
జెలెన్‌స్కీ ఓ నియంత.. యుద్ధానికి ఆయనే కారణం
శాంతి చర్చలకు ఆయన హాజరవ్వాల్సిన అవసరం లేదు
ఉక్రెయిన్‌కు సాయం చేసినందుకు ఖనిజాలు తవ్వుకుంటామని వెల్లడి
వాషింగ్టన్ : రష్యా– ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే ఆ దేశ అధ్యక్షులు పుతిన్– జెలెన్‌స్కీ కలవాల్సిన అవసరం ఉన్నదని అమెరికన్ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. మూడేండ్ల నుంచి జరుగుతున్న యుద్ధం, లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నాం కాబట్టి వారు తప్పక కలిసి తీరాలని అన్నారు. ఈ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మంచి చర్చలు జరిగాయని చెప్పారు. ఈ శాంతి చర్చలకు జెలెన్‌స్కీ హాజరుకావాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఫాక్స్ న్యూస్‌తో ట్రంప్ మాట్లాడుతూ.. జెలెన్‌స్కీ ఓ నియంత అని మండిపడ్డారు. మూడేండ్లుగా చర్చలు ముందుకు సాగకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా-–రష్యాల మధ్య చర్చలు మొదలు కాగా.. తొలి సమావేశానికి ఉక్రెయిన్ కు ఆహ్వానం అందలేదు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల మాట్లాడుతూ.. తమ భాగస్వామ్యం లేకుండా జరిగే ఈ చర్చల ద్వారా ఎలాంటి నిర్ణయం వెలువడినా దానిని అంగీకరించబోమని అన్నారు. ఈ నేపథ్యంలో జెలెన్స్కీపై ట్రంప్చేసిన తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
యుద్ధానికి కారణం ఉక్రెయినే
యుద్ధానికి ఉక్రెయినే కారణమని, ముందే సంధి చేసుకొని ఉండాల్సిందని ట్రంప్ అన్నారు. మూడేండ్లుగా ఆ పనిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుబట్టారు. కొంతమేర భూమితో పోయేదానికి యుద్ధందాకా తీసుకొచ్చాడని జెలెన్స్కీపై మండిపడ్డారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు. తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం ఖనిజ నిక్షేపాల్లో అమెరికాకు వాటా ఇచ్చేందుకు ఉక్రెయిన్ త్వరలోనే అంగీకారం తెలిపే అవకాశం ఉందని వెల్లడించారు. జో బైడెన్ ఆధ్వర్యంలో అందించిన పది బిలియన్ల డాలర్ల సహాయానికి పరిహారంగా ఉక్రెయిన్‌లోని ఖనిజ నిక్షేపాలను తాము తవ్వుకుంటామని చెప్పారు. కాగా, రష్యా– ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు తాను ఏమీ చేయలేదని అన్న ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. తాను ఏమీ చేయలేదు కాబట్టే వచ్చే వారం వైట్‌హౌస్‌లో చర్చలకు వారు వస్తున్నారంటూ వ్యంగ్యంగా అన్నారు.
జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ కు ఉద్వాసన
దేశంలోనే అత్యున్నత స్థాయి సైనిక అధికారిపై ట్రంప్ వేటు వేశారు. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ అయిన ఎయిర్‌ఫోర్స్ జనరల్ సీక్యూ బ్రౌన్ జూనియర్‌కు ఉద్వాసన పలికారు. ఆయనతోపాటు మరో ఇద్దరు మిలిటరీ అధికారులను తొలగించారు. “దేశానికి 40 ఏండ్లు సేవలందించిన సీక్యూ బ్రౌన్కు ధన్యవాదాలు. ఆయన చాలా గొప్ప మనిషి. ఆయనకు, కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా” అని ట్రంప్ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్‌గా పనిచేసిన రెండో నల్లజాతీయుడు సీక్యూ బ్రౌన్. ఆయనను ట్రంప్ పదవి నుంచి తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మిత్రుడు మోదీ, భారత్ కు నిధులిచ్చాం..
భారత్, బంగ్లాదేశ్‌కు వేర్వేరుగా యూఎస్ ఎయిడ్ నిధులిచ్చామని డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఈ విషయంలో భారత ప్రధాని మోదీ పేరును మొదటిసారి ఆయన ప్రస్తావించారు. ‘‘ఓటింగ్ పెంచేందుకు నా మిత్రుడు మోదీ, భారత్‌కు 21 మిలియన్డాలర్లు వెళ్తున్నాయి. భారత్‌కు మనం పెద్ద మొత్తంలో సాయం అందిస్తున్నాం. మరి మనకేంటి? మన దగ్గర ఓటింగ్ శాతం పెరగడం మనకు కావాలి కదా?” అని అన్నారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ వ్యవస్థ బలోపేతానికి 29 మిలియన్డాలర్లు అందజేసినట్టు చెప్పారు. అయితే, ఈ నిధులు ఇద్దరు వ్యక్తులు మాత్రమే పనిచేసే అనామక సంస్థకు వెళ్లాయన్నారు.