరాలు పోరాడి ఓడిపోయాయి. అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లతో పోరాడి ఓడిపోయింది. పెద్ద దేశాలు చిన్న దేశాలతో జరిగిన యుద్ధంలో పోరాడి ఓడిపోయిన జాబితా చాలా పెద్దది.
గత 125 సంవత్సరాలలో.. అంటే 1900 నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగిన 95% యుద్ధాలలో ఏ దేశం యుద్ధాన్ని ప్రారంభించినా అది ప్రత్యర్థి దేశం చేతిలో ఓటమిపాలైంది. అయినా పాక్‌ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలో యుద్ధం ప్రారంభించారనే అభిప్రాయం సహజం. పాకిస్తాన్ చైనా సహాయ సహకారాల ద్వారా యుద్ధాన్ని సులభంగా కొనసాగించగలదు. భారతదేశం యుద్ధానికి ఖర్చు చేయవలసిన దానితో పోలిస్తే చైనాకు ఇది చాలా తక్కువ ఖర్చు అవుతుంది. మరోవైపు ప్రతిరోజూ భారతదేశం యుద్ధం కోసం ముప్పై నుంచి నలభై వేల కోట్లు ఖర్చు చేయవలసి ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో శత్రువే ముందుగా యుద్ధాన్ని ప్రారంభించేలా చేయడం అన్నివిధాలుగా మంచిదని చెప్పవచ్చు.
ఒంటరి యుద్ధం అవుతుందేమో?
పాకిస్తాన్‌తో భారత్ తలపడితే ఆ యుద్ధం నిర్ణీత సమయంలో ముగిసిపోతుందని భారతదేశం కూడా స్పష్టంగా చెప్పలేదు. భారతదేశం ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. అదేవిధంగా ద్రవ్యోల్బణం ముప్పు కూడా నెలకొంది. పాకిస్తాన్, చైనా ఇరుదేశాల ప్రజాస్వామ్య దేశాలు కావు. దీంతో ఆ రెండు దేశాల ప్రజలు ఆర్థిక సమస్యలకు వ్యతిరేకంగా స్వేచ్ఛగా ఆందోళన చేయలేరు. కానీ, భారతీయులు ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఉచిత సౌకర్యాలు, నేరుగా నగదు బదిలీలకు అలవాటుపడ్డారు.
ఉచిత పథకాలు ఆగిపోతే క్రమేణా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు భారతదేశానికి చాలా మిత్రదేశాలు ఉన్నాయని అందరూ భావిస్తుంటారు. కానీ, భారతదేశానికి ఏ దేశంతోనూ సైనిక సహకార ఒప్పందం లేదు. దీంతో భారతదేశం తరఫున ఇది ఒంటరి యుద్ధం అవుతుంది. ప్రస్తుత ఆధునిక హైటెక్ యుగంలో ఇరుదేశాల మధ్య జరిగే యుద్ధం ఏనుగులు, గుర్రాలతో జరగదు. ఈ కాలంలో యుద్ధం కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, డ్రోన్లు వంటి కొత్త అత్యంత ఆధునిక ఆయుధాలతో జరుగుతుంది. ప్రస్తుతం యుద్ధం శైలి మారిపోయింది.
యుద్ధం తదుపరి దశలూ ఆలోచించాలి
భారతదేశం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఆయుధ సామగ్రితో సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. చైనా1979లో వియత్నాంతో యుద్ధంలో ఓడిపోయింది. 1979 నుంచి సరిహద్దులో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం తప్ప చైనా నేరుగా యుద్ధాలు చేయలేదు. ఇది ఇతరులను యుద్ధానికి రెచ్చగొట్టే వ్యూహంలా ఉంటుంది. చైనా సైన్యం శత్రువులను మానసికంగా భయపెట్టడానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది. భారతీయులు గుర్తుంచుకోవలసిన రెండు ప్రసిద్ధ పురాతన సామెతలు ఉన్నాయి. గొప్ప చైనీస్ తత్వవేత్త సన్ జూ 2500 సంవత్సరాల క్రితం ఈవిధంగా వ్యాఖ్యానించాడు.
