యాక్టర్ ఆదర్శ్ గౌరవ్..బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి వెళ్లిన తెలుగబ్బాయి. సింగర్ అండ్ లిరిక్ రైటర్ కూడా. ‘మై నేమ్ ఈజ్ ఖాన్‌లో జూనియర్ షారూఖ్‌గా, ‘మామ్’ సినిమాలో ‘మోహీత్ బంటీ’గా అలరించాడు. మరికొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ, టెలివిజన్ షోస్‌లోనూ కనిపించాడు. రీసెంట్గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన హాలీవుడ్ డ్రామా ‘ద వైట్ టైగర్’లో బలరామ్ హల్వాయి పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, రాజ్ కుమార్‌లతో స్ర్కీన్ షేర్ చేసుకున్నాడు. ఇందులో నటనకుగానూ బెస్ట్ యాక్టర్ కేటగిరి కింద ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యాడు గౌరవ్. ఇతని గురించి మరిన్ని విషయాలు అతని మాటల్లోనే..
మా నాన్న సొంతూరు శ్రీకాకుళం, అమ్మది విజయనగరం. నాన్న సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయ్ అవడం వల్ల రెగ్యులర్‌గా ట్రాన్స్ఫర్స్ అవుతుండేవి. నేను పుట్టి, పెరిగిందంతా జంషెడ్ పూర్, ముంబై సిటీల్లోనే. కానీ, అమ్మానాన్నలిద్దరూ తెలుగువాళ్లు అవడం వల్ల ఇంట్లో తెలుగే మాట్లాడతాం. పొరపాటున వేరే భాష మాట్లాడినా నాన్న ఊరుకోరు. అందుకే ఇప్పుడు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నా. ఇది నా యాక్టింగ్ కెరీర్‌కి ఒక రకంగా ప్లస్సే. ఎందుకంటే ఎక్కువ భాషలు మాట్లాడితే అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి.
ఇంట్రెస్ట్..
ఇండస్ట్రీలో పరిచయాలేం లేవు. అసలు ఈ ఫీల్డ్‌తో సంబంధాలున్న వాళ్లు కూడా తెలీదు. కానీ, చిన్నప్పట్నించీ ఇండస్ట్రీ గురించి కలలు కనేవాడ్ని. అయితే యాక్టర్‌గా కాదు సింగర్‌గా. ఊహ తెలిసినప్పట్నించీ మ్యూజిక్ పై తెలియని ఇష్టం. ఆ ఇష్టం రానురాను ఓ ప్యాషన్‌గా మారింది. దాంతో ‘సురేశ్ వాడ్కర్’ మ్యూజిక్ అకాడమీలో చేరా. స్కూల్ డేస్‌లో ‘స్టీప్స్కై’ అనే మ్యూజిక్ బ్యాండ్‌లో జాయిన్ అయ్యా. కాలేజీలో ‘ఓక్ ఐస్‌ల్యాండ్’ అనే బ్యాండ్‌తో కలిసి పర్ఫార్మెన్స్లు ఇవ్వడం మొదలుపెట్టా. అలా ‘కాలా ఘోడా ఫెస్టివల్’లో కాస్టింగ్ డైరెక్టర్ జోసెఫ్ టీమ్ నా పర్ఫార్మెన్స్ చూసి ఆడిషన్‌కి పిలిచారు. తీరా అక్కడికెళ్లాక ‘అరవింద్ అడిగా’ నవల ఆధారంగా రామిన్ బహ్రనీ తీస్తున్న సినిమా అని అర్థమైంది. చిన్నప్పుడు ఆ నవల చాలాసార్లు చదివా. పైగా రామిన్ బహ్రానీకి పెద్ద ఫ్యాన్‌ని. అందుకే బెస్ట్ ఆడిషన్ ఇచ్చా. లక్కీలి ద వైట్ టైగర్‌లో నటించే అవకాశం నాకే దక్కింది.
ద వైట్ టైగర్‌కి ముందు
ఈ సినిమాకి ముందు ఎయిర్టెల్, బార్బన్ బిస్కెట్స్, ఎస్బిఐ, డామినోస్ లాంటి చాలా అడ్వర్టైజ్మెంట్లలో కనిపించా. టీవీ షోస్, వెబ్ సిరీస్‌లలోనూ నటించా. బాలీవుడ్ సినిమాల్లోనూ ఆకట్టుకున్నా. అలాగని మ్యూజిక్నేం పక్కనపెట్టలేదు ప్లే బ్యాక్ సింగర్‌గా..సాంగ్ రైటర్‌గానూ రాణిస్తున్నా. కానీ, కెరీర్లో నా మొదటి బ్రేక్ మాత్రం ‘ ద వైట్ టైగర్’. ఇందులో బలరామ్ పాత్ర కోసం బాగా ప్రిపేర్ కావాల్సి వచ్చింది. జార్ఖండ్‌లో ఓ మారుమూల పల్లెలో ఒక వీధి బండి దగ్గర రోజంతా పని చేశా. 12 గంటలకు వంద రూపాయల జీతం తీసుకోవడంతో పాటు ఆ క్యారెక్టర్‌కి కావాల్సిన బాడీ లాంగ్వేజ్‌ను అడాప్ట్ చేసుకోగలిగా.
థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్
‘ద వైట్ టైగర్’లో ప్రియాంక చోప్రా, రాజ్ కుమార్ రావ్ లాంటి స్టార్స్‌తో స్ర్కీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టంగా ఫీలౌతా. వాళ్లతో కలిసి పనిచేసిన రోజులన్నీ మెమరబుల్ మూమెంట్స్. ఓ అప్‌కమింగ్ యాక్టర్‌తో కలిసి పనిచేస్తున్నామనే ఫీలింగ్ వాళ్లిద్దరి ముఖంలో ఎప్పుడూ కనిపించలేదు. ఇద్దరూ చాలా డౌన్టు ఎర్త్ పర్సన్స్. సింప్లిసిటీని ఎక్కువగా ఇష్టపడతారు. వర్క్ విషయంలో చాలా డెడికేటెడ్గాఉంటారు.. అందుకే ఇన్నేళ్లు అయినా ఇండస్ట్రీలో వాళ్లు నెగ్గుకురాగలుగుతున్నారు అనుకుంటా.
అబద్ధాల పుట్టని
కేవలం కథల్లో నటించడమే కాదు సందర్భం ఏదైనా సరే క్షణాల్లో కథలు అల్లేస్తా. అబద్ధాల పుట్టని కూడా ( నవ్వుతూ). ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినా, హోం వర్క్ చేయకపోయినా , స్కూల్‌కి లేటయినా.. ప్రతీ దానికీ ఓ అబద్ధం రెడీగా ఉంటుంది నా దగ్గర. అప్పటికప్పుడు ఏదో ఒక కథ అల్లి వినిపిస్తా. సర్ప్రైజింగ్లీ ఆ అబద్ధాల్ని అందరూ నమ్మేవాళ్లు . ది వైట్ టైగర్ షూటింగ్ టైంలోనూ ఓ ప్రాంక్ చేశా…
వైట్ టైగర్ షూటింగ్ టైంలో హోటల్లో స్టే చేసేవాడ్ని. ఉదయం లేవగానే ఆదర్శ్‌ని పక్కనపెట్టి లొకేషన్‌కెళ్లి బలరామ్ క్యారెక్టర్లోకి దూరేవాడ్ని. షూటింగ్ అయ్యాక ఆ గెటప్‌లోనే తిరిగి హోటల్‌కి వచ్చేవాడ్ని. దాంతో హోటల్ సిబ్బంది‘ కహా జానా హై’ అంటూ ఆపేవాళ్లు. నా రూం కార్డ్ చూపించినా నమ్మేవాళ్లు కాదు. నాతో పాటు హోటల్ రూం వరకు వచ్చేవాళ్లు. కాస్త ఫన్ ఉంటుంది కదా! అని నేను కూడా యాక్టర్ అని చెప్పేవాడ్ని కాదు. ఒకసారైతే హౌజ్ కీపింగ్ పర్సన్ నా రూంలో ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్ రావ్ ఫొటోలని చూసి నన్ను కాంట్రాక్ట్ కిల్లర్ అనుకున్నాడట. నన్ను చూసి బాగా భయపడేవాడు. కానీ, ఎలా తెలిసిందో తెలీదు కానీ నేను యాక్టర్‌ని అని బయటపడింది. అప్పట్నించీ నేను కనిపిస్తే నవ్వడం మొదలుపెట్టారు.
మంచి సినిమాలు చేయాలి
‘ది వైట్ టైగర్’కి మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ క్రిటిక్స్‌ని ఈ సినిమా ఎట్రాక్ట్ చేసింది. కానీ, కొందరు ఈ సినిమాని ఇండియన్ సినిమాగా చూడట్లేదు. ఇగ భవిష్యత్తు విషయానికొస్తే ఫ్యూచర్లో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్‌లో నటించాలని ఉంది. పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేయాలని ఉంది. బాలీవుడ్‌తో పాటు తమిళం, మలయాళం సినిమాల్లోనూ కనిపించాలనుకుంటున్నా. హాలీవుడ్‌లోనూ మరిన్ని సినిమా అవకాశాలొస్తాయని ఆశిస్తున్నా.
For More News..