- డెత్ సర్టిఫికెట్ సృష్టించి 150 గజాల స్థలం అమ్మకం
- ఆరు నెలల తర్వాత భర్త వేధిస్తున్నాడని కేసు
- విషయం తెలుసుకొని కాజీపేట పోలీసులకు భర్త ఫిర్యాదు
కాజీపేట, వెలుగు : ప్రేమించి పెండ్లి చేసుకున్న భర్త చనిపోయాడంటూ డెత్ సర్టిఫికెట్ సృష్టించి అతని పేరుపై ఉన్న స్థలాన్ని అమ్మేసింది ఓ భార్య. కాజీపేటకు చెందిన మాలోతు వినోద్, ఇస్లావత్ లక్ష్మీ నిర్మల 2008 జనవరి 28న ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో 2013 సెప్టెంబర్‌లో నిర్మల తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయమై వినోద్ వరంగల్‌లోని తన అడ్వకేట్ ప్రభాకర్‌ను కలిసేందుకు రాగా, అక్కడ అతను చెప్పిన విషయం విని షాక్ తిన్నాడు.
కేసు విచారణ సమయంలోనే 2013 మార్చి 19న గుమ్మడివెల్లిలో తాను మరణించినట్లు నిర్మల రంగారెడ్డి జిల్లాలో డెత్ సర్టిఫికెట్ పొందినట్లు లాయర్ ద్వారా వినోద్ తెలుసుకున్నాడు. అదే ప్రాంతంలో తనకు చెందిన 150 గజాల స్థలాన్ని హరినాథ్ రెడ్డి అనే వ్యక్తికి అమ్మినట్లు గుర్తించాడు. తాను 2013 మార్చిలో చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించిన నిర్మల.. ఆరు నెలల తర్వాత తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలుసుకుని ఖంగుతిన్నాడు. ఈ క్రమంలో కాజీపేట పోలీస్ స్టేషన్‌లో నిర్మలపై క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించారు.
Also Read:-కుళ్లిన కూరగాయలు, పాడైపోయిన ఇడ్లీ పిండి .. గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో క్వాలిటీలేని ఫుడ్!
అయితే.. వీరిద్దరు చాలా కాలంగా ఈ ప్రాంతంలో లేకపోవడం.. వారు అమ్మిన ఆస్తులు, తీసుకున్న డెత్ సర్టిఫికెట్ హైదరాబాద్‌లోనే ఉండడంతో కేసు అక్కడే పెట్టాలని స్థానిక సీఐ సుధాకర్ రెడ్డి సూచించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, లేకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితుడి తరఫు అడ్వకేట్ చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.