‘ఉత్తమ విజయం యుద్ధం లేకుండా సాధ్యమవుతుంది’ అని సన్ జూ చెప్పాడు. అలాగే ‘మీ శత్రువు గురించి పూర్తిస్థాయిలో తెలుసుకోండి, మీరు ఎప్పటికీ ప్రమాదంలో ఉండరు. అని కూడా ఆయన తెలిపాడు. భారతదేశం పాకిస్తాన్‌తో పెద్ద యుద్ధం చేయాలని భావిస్తే అన్ని అంశాలను జాగ్రత్తగా అంచనా వేయాలి. పహల్గాం ఉగ్రవాద హత్యల తర్వాత.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌ను, టెర్రరిస్టులను శిక్షిస్తామని చెప్పారు. ప్రతి భారతీయుడు కూడా పాకిస్తాన్‌ను శిక్షించాలని కోరుకుంటున్నాడు. కానీ, మనం యుద్ధం తదుపరి దశలు, ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన ముందస్తు చర్యల గురించి కూడా ప్రశాంత చిత్తంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది.
భారత్ తీసుకున్న మంచి చర్యలు
కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌తో ఇండస్ రివర్ వాటర్స్ ఒప్పందాన్ని సస్పెండ్ చేయడంలో అద్భుతంగా వ్యవహరించింది. 1960 నుంచి మనం పాకిస్తాన్‌తో యుద్ధాలు చేసినప్పటికీ, భారతదేశం ఇండస్ రివర్ వాటర్స్ ట్రీట్‌ను ఎప్పుడూ టచ్ చేయలేదు. దీంతో పాకిస్తాన్ ఓవర్ కాన్ఫిడెంట్‌తో వ్యవహరించింది. భారతదేశం చివరకు పాకిస్తాన్‌పై ‘బ్రహ్మాస్త్రం’ ఉపయోగించాలని తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్‌కు పెద్ద షాక్‌ను ఇచ్చింది. భారతదేశం పాకిస్తాన్‌తో క్రికెట్ కూడా ఆడకూడదు.
ఇండియా అండ్ చైనా విషయానికి వస్తే.. చైనా పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం చేస్తుందని భారత్‌కు పూర్తిగా తెలుసు. చైనా ఇప్పుడు అమెరికాకి వ్యతిరేకంగా మారడంతో కాస్త బలహీన స్థితిలో ఉంది. ఈనేపథ్యంలో చైనా భారతదేశానికి సంయమన సందేశాలను పంపుతోంది. చైనా పాకిస్తాన్‌ను ప్రేరేపించడాన్ని తగ్గించాలని భారత్ పట్టుబట్టవచ్చు. ఈక్రమంలో చైనా భారతదేశంతో యుద్ధాన్ని నివారించడానికి పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చే అవకాశం కూడా ఉంది.
దౌత్య యుద్ధమే ఉత్తమం
ఏ దేశానికైనా యుద్ధం ఎప్పుడూ చివరి ఎంపికగా ఉండాలి. భారతదేశం ఇప్పుడు ఇండస్ రివర్ ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం, యుద్ధ బెదిరింపు ద్వారా పాకిస్తాన్‌పై భారీ ఒత్తిడి పెట్టింది. అదొక విజయమే. ఉగ్రవాదులను తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేయవచ్చు. ఈ విషయంలో పాకిస్తాన్ కన్సెషన్స్ ఇవ్వవలసి ఉంటుంది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వైదొలగాలని భారతదేశం డిమాండ్ చేయవచ్చు. భారతదేశం ఇంకా అనేక డిమాండ్లను లేవనెత్తవచ్చు. అయితే, ఈసారి సర్జికల్ స్ట్రైక్‌లు పనిచేయవు. వ్యూహాత్మకంగా భారతదేశం ప్రతి దౌత్యపరమైన అవకాశాన్ని అన్వేషించాలి. దౌత్య యుద్ధం గెలవడానికి ఉత్తమ మార్గం అని చరిత్ర మనకు నిరూపించింది. దౌత్యాన్ని తక్కువగా అంచనా వేయొద్దు.
డా. పెంటపాటి పుల్లారావు, సోషల్ ఎనలిస్ట్