మర్డర్ ను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘటన
గోదావరిఖని, వెలుగు : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య హత్య చేయించింది. ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈ ఘటన జరిగింది. హత్యకు సంబంధించిన వివరాలను రామగుండం పోలీస్ స్టేషన్‌లో గోదావరిఖని ఏసీపీ శ్రీనివాసరావు బుధవారం మీడియాకు తెలిపారు. గోదావరిఖనిలోని పోతన కాలనీలో సింగరేణి క్వార్టర్లలో నివాసం ముండే లావుడ్య మధుకర్.. సింగరేణి సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి భార్య రమ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతంలో ఓ పెళ్లి సంబంధం విషయంలో భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం గ్రామానికి చెందిన దరావత్ గోవర్ధన్‌తో రమకు పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్ని సందర్భాల్లో మధుకర్ ఇంటికి గోవర్ధన్ వచ్చి రెండు మూడు రోజులు ఉండేవాడు. ఫోన్ లో కూడా ఎక్కువగా మాట్లాడుతుండడంతో మధుకర్‌కు రమపై అనుమానం ఏర్పడింది. ఈ విషయాన్ని అతను ఎక్కడా చెప్పలేదు. ఈ విషయాన్ని పసిగట్టిన రమ.. తన భర్త మధుకర్ అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ విషయాన్ని తన ప్రియుడు గోవర్ధన్‌కు తెలిపింది. ఇద్దరూ కలిసి మధుకర్ ను హత్య చేయాలని ప్లాన్ చేశారు.
మద్యం తాగించి ఇనుప రాడ్ తో కొట్టి చంపేశారు
ఈ క్రమంలో గత నెల అక్టోబర్ 29న మధుకర్ మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం మూడు గంటలకు ఇంటికి చేరుకున్నాడు. తమ ప్లాన్‌లో భాగంగా రాత్రి ఏడు గంటలకు రమకు గోవర్ధన్ ఫోన్ చేసి మధుకర్‌తో మాట్లాడాడు. మద్యం తాగడానికి బయటకు రావాలని కోరడంతో అతను అంగీకరించాడు. అప్పటికే గోవర్ధన్ తన గ్రామానికి చెందిన స్నేహితులు నాగరాజు, లక్ష్మణ్‌తో అక్కడ సిద్ధంగా ఉన్నాడు. నలుగురు కలిసి రెండు బైక్ లపై గోదావరిఖని ఫైవింక్లయిన్ ఏరియాలోని వైన్ షాప్‌లో మద్యం కొన్నారు. అక్కడి నుంచి రామగుండం వైపు వెళ్లి మల్యాలపల్లి క్రాసింగ్ వద్ద రోడ్డు పక్కన వెహికిల్స్ ఆపి చెట్ల పొదల్లో కూర్చుని మద్యం తాగారు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం గోవర్ధన్,
అతని స్నేహితులు తమ వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో మధుకర్ తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులు వెంటనే డెడ్ బాడీని రోడ్డు పక్కన ఉన్న కెనాల్‌లో పడేశారు. మధుకర్ మృతదేహం పక్కనే అతని మోటర్ సైకిల్‌ను స్టార్ట్ చేసి పడేశారు. ఈ సంఘటనను వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మృతుడి భార్య రమకు కూడా చూపించి నిందితులంతా అక్కడి నుంచి పరారయ్యారు. తర్వాత తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని బంధువులు, కుటుంబ సభ్యులు, కాలనీ వాసులను రమ నమ్మించింది. అయితే, మృతుడి తల్లిదండ్రులు, సోదరుడికి అనుమానం వచ్చి భార్య రమే హత్య చేయించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు దర్యాప్తు చేసి మధుకర్‌ను అతని భార్య, ప్రియుడు గోవర్ధన్, మరో ఇద్దరు కలిసి హత్య చేసినట్లు గుర్తించారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. బుధవారం రమతో పాటు ఆమె ప్రియుడు గోవర్ధన్, అతని స్నేహితులు నాగరాజు, లక్ష్మణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.