ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటర.. ఎమ్మెల్యే రేగాను నిలదీసిన మహిళ

రోగుల ప్రాణాలు పోతుంటే పట్టించుకోరా ? అంటూ ఎమ్మెల్యేను ఓ మహిళ నిలదీసింది. ర్యాలీ నిర్వహించడం వల్ల ఓ రోగి తీవ్ర అవస్థలు పడుతున్నాడని, వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించాల్సి ఉందని వెల్లడించింది. వెంటనే రోగికి దారివ్వాలని సూచించింది. ప్రజల ఓట్లతో గెలిచి.. ఇలా చేయడం సరికాదంటూ సూచించింది. ఈ ఘటన బయ్యారంలో చోటు చేసుకుంది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యిందని సమాచారం. వెంటనే ఓ మహిళ సభ వద్దకు వచ్చింది.

ములుగు నుంచి భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో రోగి వస్తున్నాడని.. ర్యాలీ కారణంగా.. ఇరుక్కపోయాడని వెల్లడించింది. ఆసుపత్రికి తరలించకపోతే.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అక్కడున్న పోలీసు సిబ్బందికి తెలియచేసింది. ఇక్కడ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారని నిలదీసింది. ఆసుపత్రులకు వెళ్లే వారు ఉన్నారని.. వెంటనే క్లియర్ చేయాలని కోరింది. అమ్మా.. ఆగు.. అంటూ ఎమ్మెల్యే చెప్పడంతో ఆమె ఆగ్రహానికి గురైంది. ప్రజలు ఇబ్బందులు పెట్టుకొనేలా సభ పెట్టుకుంటారా ? అని మరోసారి నిలదీసింది. పో.. వాళ్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.. అంటూ ఎమ్మెల్యే స్పీచ్ కొనసాగించారు.