వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2022 ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాలు, భూభాగాలు, ప్రాంతాలకు సంబంధించిన భయానక వివరాలు వెల్లడించింది. ఈ నివేదిక కోసం 30 వేలకు పైగా గాలి నాణ్యత నిఘా కేంద్రాల సమాచారాన్ని ఐక్యూఎయిర్ ఎయిర్ క్వాలిటీ సైంటిస్టులు విశ్లేషించారు. మొత్తం131 దేశాల్లో, 118 (90%) దేశాలలో అతి సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 2.5), ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక మార్గదర్శక విలువ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉన్నాయి. మధ్య, దక్షిణాసియా ప్రాంతంలోని పది నగరాల్లో ఎనిమిది అత్యంత తీవ్ర వాయు కాలుష్యంలో ఉన్నాయి. 2022లో వార్షిక సగటుతో పోలిస్తే భారతదేశం 8వ అత్యంత కాలుష్య దేశంగా నిలిచింది. ఆరు మెట్రోపాలిటన్ నగరాల్లో(న్యూఢిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్) కాలుష్యం అత్యధికంగా పెరిగిందని నివేదిక పేర్కొంది. ఈ తాజా నివేదిక ప్రకారం.. దక్షిణాదిలో హైదరాబాద్ అత్యంత కలుషిత నగరం. హైదరాబాద్ ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శక స్థాయిని10 రెట్లు మించిపోయింది. ఇవన్నీ సగటు అంకెలు. కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఉండవచ్చు.
గా లిలో కాలుష్యం అంటే కేవలం పీఎం 2.5 కాదు. ఇంకా అనేక రకాల కాలుష్య వాయువులు కూడా ఉంటాయి. ధూళి కణాలు కూడా వివిధ పరిమాణాల్లో ఉంటాయి. పీఎం 10 ఒక రకం కాగా, ధూళి కణాలు వివిధ పదార్థాల నుంచి ఉంటాయి. ఆ మేరకు పరిమాణంతో పాటు, వాటి మూల పదార్థం బట్టి కూడా ప్రమాద స్థాయి పెరుగుతుంది. బొగ్గు రవాణాలో వచ్చే ధూళి కణాలు ఒక రకం కాగా, స్టోన్ క్రషర్ల నుంచి వచ్చే ధూళి కణాలు ఇంకొక రకం. ఆయా పదార్థాలను బట్టి, ధూళి కాణల పరిమాణం బట్టి కూడా ఊపిరితిత్తుల మీద ప్రభావం ఉంటుంది. విష వాయువులతో నిండిన గాలి వల్ల అనారోగ్యం తప్పనిసరి. ప్రస్తుతం గాలి నాణ్యత నిఘా కేంద్రాలు అన్ని రకాల సమాచారం సేకరించే స్థాయిలో లేవు. అంతటా లేవు. ఉన్న దగ్గర, సేకరిస్తున్న సమాచారం మేరకు కాలుష్యం స్థాయి చెప్పగలుగుతున్నాం. అంత కంటే ఎన్నో రెట్లు గాలి కాలుష్యం ఉందనే విషయం మన అర్థం చేసుకోవాలి. పైన పేర్కొన్న నివేదిక ప్రకారం 50 శాతానికి పైగా గాలి నాణ్యత సమాచారం ప్రజల నుంచి వచ్చింది. గత ఐదేళ్లలో వాయు నాణ్యత పర్యవేక్షణ ఉన్న దేశాలు, ప్రాంతాల సంఖ్య క్రమంగా పెరిగినప్పటికీ, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్వహించే నియంత్రణ సాధనాల్లో గణనీయమైన లోపాలు ఉన్నాయి. సాధారణ పౌరులు, పౌర శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సామాజికవేత్తలు, స్థానిక సంస్థలు తక్కువ ధరకు దొరికే సాధారణ వాయు నాణ్యత పరికరాల ద్వారా ఇచ్చిన సమాచారం ఈ నివేదికకు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా వాయు నాణ్యత పర్యవేక్షణను విస్తరించాల్సిన అవసరాన్ని ఈ నివేదిక చెబుతున్నది.
నిధుల కేటాయింపులేవి?
2020-–21 ఫిబ్రవరిలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారతదేశంలోఅత్యంత కలుషితమైన102 నగరాల్లో వాయు కాలుష్యాన్ని అధిగమించడానికి 4,400 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఇది అతిపెద్ద వార్షిక కేటాయింపు అయినప్పటికీ, ఈ మొత్తం కూడా కేవలం15 రాష్ట్రాలకు(వాటిలోని 42 నగరాలు) నవంబర్ 2020లో కేటాయించింది. ఏ విధంగా గాలి కాలుష్యం తగ్గిస్తారనే విషయంపై ప్రణాళికలు లేవు. స్పష్టత లేదు. గాలి నాణ్యతను మెరుగుపరచే చర్యలకు ఈ నిధులు సరిపోవు. ఢిల్లీ లాంటి సంపన్న నగరం కనీసం రెండు దశాబ్దాలపాటు కాలుష్యం ఎదుర్కొంటూ, గత నాలుగేండ్లలో మాత్రమే నిరంతర వాయు నాణ్యత మానిటర్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నది. దేశంలోనే అత్యధికంగా, సుమారు 37 గాలి నాణ్యత పరీక్షా కేంద్రాలను అనేక ప్రభుత్వ లేదా అనుబంధ సంస్థల ద్వారా నిర్వహిస్తున్నారు. తమ సొంత పరికరాలతో అనేక సంస్థలు కూడా గాలి నాణ్యతను కొలుస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు, తమ నగరాల్లో గాలి నాణ్యత పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు మాత్రమే ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్(ఎన్సీఏపీ) నిధులుఉపయోగిస్తున్నారు. ఈ నిధుల కేటాయింపులో కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు సుమారు 400 కోట్ల రూపాయలు ఇచ్చారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద 2024 నాటికి 2017 స్థాయిల నుంచి 20 నుంచి 30 శాతం వరకు గాలిలో సూక్ష్మ ధూళి కణాలను తగ్గించడానికి ఈ నిధులు ఉపయోగిస్తారని ప్రభుత్వం చెప్పింది. తదుపరి సంవత్సరాలకు అవసరమైన నిధుల గురించి ప్రస్తావన లేదు. 2024 నాటికి 20-–30 శాతం ధూళి కణాల సంఖ్య తగ్గించాలంటే ఒక కచ్చితమైన ప్రణాళిక అవసరం ఉంది.
