
అసౌకర్యాలు, అపరిశుభ్రతకు నిలయాలుగా సంక్షేమ హాస్టళ్లు
యథేచ్ఛగా తిరుగుతున్న పందులు, ఎలుకలు, పాములు
అపరిశుభ్రత మధ్యే వంటలు
అనారోగ్యానికి గురవుతున్న స్టూడెంట్లు
మహబూబాబాద్, వెలుగు : స్టూడెంట్ల కోసం నిర్మించిన సంక్షేమ హాస్టళ్లు అసౌకర్యాలు, అనారోగ్యాలకు నిలయంగా మారుతున్నాయి. స్టూడెంట్ల బాగోగులు చూసుకుంటూ, క్వాలిటీ ఫుడ్ అందించాల్సిన వార్డెన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో హాస్టల్ సిబ్బంది అపరిశుభ్ర వాతావరణంలో నాసికరం కూరగాయలు, ఆయిల్ వాడుతూ వంట చేస్తున్నారు. ఇది తిన్న స్టూడెంట్లు రోగాల బారిన పడి హాస్పిటల్ పాలవుతున్నారు. అలాగే హాస్టళ్లలో పందులు, కుక్కలు, ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.
హాస్టల్స్‌లో తిరుగుతున్న కుక్కలు, పందులు
మహబూబాబాద్ జిల్లాలోని నరసింహుల పేట ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. బాత్‌రూమ్స్ సరిగా లేకపోవడంతో స్టూడెంట్లు ఆరు బయటే స్నానాలు చేస్తున్నారు. ఆ పక్కనే కూరగాయలను క్లీన్ చేస్తున్నారు. మరిపెడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 640 మంది స్టూడెంట్లు ఉండగా బాత్రూలు సరిగా లేవు. దీంతో స్నానాలు బయటే చేస్తున్నారు. కొత్తగూడెం మండలంలోని పోలారం కస్తూర్భాలో వీధి కుక్కలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ ఆవరణలో మురుగునీరు పేరుకుపోయింది.
రోగాల బారిన స్టూడెంట్లు
హాస్టళ్లలో పరిసరాలు సరిగా లేకపోవడం, క్వాలిటీ లేని కూరగాయలు వాడుతుండడంతో స్టూడెంట్లు అస్వస్థతకు గురవుతున్నారు. వరుస ఘటనలు జరుగుతుండడంతో స్టూడెంట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై 27న గూడూరు గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని ఏడుగురు స్టూడెంట్లు, జూలై 28న జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 10 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఆగస్టు30న మహబూబాబాద్ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఇద్దరు స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. తాజాగా మహబూబాబాద్ కస్తూర్బా స్కూల్‌లో కలుషితాహారం తిని 40 మంది హాస్పిటల్ పాలయ్యారు.
అస్వస్థతకు గురైనప్పుడే హడావుడి
మహబూబాబాద్ జిల్లాలోని హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో స్టూడెంట్లు అస్వస్థతకు గురైనప్పుడే ఆఫీసర్లు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. వార్డెన్లు, ఆఫీసర్లు హాస్టళ్లలోనే ఉంటూ స్టూడెంట్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి. కానీ చాలా మంది పక్కనే ఉన్న పట్టణాల నుంచి వస్తూ పోతూ స్టూడెంట్లను పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి సరైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, క్వాలిటీ ఫుడ్ అందేలా చర్యలు తీసుకోవాలని స్టూడెంట్ల తల్లిదండ్రులు కోరుతున్నారు.
కేయూ హాస్టల్స్‌లో ఎలుకలు, పాములు
హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీలో ఎలుకలు, పాముల గోల ఎక్కువైంది. హాస్టళ్ల మెయింటెనెన్స్‌ను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎక్కడికక్కడ చెత్తా చెదారం పేరుకుపోయింది. దీంతో ఎలుకలు, పాములు తిరుగుతున్నాయి. యూనివర్సిటీలో ఉన్న 14 హాస్టల్స్‌లో 3 వేల మందికి పైగా స్టూడెంట్స్ ఉంటున్నారు. బాయ్స్‌కు సంబంధించిన గణపతి దేవ హాస్టల్‌తో పాటు, గర్ల్స్‌కు సంబంధించిన పద్మాక్షి హాస్టల్ ఎలుకలకు నిలయంగా మారాయి. వారం కిందట పద్మాక్షి హాస్టల్‌లో ఇద్దరు స్టూడెంట్లను ఎలుకలు కరవడంతో రక్తస్రావం జరిగింది. దీంతో వారు వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ చేయించుకున్నారు. ఎలుకలతో ఇబ్బందులను హాస్టల్ కేర్ టేకర్లు, ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్సిటీ హాస్టల్‌లో పాము కలకలం
కాకతీయ యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్‌లో పాము కలకలం రేపింది. శనివారం రాత్రి హాస్టల్ ఆవరణలో స్టూడెంట్లు చదువుకుంటుండగా ఆవరణలోకి పాము వచ్చింది. గమనించిన స్టూడెంట్ కేకలు వేయడంతో స్టూడెంట్లు అక్కడి నుంచి పరుగులు తీశారు. హాస్టల్ పరిసరాలు సరిగా లేకపోవడం వల్లే పాములు, ఎలుకలు వస్తున్నాయని స్టూడెంట్లు వాపోతున్నారు.