హైదరాబాద్‎లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. నగరాన్ని దట్టంగా అలుముకున్న మబ్బులు..!

హైదరాబాద్‎లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. నగరాన్ని దట్టంగా అలుముకున్న మబ్బులు..!

హైదరాబాద్: హైదరాబాద్‎ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం (ఏప్రిల్ 17) సాయంత్రం వరకు నార్మల్‎గానే ఉన్న వెదర్.. రాత్రికి ఒక్కసారిగా చల్లబడి మేఘావృతమైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో దట్టంగా మబ్బులు అలుముకుని కారుచీకటి కమ్ముకుంది. క్యూమిలో నింబస్ మేఘాలతో నార్త్ హైదరాబాద్ సిటీకి వర్ష సూచన చేసింది రాష్ట్ర వాతవరణ శాఖ. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు కురుస్తుండగా.. చందనగర్, మియాపూర్, లింగంపల్లి, పఠాన్ చెరువు, కూకట్పల్లి,హైటెక్ సిటీ  ఏరియాలో మరో గంటలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. సిటీకి వర్షముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ అంచనాతో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసింది. 

నగరంలో ఎక్కవుగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలకు సిబ్బందిని తరలించింది. వర్షం పడే సూచన ఉండటంతో అవసరమైతేనే ప్రజలు బయటకు వెళ్లాలని సూచించింది. ఏదైనా అత్యవసరమైతే వెంటనే తమను సంప్రదించాలని సూచించింది జీహెచ్ఎంసీ. నగరాన్ని దట్టంగా మేఘాలు అలుముకోవడంతో ఉద్యోగుస్తులు, ఇతర ప్రయాణికులు వీలైనంత త్వరగా ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.