- వీడిన ములుగు మర్డర్ మిస్టరీ
ములుగు, వెలుగు: ములుగు పట్టణ శివార్లలో ఆదివారం జరిగిన మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్యే ప్రియుడితో కలిసి భర్తను చంపించిందని పోలీసులు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను ములుగు డీఎస్పీ ఎన్.రవీందర్ మంగళవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓర్సు శ్రీను (37) భార్య స్వప్నతో కలిసి హనుమకొండలో ఉంటూ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
శ్రీను భార్య స్వప్న హసన్‌పర్తి మండలం మడిపల్లికి చెందిన బుర్ర సంతోష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. శ్రీను మద్యానికి బానిసై తరుచు వేధిస్తుండడంతో పాటు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుండడంతో అతడిని చంపేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో స్వప్న తన ప్రియుడు సంతోష్‌కు రూ.30 వేలు ఇవ్వగా అతడి తన ఫ్రెండ్స్ నడికుడ మండలం కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన ఆకుల అనిల్, బెల్లంకొండ చంద్రమోహన్‌తో కలిసి శ్రీను హత్యకు ప్లాన్ చేశాడు.
ఇందులో భాగంగా ఈ నెల 21న రాత్రి మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకుందామని చెప్పి స్వప్న తన భర్త శ్రీనుతో పాటు అనిల్, చంద్రమోహన్‌తో కలిసి ఆటోలో బయలుదేరింది. సంతోష్ కారులో ఆటోను ఫాలో అయ్యాడు. రాత్రి 11.30 గంటలకు ములుగు చేరుకున్న వారు శ్రీనుతో మద్యం తాగించి గొడవ పడ్డారు. తర్వాత పెద్ద బండరాయితో శ్రీను తలపై కొట్టి, అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. తెల్లారి డెడ్‌బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు చెప్పడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
మృతుడి ఓర్సు శ్రీనుగా గుర్తించి, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని అనుమానించిన పోలీసులు డీఎస్సీ ఎన్.రవీందర్ ఆధ్వర్యంలో పస్రా సీఐ రవీందర్, ములుగు ఎస్సై వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో మూడు టీంలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు వచ్చిన వాహనాలను గుర్తించారు. నిందితులు గట్టమ్మ సమీపంలో ఉన్నట్లు తెలుసుకొని మంగళవారం శ్రీను భార్య స్వప్న, ఆమె ప్రియుడు సంతోష్, అనిల్, చంద్రమోహన్‌ను అరెస్ట్ చేసి, ములుగు కోర్టులో హాజరుపరిచారు. వారి నుంచి కారు, ఆటో, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న సీఐ జి.రవీందర్, ఎస్సైలు సీహెచ్.వెంకటేశ్వర్‌రావు, పి.లక్ష్మారెడ్డిని ఎస్పీ శబరీశ్ అభినందించారు.