యువత సద్వినియోగం చేస్కోవాలె: వింగ్ కమాండర్ విక్రమ్ కుమార్
రైల్వే డిగ్రీ కాలేజీ స్టూడెంట్లకు ఎయిర్ ఫోర్స్ పై అవగాహన
సికింద్రాబాద్, వెలుగు : వాయుసేనలో యువతకు అద్భుత అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ విక్రమ్ కుమార్ సూచించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ తార్నాకలోని రైల్వే డిగ్రీ కాలేజీ స్టూడెంట్లకు అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఐఏఎఫ్ పబ్లిసిటీ బస్సును తీసుకొచ్చి స్టూడెంట్లకు లైవ్ ఎక్స్ పీరియన్స్ కల్పించారు. అనంతరం కాలేజీ ఆడిటోరియంలో విక్రమ్ కుమార్ మాట్లాడారు.
ఎయిర్ ఫోర్స్ లో ఎక్కువగా ఉత్తరాదివారే చేరతారని, ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్, భర్తీ ప్రక్రియ గురించి అవగాహన లేకపోవడం, అపోహలు ఉండటం వల్లే దక్షిణాది యువత ఎక్కువగా ఆసక్తి చూపడంలేదన్నారు. అందుకే ఐఏఎఫ్ ‘దిశ’ విభాగం ద్వారా విద్యాసంస్థల్లో అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది జనవరి 4న ప్రారంభమైన ఈ స్పెషల్ డ్రైవ్ వచ్చే నెల 12 వరకు కొనసాగుతుందన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 825 సంస్థల్లో 2.5 లక్షల మంది స్టూడెంట్లకు అవగాహన కల్పించామన్నారు. మెట్రో సిటీలతో పాటు నగరాలు, గ్రామాలకు సైతం వెళ్లి అవగాహన కల్పిస్తామన్నారు.
ఐఏఎఫ్ చరిత్ర, ఉపాధి అవకాశాలు, భర్తీ ప్రక్రియ తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. భాష్యం మాట్లాడుతూ.. వింగ్ కమాండర్ విక్రమ్ కుమార్ తమ కాలేజీ పూర్వ విద్యార్థి కావడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంతో వాయుసేన గురించి మంచి అవగాహన వచ్చిందన్నారు.