- వరంగల్ పాలన అంతా హనుమకొండ నుంచే..
- ఆరేండ్లయినా కలెక్టరేట్ కట్టలే..
- కొత్త కలెక్టరేట్‍కు ఇంకా ముగ్గు పోయలే..
- ఏడాది కింద అజాంజాహి గ్రౌండ్‍లో 6.16 ఎకరాల స్థలం కేటాయింపు
వరంగల్, వెలుగు: రాష్ట్రానికి వరంగల్‍ను రెండో రాజధాని లెక్క డెవలప్ చేస్తామన్న ప్రభుత్వ పెద్దల మాటలు అలాగే మిగిలిపోతున్నాయి. ఏండ్లు గడిచినా వరంగల్జిల్లాకు కలెక్టరేట్ కట్టలేదు. ఇప్పటికీ వరంగల్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా హనుమకొండ నుంచే నడుస్తోంది. నిన్నగాక మొన్న కొత్తగా ఏర్పడిన జిల్లాలకు సమీకృత కలెక్టర్ భవనాలు నిర్మించి ప్రారంభిస్తున్నా.. ఎంతో చరిత్ర ఉన్న వరంగల్ జిల్లాకు కలెక్టరేట్ నిర్మాణంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. 'ఇక్కడ కడుతాం.. అwaranక్కడ కడుతాం' అంటూ ఎమ్మెల్యేలు, లీడర్లు క్షీరాభిషేకాలు చేయించుకున్నారు. 'ఇక రేపో ఎల్లుండో ముగ్గు పోస్తామని' సభలు, రివ్యూల్లో చెప్పడం తప్పించి పనులకు కొబ్బరికాయ కొట్టలేదు. పోనీ ఇప్పుడైనా జిల్లాలోనైనా శాఖలన్నీ ఒక్కదగ్గర ఉన్నాయా అంటే అదీ లేదు. దీంతో ఏదైనా సమస్య పరిష్కారం కోసం వచ్చే జనాలు ట్రై సిటీ అంతా తిరగాల్సి వస్తోంది.
ఓపెనింగ్ రేపు మాపు అంటూ..
చిన్న జిల్లాలతోనే పాలన ఈజీగా ఉంటుందని రాష్ట్రంలో 2016లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్జిల్లా ఆరు జిల్లాలుగా విభజించారు. హనుమకొండ(అప్పుడు వరంగల్అర్బన్జిల్లా)కు ప్రస్తుతమున్న కలెక్టరేట్, ఇతర భవనాలు కేటాయించారు. వరంగల్(అప్పుడు వరంగల్రూరల్) జిల్లాకు ఇప్పటికీ కలెక్టర్భవనాలు లేవు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలు నిర్మాణాలు పూర్తై ప్రారంభోత్సవాలు కూడా అయ్యాయి. ఇంకొన్ని ఓపెనింగ్ కోసం రెడీగా ఉన్నాయి. కాగా వరంగల్ జిల్లాకు కొత్త కలెక్టరేట్నిర్మాణానికి ఇప్పటికీ ముగ్గు పోయలేదు.
పనులన్నీ హనుమకొండ జిల్లా నుంచే
ఆరేండ్లుగా వరంగల్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం హనుమకొండ జిల్లా నుంచే సాగుతోంది. అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం కోసం ఆఫీసులకు వచ్చే జనాలు వాటి అడ్రస్ దొరకడానికి ట్రైసిటీ అంతా తిరగాల్సి వస్తోంది. కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీస్ కమిషనరేట్, డీఎంహెచ్‌వో, అగ్రికల్చర్, ఫారెస్టు, ట్రైబల్ వెల్ఫేర్, లీడ్ బ్యాంక్, ఆర్‍అండ్‌బీ, గ్రౌండ్ వాటర్, విద్యాశాఖ.. తదితర 30 నుంచి 40 ప్రధాన శాఖల అధికారులంతా హనుమకొండ జిల్లా కేంద్రంగా పనిచేస్తున్నారు. 70 శాతం ఆఫీసులు ప్రైవేట్ బిల్డింగ్‍లో జనాలకు దూరంగా ఉన్నాయి.
అజాంజాహి గ్రౌండ్‍లో స్థలమిచ్చి ఏడాది..
హనుమకొండ జిల్లాకు రూ.57 కోట్లతో కొత్త కలె క్టరేట్ నిర్మించగా దానిని ప్రారంభించేందుకు గతేడాది జూన్ 21న సీఎం కేసీఆర్ వరంగల్వ చ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వ హించిన సమావేశంలో త్వరలోనే వరంగల్ జిల్లాకు కొత్త కలెక్టర్ భవనం కడతామని హామీ ఇచ్చారు. 2021 డిసెంబర్ 16న అజాంజాహి గ్రౌండ్ స్థలంలో 6.16 ఎకరాల ల్యాండ్ కేటాయి స్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో టీఆర్‍ఎస్ కేడర్ సీఎం కేసీఆర్ ఫొ టోకు క్షీరాభిషేకాలు చేసి సంబురాలు నిర్వహించారు. నెల తిరగకముందే నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. తీరాచూస్తే.. ప్రభుత్వం అజాంజాహి స్థలం ఇచ్చి నిన్నటికి ఏడాది అయింది తప్పితే ప్రభుత్వ పెద్దలు, లోకల్ ఎమ్మెల్యే చెప్పినట్లు పనులకు కొబ్బరికాయ కొట్టనే లేదు. ఎక్కడెక్కడి నుంచో పనుల కోసం వచ్చే జిల్లా జనా లకు హనుమకొండకు పోయే అవస్థలు తప్పట్లేదు.