బోధన్,వెలుగు : నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కార్మికులు డిమాండ్ చేశారు. బుధవారం ఫ్యాక్టరీ ఎదుట ధర్నా చేశారు. ఫ్యాక్టరీ లే ఆఫ్ ప్రకటించిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో చనిపోయిన కార్మికులకు నివాళి అర్పించారు. ఈసందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ఎస్డీఎల్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ హామీ ఇచ్చి, ఇప్పుడు కార్మికులను రోడ్డున వదిలేశారని ఆవేదన చెందారు. ఫ్యాక్టరీ లే ఆఫ్ తర్వాత కార్మికుల జీవితాలు ఆగం అయ్యాయని, ఎంతో మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. లాభాలతో నడిచే ఫ్యాక్టరీని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మూసేశారని ఆగ్రహించారు.
కార్మికులకు ఎనిమిదేండ్ల నుంచి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పిల్లలకు చదివించలేక, పెండ్లీలు చేయలేక కార్మికులు మనోవేదన గురౌతున్నారని ఆవేదన చెందారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంలేక 15మంది కార్మికులు చనిపోయారని గుర్తు చేశారు. కార్మికులకు రావల్సిన బోనస్ డబ్బులు, వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంజీర పరివాహక ప్రాంతంలోని రైతులు నేటికి చెరకు పండిస్తున్నారని, చార్జీలు ఎక్కువైనా మహారాష్ట్ర, కామారెడ్డి, జహీరాబాద్ ప్రాంతాలకు చార్జీలు ఎక్కువైనా తరలిస్తున్నారని తెలిపారు. కార్మికులను ఆదుకోవాలని ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈధర్నాకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. ధర్నాలో చనిపోయిన కార్మికుల కుటుంబీకులు, బీజేపీ నాయకులు మేడిపాటి ప్రకాశ్‌రెడ్డి , మోహన్‌రెడ్డి , బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కొలిపాకబాల్రాజ్, మండల ప్రెసిడెంట్ పోశెట్టి, రెంజల్ మండల జడ్పీటీసీ విజయ సంతోష్, నాయకులు రామరాజు, అశోక్‌గౌడ్, హరికృష్ణ, కాంగ్రెస్ నాయకులు హరికాంత్‌చారి, విష్ణు, నవీన్, కార్మికులు పాల్గొన్నారు.
గ్రూప్-1 ఎగ్జామ్‌కు అన్ని ఏర్పాట్లు
కామారెడ్డి , వెలుగు : ఈనెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు కామారెడ్డి జిల్లాలో 9 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో 4,549 మంది పరీక్ష రాయనున్నారని, ఇప్పటి వరకు కేవలం 3 వేల మంది మాత్రమే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు చెప్పారు. మిగతా వారు కూడా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. గ్రూప్-1 ఎగ్జామ్‌లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నట్టు చెప్పారు. అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్‌కు ఉదమం 8.30 గంటలకే రావాలని, సెంటర్ ఎంట్రెన్స్‌లోనే బయోమెట్రిక్ ఎంట్రీ జరుగుతుందన్నారు.
అభ్యర్థులు ప్రశాంతవాతవరణంలో ఎగ్జామ్ రాసేలా సెంటర్లలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి 24 మందికి ఒక ఇన్విజిలేటర్ ఉంటారన్నారు. సెంటర్ల లోపలకు మొబైల్ఫోన్లు, బంగారు అభరణాలకు అనుమతిలేదన్నారు. అభ్యర్థులు ఇబ్బందులకు గురికాకుండా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామని, హెల్ప్ లైన్ నంబర్ 9989215590 కు ఫోన్ చేసి అభ్యర్థులు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు.
సీసీటీవీల పర్యవేక్షణలో..
నిజామాబాద్ : గ్రూప్-1 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసి, పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ సి.నారాయణరెడ్డి చెప్పారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో నిర్వహించే పరీక్ష వివరాలను చైర్మన్ కు వివరించారు. జిల్లాలో 12,858 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని , వీరి కోసం 40 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షకు సంబంధించిన సందేహాల కోసం 08462-220183 ఫోన్ నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్ బి.చంద్రశేఖర్, సీపీనాగరాజు , డీసీపీ అరవింద్ బాబు, నిజామాబాద్ ఆర్డీఓ రవి, డీఐఈఓ రఘురాజ్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ పవన్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ టౌన్, వెలుగు : దేశంలో ప్రజల ఐక్యతను బీజేపీ దెబ్బతీస్తోందని, కులాల, మతాల మధ్య చిచ్చులుపెట్టి లౌకిక సంప్రదాయాలను కాలరాస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సీపీఐ జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘దేశ ప్రజల ఐక్యత, అభివృద్ధి, లౌకిక సంప్రదాయాల పరిరక్షణ’ అంశంపై ఈనెల 14 నుంచి 16 వరకు విజయవాడలో సీపీఐ జాతీయ 24వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభలను విజయవంతం చేయాలని ఆమె కోరారు.
మతోన్మాదం, కార్పొరేట్ కూటమిగా నయా ఉదారవాద ఆర్థిక విధానాలను అమలు చేయడం వల్ల పేదరికం, ఆకలి, అనారోగ్య, నిరుద్యోగం విపరీతంగా పెరిగాయన్నారు. కార్పొరేట్లకు కొమ్ముకాసే ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నంత కాలం ప్రజలకు మేలు జరగదన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభించే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకురాలు, మాజీ జాతీయ మహిళా కమిషన్ సభ్యులు జమున, జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు రామారావు, ఎంపీటీ నగర అధ్యక్షులు అబ్దుల్ బాసిత్, అడ్వకేట్ రవీందర్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు నర్సింలు గౌడ్, సీపీఐ రాష్ట్ర నాయకులు కంచర భూమయ్య, జిల్లా నాయకులు వై. భూమయ్య, పి. రాజేశ్వర్ ,రఫీ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
వంట సిలిండర్ల ధరలు తగ్గించాలె
బోధన్, వెలుగు : నిత్యం అవసరమయ్యే వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని ప్రగతిశీల మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు నాగమణి డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలను వ్యతిరేకిస్తూ బుధవారం పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు మాత్రమే ఇస్తామని, నాల్గో సిలిండర్‌కు అదనంగా రూ.500 చెల్లించాలని చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ధరలను తగ్గిస్తామని చెప్పి, అధికారంలోకి రాగానే గతంలో కన్నా ఎక్కువగా రేట్లు పెంచుతున్నారని మండిపడ్డారు.
సామన్య, మధ్యతరగతి ప్రజలు పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సిలిండర్‌పై అదనంగా పెంచే ధరను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే దేశవ్యాప్తంగా మహిళ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళ నాయకులు బిపాషాబేగం, సూర్యకళ, గంగామణి, కళావతి, లింగామణి, రమా, సావిత్రి, అనిషా, తబస్సేబేగం పాల్గొన్నారు.
అంగన్వాడీల బకాయిలు చెల్లించాలి
నిజామాబాద్ టౌన్, వెలుగు : అంగన్వాడీలకు బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ , హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ ఆఫీస్‌లో యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏడాదికి పైగా అర్బన్, డిచ్ పల్లి, బోధన్ ప్రాజెక్టులో అంగన్వాడీలకు గ్యాస్, కూరగాయల బిల్లులు బకాయి ఉన్నాయన్నారు. సరుకులకు సొంత డబ్బులు ఇస్తున్నామని, కరోనా సమయంలో వేతనాల్లో 30 శాతం కోతలు విధించారని, వాటిలో ఒక నెల జీతం ఇప్పటికీ చెల్లించలేదని పేర్కొన్నారు. నవంబర్ 5న యూనియన్ జిల్లా మహాసభలను, ప్రాజెక్టు మహాసభలు జరిపి యూనియన్ బలోపేతం చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు రమేశ్ బాబు, కోశాధికారి చంద్రకళ, ప్రధాన కార్యదర్శి స్వర్ణ, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
షర్మిల బహిరంగ సభను సక్సెస్ చేయాలి
బోధన్, వెలుగు : ఈ నెల 16న బోధన్‌లో జరిగే వైఎస్ షర్మిల బహిరంగ సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ కోఆర్డినేటర్ గౌతం ప్రసాద్ కోరారు. బుధవారం పట్టణంలోని పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లడుతూ షర్మిల చేస్తున్న పాదయాత్ర ఈనెల 16న కోటగిరి మండలంలోని ఎత్తోండ నుంచి బోధన్ మండలలలోని పెంటకుర్దు, సాలంపాడ్, సాలూరక్యాంప్, నాగన్‌పల్లి, మీదుగా బోధన్ కు చేరుకుంటుందని తెలిపారు. బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. బహిరంగసభను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జి.జగన్, నాయకులు సరోజ, లత, పోతురాజు పాల్గొన్నారు.
టీయూలో హాస్టళ్లను వెంటనే ప్రారంభించాలె
డిచ్పల్లి, వెలుగు : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ లోని హస్టళ్లను వెంటనే ప్రారంభించాలని పీడీఎస్‌యూ వర్సిటీ కార్యదర్శి సంతోష్ బుధవారం ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు. హాస్టళ్లను ఈ నెల 26 నుంచి ప్రారంభిస్తామని వర్సిటీ ఆఫీసర్లు ప్రకటించారని గుర్తు చేశారు. గ్రూప్ 1 ఎగ్జామ్ సందర్భంగా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ నిజామాబాద్ సెంటర్ ని ఎంచుకున్నారని అన్నారు. సెలవుల నేపథ్యంలో వారంతా దూర ప్రాంతాలకు వెళ్లిపోయారని చెప్పారు. హస్టల్స్ ప్రారంభించకుంటే స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.