కోల్‌బెల్ట్,వెలుగు: సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తికే అధిక ప్రాధాన్యమిస్తూ.. గనుల్లో సేఫ్టీపై నిర్లక్ష్యం చేస్తూ.. తమ సంక్షేమాన్ని కూడా పట్టించుకోవడం లేదని కార్మికవర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా గెలిచాయి. కానీ.. ఇప్పటి వరకు కార్మికుల సంక్షేమం, సమస్యలపై నిర్మాణాత్మక, జేసీసీ మీటింగ్ లు నిర్వహించలేదు. దీంతో కార్మికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. సింగరేణి కూడా గతంలో మాదిరిగా పాదయాత్రలు, డయల్ యువర్జీఎం, మీట్ యువర్జీఎం వంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడంలేదు. మరోవైపు కార్మికుల దీర్ఘకాల సమస్యలన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఐదేండ్లుగా మీటింగ్ ల్లేవ్ ..
కార్మికుల సమస్యలపై చర్చించి అగ్రిమెంట్ చేసుకునే స్ర్టక్చరల్, జేసీసీ వంటి ముఖ్యమైన మీటింగ్ లను ఐదేండ్లుగా నిర్వహించడంలేదు. 2017 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్గెలిచింది. నాలుగు సార్లు మీటింగ్ లు జరిగాయి. ఆ తర్వాత ఊసేలేదు. నాలుగేండ్ల తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు గతేడాది డిసెంబర్ 28న జరిగాయి. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా, ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘంగా గెలిచాయి. తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కార్మికుల ఆశించారు. కానీ.. ఏడాది కాలంగా ఎలాంటి మీటింగ్ లు నిర్వహించకపోతుండగా సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శిక్షణ పూర్తయినా నిర్లక్ష్యమే..
గతేడాది గెలిచిన కార్మిక సంఘాలకు 9 నెలల తర్వాత గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు సర్టిఫికెట్లు ఇచ్చారు. రెండు నెలలు కావొస్తున్నా మీటింగ్‌లపై దృష్టి పెట్టడడంలేదు. గత అక్టోబర్ఆఖర్లో రెండు సంఘాల లీడర్లకు హైదరాబాద్‌లో సింగరేణి సంస్థ శిక్షణ ఇచ్చింది. కానీ.. మీటింగ్ ల నిర్వహణ తేదీని ప్రకటించలేదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్మాణాత్మక సమావేశం ఏర్పాటు చేస్తే కార్మికుల సమస్యలను ప్రస్తావించే చాన్స్ఉంటుంది. ప్రాముఖ్యత కలిగిన అంశాలపై తగిన నిర్ణయాలు తీసుకుంటారు. జేసీసీ మీటింగ్ ల్లోనూ దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఇప్పటి వరకు మీటింగ్‌లపై ఎలాంటి ప్రకటన లేదు. కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సింగరేణి ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తున్నా సంస్థ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగానే ఉంటున్నారు.
పెండింగ్‌లో కార్మికుల సమస్యలు
మారు పేర్లతో పనిచేసే కార్మికులను రెగ్యులర్ చేయడం, కొత్త బొగ్గు గనులు, పెర్క్స్‌పై ఇన్ కమ్ ట్యాక్స్ కంపెనీ చెల్లించాలనే డిమాండ్‌పై చర్చ, కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్‌కమిటీ వేతనాల చెల్లింపు, సింగరేణిలో ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాక్‌ల వేలం అడ్డుకోవడం, కార్మికులకు సొంతింటి స్కీమ్ అమలు, గనుల్లో సేఫ్టీ, ప్రమాదాల నియంత్రణ వంటి పలు సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. అండర్‌గ్రౌండ్ మైన్లలోని పని ప్రదేశాల్లో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల బెల్లంపల్లి రీజియన్‌లో గనుల్లో వెంటిలేషన్లేక కార్మికులు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. వారసత్వ ఉద్యోగ నియామకాలు వంటి అనేక కార్మిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు.