ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుదామని కలలుగంటున్న కేసీఆర్ ఇటీవల ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విధానం సమాజంలోని మెజార్టీ వర్గాలకు నచ్చడం లేదు. బీసీల్లో అతి పెద్ద సామాజికవర్గమైన ముదిరాజ్‌లకు ఒక్కటంటే ఒక్క సీటూ ఇవ్వకపోవడమే అందుకు ఉదాహరణ. తమ గెలుపునకు ఎదురేలేదని, తమను చూసే జనం ఓట్లు వేస్తారనే గర్వం వారిలో ఉండొచ్చుగాక. కాలచక్రాన్ని సైతం గిర్రున వెనక్కి తిప్పగలమనే ధీమాను పదేళ్ల అధికారం దర్పం ఇస్తూ ఉండొచ్చు. కానీ కాలం చాలా గొప్పది. వాస్తవిక దృశ్యాన్ని అనివార్యంగా కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తుంది.
పక్కా వ్యూహంతో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేశామని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కారు గెలుపు సులభం అనుకుంటూ ఉండొచ్చు. బలమైన అభ్యర్థులెవ్వరూ లేరు కాబట్టి ఓటమి గురించి దిగులు అసలే లేదన్న ధైర్యం ఉండనూవచ్చు. అధికార దర్పంతోనూ, తామే దైవస్వరూపులమనే భావనతోనూ ఉన్న మహామహులే బ్యాలెట్ బ్యాక్స్ ల ముందు బొక్కబోర్లా పడ్డారు. ప్రజలు అమాయకులు కాదు. ఎవరిని ఎప్పుడు పడగొట్టాలో వారికి బాగా తెలుసు. మూడు దశాబ్దాల కిందట ఎన్టీఆర్ కూడా తనకు తిరుగే ఉండదని అనుకున్నారు. ప్రజలెప్పుడూ తనవైపే ఉంటారని ఆయన విశ్వసించారు. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి, ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు సంచలనం! పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, రూ.2కే కిలో బియ్యం లాంటివి ఆయనకు పేరు తెచ్చాయి. అలాంటి ఎన్టీఆర్‌కే తర్వాతి కాలంలో ఎదురుదెబ్బలు తప్పలేదు.
ప్రజలు అన్నీ గమనిస్తారు
ప్రజలు ప్రతీ సందర్భాన్ని, ప్రతీ విషయాన్ని చాలా లోతుగా, స్పష్టంగా గమనిస్తూ ఉంటారు. ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్ ను ఘోరంగా ఓడించారు.1989 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి, హిందూపురం నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కల్వకుర్తిలో తాను చెప్పును పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినా గెలుస్తానని భావనతో ఆయన ఉన్నారు. హిందూపురంలో గెలిచినప్పటికీ కల్వకుర్తిలో ఓడిపోయారు. అనామకుడైన చిత్తరంజన్‌దాస్ చేతిలో పరాజయం చెందారు. అప్పుడు ప్రభుత్వాన్ని కూడా కోల్పోయారు. ఒక్క కలంపోటుతో 33 మంది మంత్రులకు ఉద్వాసన పలకడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, మంత్రుల సూచనలను పట్టించుకోకపోవడం వంటివి ఆయన ఓటమికి ప్రధాన కారణాలయ్యాయి. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్‌కు సరికొత్త పాఠం చెప్పారు ప్రజలు. ఆయన నీడలోనే ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌కు గత చరిత్ర తెలియనిది కాదు. కానీ అధికారం చాలా సందర్భాల్లో గతాన్ని సాంతం మర్చిపోయేలా చేస్తుంది.
వర్తమానమే అస్సలు వాస్తమనేలా భ్రమింపజేస్తుంది. అందుకే ఇతర పార్టీల వారిని కుక్కలతోనూ, కోళ్లతోనూ పోలుస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. తమకు ఎదురు తిరిగిన వారిని కాల్చి పడేస్తామని ఓ ఎమ్మెల్యే బహిరంగ హెచ్చరికలు కూడా చేశారు. కానీ ఇప్పటికే జరిగిన ఉపఎన్నికల్లో అధికార పార్టీ పని తీరు గురించి, ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలి గురించి ప్రజలకు బాగా అర్థం అయింది.
మునుగోడు ఉప ఎన్నిక పాఠాలు
ఒక్క మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు ఎన్ని పాట్లు పడ్డారో బీఆర్ఎస్ నాయకులు మర్చిపోయినా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు వాడిపోయేవి కాదు. తాము ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా తిరుగు లేదని అధినేతకు బలమైన భావన ఉంది. కానీ ప్రజలు ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా చూస్తారు. పాలన ఎటు నుంచి ఎటు వెళ్తున్నదీ వారి అనుభవంలో ఉన్నది. ఈసారి అందరికంటే ముందుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశామని, మరోసారి హ్యాట్రిక్ కొడ్తామని బీఆర్ఎస్ నాయకులు ఆశిస్తున్నా.. పరిస్థితులు అంత ఈజీగా లేవు.
కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చాన్నాళ్ల పాటు మంత్రివర్గాన్ని కూర్చలేదు. పూర్తి మెజారిటీ సాధించినా విపక్షాలను దెబ్బతీసే కుట్రతో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రం అప్పులకుప్ప అయింది. దాన్నుంచి బయటపడేందుకు భూములను అమ్ముతున్నారు. ఇలాంటివన్నీ అధికార పార్టీ విజయావకాశాలను దూరం చేయొచ్చు. అప్పట్లో ఎన్టీఆర్ చేసినట్టుగానే ఈసారి కేసీఆర్రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారని తెలుస్తున్నది. మరి ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.