రిజర్వేషన్లను చూసే తీరు మారాలె

మనదేశంలో రిజర్వేషన్ల మీద ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే ఉంటోంది. ఎవరో ఒకరు కోర్టుల ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియ మీద చర్చ లేపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు, రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బ తింటోందని, క్రీమిలేయర్ విధానం తీసుకురావాలని ఇలా ఎన్నో వాదనలను, చర్చను లేవదీసే ప్రయత్నం న్యాయస్థానాల ద్వారా ముందుకు తెస్తున్నారు. ఈ దేశంలో కుల వ్యవస్థ, ఆకలి, అవమానాలు, అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. అసలు రిజర్వేషన్లను మన సమాజం చూసే విధానమే మారాలి. అప్పుడే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు సరైన న్యాయం జరుగుతుంది.

ఎన్నో వేల సంవత్సరాలుగా అంటరానితనం, సామాజిక, ఆర్థిక అసమానతలకు గురైన సమాజానికి ప్రజాక్షేత్రంలో సమాన స్థాయిలో బతకడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపరిచారు. 1932లో జరిగిన లండన్ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో కమ్యూనల్ అవార్డు ద్వారా షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. రాజ్యాంగంలో ఆర్టికల్​ 341 షెడ్యూల్డ్ కులాలకు, 342 షెడ్యూల్డ్​ తెగలకు, ఆర్టికల్​ 340 వెనుకబడిన తరగతులకు సంబంధించినవి. షెడ్యూల్ కులాలు, తెగలకు రాజ్యాంగం ఉమ్మడిగా కొన్ని రక్షణలు కల్పించింది.

రిజర్వేషన్లు రాజ్యాంగం ఇచ్చిన హక్కు
మన దేశంలో రిజర్వేషన్లను చూసే తీరు మారాలి. రిజర్వేషన్లు అనేవి ప్రభుత్వాలు ఇచ్చే సదుపాయాలుగా కాకుండా రాజ్యాంగం ఇచ్చే హక్కుగా భావించాలి. ప్రతిభ, సమర్థతను చూసే ముందు ప్రతిభ వెనుక ఉన్న వేల సంవత్సరాల మానవ చరిత్రను చూడాలి. ఇప్పటికీ గ్రామాల్లో దళితుల పట్ల అసమానతలు, దాడులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. కులాధిపత్యం ఉపయోగించుకుని ఇంతవరకు ప్రయోజనాలు పొందిన వారికి, కుల వివక్షతకు గురైన వారు కులం పేరుతో పొందే ప్రయోజనాలను ప్రశ్నించే నైతిక హక్కులేదు. అవకాశాలను సమంగా పొందడానికి ఏర్పాటు చేసుకున్న ఒక మార్గమే రిజర్వేషన్లు. ఇది పూర్తిగా ప్రజాస్వామిక చర్య. సమాజంలో సమానత్వం సాధించడానికి ప్రజాస్వామ్య బద్ధమైన ఒక సాధనం. రిజర్వేషన్ పరిరక్షణ ప్రజాస్వామిక ఉద్యమంలో భాగమే. మనం ఒక ప్రజాస్వామిక సమాజం నిర్మించుకోవాలంటే, ఆధిపత్యాన్ని అడ్డుకోవాలంటే రిజర్వేషన్లు ఉండాలి. రిజర్వేషన్లపై పడి ఏడ్చేవాళ్లు ఒక ముఖ్య విషయం గమనించాలి. ఈ దేశ సంపద, భూమి కొంతమంది చేతుల్లో బందీ అయ్యింది. రిజర్వేషన్లు అవసరం లేదనుకుంటే ముందు దేశంలోని కుల వ్యవస్థను ధ్వంసం చేయాలి. ఈ దేశంలోని సంపద జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ జరగాలి.

