భర్త తాగి తిరుగుతున్నాడని..భార్య సూసైడ్

  • బాలానగర్ పరిధిలో ఘటన

కూకట్​పల్లి, వెలుగు : తాగుడుకు బానిసైన భర్త పనికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతున్నాడనే ఆవేదనతో వివాహిత ఉరేసుకొని మృతి చెందింది. ఏపీలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన దేవి(30), ఉమాపతి దంపతులకు 2017లో పెండ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేండ్లుగా వీరు బాలానగర్​ పరిధిలోని రాజుకాలనీలో నివసిస్తున్నారు. ఉమాపతి గతంలో ప్రైవేటు కంపెనీలో వర్కర్​గా పని చేయగా, దేవి ఇళ్లల్లో పనికి వెళుతోంది. ఆమె భర్త కొంతకాలంగా పని మానేసి రోజూ తాగి ఇంటికి వచ్చి గొడవ పడుతున్నాడు. 

తాగుడు మానేసి పనికి వెళ్లమని ఎంత బతిమాలినా తీరు మార్చుకోలేదు. ఇదే విషయమై మంగళవారం రాత్రి దంపతులిద్దరు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున దేవి ఫ్యాన్​కు ​ఉరేసుకొని మృతి చెందింది. స్థానికుల సమచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.