అంతరాలను తొలగించడం ప్రభుత్వ కర్తవ్యం
సామాజిక సమానత్వం గురించి చర్చించేటప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్​ 38, 46 చాలా ముఖ్యమైనవి. 38(1) ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, జాతి జీవనంలో అన్ని వ్యవస్థల లక్షణమైనటువంటి సమాజాన్ని నిర్మించి, సంరక్షించి తద్వారా ప్రజల క్షేమాన్ని పెంపొందించడం ప్రభుత్వ కర్తవ్యం. 38(2) ప్రకారం.. స్థితిగతుల్లోనూ, సౌకర్యాల్లోనూ, అవకాశాల్లోనూ సమాజంలోని వ్యక్తుల మధ్యనే కాక, వివిధ వృత్తులను అనుసరించి లేక వివిధ ప్రాంతాల్లో నివసించే వర్గాల మధ్య ఉన్న అంతరాలను తొలగించటం ప్రభుత్వ కర్తవ్యం.(ఇందులో రెండో క్లాజ్​ను 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు) ఆర్టికల్​ 46 సమాజంలోని బలహీనులు ప్రత్యేకించి షెడ్యూల్ కులాల, తెగల విద్యా, ఆర్థిక అవసరాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో సాధించాలి. వాళ్లను సామాజిక అన్యాయాలు, అన్ని రకాల దోపిడీల నుంచి కాపాడాలి. ఈ రెండు ఆర్టికల్స్​ ఆదేశిక సూత్రాల జాబితాలో ఉన్నాయి.

అన్యాయాలకు ప్రధాన కారణం కుల వ్యవస్థే
రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు బాలాజీ వెర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్(1963) కేసులో చెప్పిందని చాలామంది ఊటంకిస్తున్నారు. అదే తీర్పులో రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు ఆర్టికల్​ 46 లోని ఆదేశాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిన సంగతి ఎవ్వరూ పట్టించుకోరు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సాధించాలని, స్థితి గతుల్లోనూ, సౌకర్యాల్లోనూ, అవకాశాల్లోనూ అంతరాలను తొలగించాలని, షెడ్యూల్డ్​ కులాలు, తెగలు సహా బలహీన వర్గాల విద్య, ఆర్థిక అవసరాలను తీర్చడంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాజ్యాంగం స్పష్టం చేసినా కులం ప్రాతిపాదికన రిజర్వేషన్లు ఏమిటని వ్యతిరేకిస్తారు? ఆర్థిక వివక్షత ఒకటే దేశంలో పోగొట్టవలసిన వివక్ష అని రాజ్యాంగ కర్తలు భావించలేదు. ఈ అంతరాలు ఏర్పడడానికి ఆర్థిక అసమానతలు ఒక కారణమైతే, కుల వ్యవస్థ మరో కారణమని తెలిసిందే.

వెనుకబడిన వర్గాలుగా రాజ్యాంగమే గుర్తించింది
ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం లేని వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని గురించి ఆర్టికల్ 16(4) చెప్తుంది. ఒక సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇచ్చే ముందు అది వెనుకబడిన వర్గమా, కాదా అని పరిశీలించడానికి ప్రతి రాష్ట్రంలో ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఆ కమిషన్ ఈ విషయాన్ని పరిశోధించాలని మండల్ కమిషన్ విషయంలో సుప్రీంకోర్టు అన్నది. అయితే ఇది ఎస్సీ, ఎస్టీలు కాని కులాలకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలను ఆర్టికల్ 16(9) పరిధిలో వెనుకబడిన వర్గాలుగా రాజ్యాంగమే గుర్తించిందని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. ఆర్టికల్ 16(4A) ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లకు సంబంధించి స్టేట్​ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్ కేసు అతి ముఖ్యమైనదిగా సుప్రీంకోర్టు భావించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్ల విషయంలో కూడా రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని తీర్పునిచ్చింది. ప్రభుత్వ సర్వీసుల్లో సరైన ప్రాతినిధ్యం లేని వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ రిజర్వేషన్లు కల్పించడం ఆర్టికల్​ 14,16(1) కు వ్యతిరేకం కాదని కోర్టు భావించింది. ఉద్యోగాల్లో సమానం అవకాశాలను కల్పించడానికి ఆర్టికల్ 16(4) ప్రకారం వివిధ పద్ధతులను అవలంబించవచ్చని, కావున ఎస్సీ, ఎస్టీ ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించడం ఆర్టికల్​ 16(4) కు అనుగుణంగా చేసిందేనని కోర్టు తీర్పు ఇచ్చింది.

70 ఏండ్లలో అన్ని సమస్యలూ తీరవు
కొన్ని వేల సంవత్సరాలుగా అసమానతలకు గురైన వర్గాలకు 70 ఏండ్ల పాటు ఇచ్చిన రిజర్వేషన్ తో అన్ని సమస్యలు తీరతాయని ఊహించలేం. ఈ వర్గాల చేతిలో భూమి లేదు, సేద్యం లేదు, పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు. సంపదకు సంబంధించిన ఏ ఒక్క అంశం కూడా వారి దరిదాపుల్లో లేవు. రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్ల ద్వారా చదువుకొని ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లోకి గ్రామానికి ఒక్కరు ఇద్దరు వస్తున్నారు. ఇప్పటికీ గ్రామాల్లో దళిత గిరిజనుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ వర్గాలు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఉద్యోగాల మీదే ఇప్పటికీ ఆధారపడుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య నానాటికీ పడిపోతోంది. ఇదే సమయంలో ప్రభుత్వాల నుంచి రాయితీలు తీసుకొని పరిశ్రమలు పెడుతున్న వాటిలో రిజర్వేషన్లు అమలు కావాలని ఏ ఒక్కరు ప్రభుత్వాన్ని కోరడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మాటిమాటికి రిజర్వేషన్ల ప్రక్రియకు భంగం కలగకుండా శాశ్వత పరిష్కారం చూపి వెనుకబడిన వర్గాల హక్కులను కాపాడాలని కోరుతున్నాం.

రిజర్వేషన్లే సమాజాన్ని పూర్తిగా మార్చలేవు
రిజర్వేషన్లు సమాజాన్ని పూర్తిగా మార్చవు కానీ మార్పునకు కావలసిన మెట్లను కడతాయి. రిజర్వేషన్లు ఒక ఒక రాజ్యాంగ హక్కు గా గుర్తించడానికి, వాటి గురించి నిరంతరం మాట్లాడడానికి ఈ దేశంలో కుల వ్యవస్థ మీద ఒక కచ్చితమైన అభిప్రాయం, అంచనా ఉండాలి. మనదేశంలో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రక్రియకు రాజ్యాంగ బద్ధత కల్పించబడిందని గమనించాలి. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి కూడా ఉన్న అసమాన సమాజంలో సమానత్వం కోసం తీసుకున్న చర్యల్లో రిజర్వేషన్లను కూడా ఒక చర్యగా భావించాలి. కుల ప్రాతిపాదికన రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలకు, 15(1), 29(1) అధికరణలకు విరుద్ధమని మద్రాస్ కు చెందిన దొరై రాజన్ కేసులో 1951లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పుడు పార్లమెంట్​ లో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 15కు క్లాజ్ "4"ను చేర్చారు. సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చని ఆ క్లాజ్​ లో కేంద్రం పేర్కొంది. దీంతో రాజ్యాంగ బద్ధత విషయంలో కొంత స్పష్టత వచ్చినా నాటి నుంచి నేటి వరకు రిజర్వేషన్లకు సంబంధించి అనేక విషయాల గురించి వివాదాలు, ఉద్యమాలు, శాసనాలు, కోర్టు తీర్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు
కుల వ్యవస్థ శూద్ర, పంచమ కులాలను నీచంగా చూసింది. రాజకీయంగానూ హక్కులు లేకుండా చేసింది. వాళ్లు చదువుకోవడానికి, ఉన్నత హోదా గల ఉద్యోగాలు చేయటానికి వీలు లేదు. చివరకు గుడిలోకి పోవడానికీ వీలు లేదు. ఈ అన్యాయం అన్ని కాలాల్లోనూ ఒకే రకంగా లేకపోయినా హైందవ సామాజిక వ్యవస్థలో ఎప్పుడూ ఉండనే ఉంది. ధర్మశాస్త్రాలు, పవిత్ర గ్రంథాలు దీనిని సిద్ధాంతీకరించాయి. ఈ కుల వ్యవస్థను నాశనం చేయడం అనేది రాజ్యాంగం ప్రభుత్వానికి ఆదేశించిన కర్తవ్యాల్లో ఒకటి. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా బుద్ధుడు మొదలు పూలే, అంబేద్కర్, నారాయణ గురు లాంటి సామాజిక వేత్తలు ఎన్నో ఉద్యమాలు చేశారు.

- కొంగల వెంకటి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం(టీఎస్)