ఢిల్లీలోనే అలాంటి పరిస్థితి ఉంటే..
పరిశోధన సంస్థలు కార్బన్ కాపీ, రెస్పైర్ లివింగ్ సైన్సెస్ జరిపిన ఒక విశ్లేషణలో 122 నగరాల్లో కేవలం 59కి సంబంధించి మాత్రమే పీఎం 2.5 డేటా అందుబాటులో ఉంది. కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే 2016 నుంచి 2018 వరకు రీడింగ్ లను అందించే పరికరాలు ఉన్నాయి. 2016కు ముందు డేటా లేదు. భారతదేశం ఇప్పటికీ దిగుమతి చేసుకున్న యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నది. అయితే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ వంటి సంస్థల్లో తక్కువ ఖర్చుతో గాలి నాణ్యత పరికరాలు తయారు చేసి ఉపయోగించడానికి కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. అవి అందుబాటులోకి రావాలి. ఢిల్లీ చుట్టూ ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్ విషయానికి వస్తే, పంజాబ్, హర్యానాల్లో రైతులకు వరి గడ్డిని కాల్చకుండా నిరోధించడానికి వ్యవసాయ మంత్రిత్వశాఖ ద్వారా కనీసం 600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. అయినా ఫలితం రాలేదు. కాలుష్యం తగ్గలేదు. ఒక సంపూర్ణ కాలుష్య నివారణ ప్రణాళిక అత్యంత కాలుష్య నగరం అయిన ఢిల్లోలోనే కొరవడింది. హైదరాబాద్ సంగతి వేరే చెప్పనక్కర లేదు.
సామాజిక అంశంగా గుర్తించాలి..
గాలి కాలుష్యం ఒక రాష్ట్ర స్థాయి సమస్యగా మారింది. రాష్ట్ర స్థూల ఆదాయం పెరగడానికి ఈ విధ్వంసకర ‘అభివృద్ధి’ చర్యలు కారణం. ఇలాంటి అభివృద్ధి మీద సమీక్ష లేదు. సమతుల్య అభివృద్ధి గురించిన ఆలోచన లేదు. బంగారు తెలంగాణ పేరిట ప్రభుత్వం చేబడుతున్న ‘అభివృద్ధి’ కి పర్యావరణ వనరులు సమిధలు అవుతుండగా, పేద ప్రజలు కూడా బలి అవుతున్నారు. గాలి కాలుష్యం బారిన పడి వందలాది గ్రామీణులు, బడుగు, బలహీన వర్గాలు ఆరోగ్యం కోసం ఉన్న ఆస్తులను అమ్ముకుని ఇంకా పేదరికంలోకి జారుతున్నారు. ధూళి కణాలు, విష వాయువులతో నిండిన గాలిని పీల్చి రోగులుగా మారుతున్న తెలంగాణ బిడ్డల గురించి ప్రభుత్వం ఆలోచించాలి. మైనింగ్ కంపెనీల నుంచి వాసులు చేసే జిల్లా మినరల్ ఫండ్ లో ఉన్న నిధులను గాలి కాలుష్యం బారినపడి గాయపడిన వ్యక్తులు, పశువులు, పర్యావరణం కోసం ఖర్చు చేయాలి. హైదరాబాద్ నగరంలో ఆహ్లాదకరమైన పరిస్థితి రావడానికి తెలంగాణ ప్రభుత్వం తగిన విధానాలు, ఆలోచనలు, నిధులతో కూడిన ప్రణాళిక నిపుణులతో కూడి తయారు చేయాలి. రాష్ట్ర శాసనసభలో వాయు కాలుష్యం మీద చర్చ జరగాలి. తద్వారా, తగిన విధానాలు, పథకాలు, ప్రణాళికలు తయారు చేసుకోవచ్చు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు గాలి కాలుష్యాన్ని ఒక సామాజిక, ఆర్థిక అంశంగా గుర్తించాలి.
నియంత్రణ చర్యలు లేక..
ప్రతి నగరంలో గాలిలో కాలుష్యానికి నాలుగు రంగాలు కీలకం. వాహనాలు, పరిశ్రమలు, భవన నిర్మాణ రంగం, మైనింగ్. హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం తగ్గించడానికి తెలంగాణా ప్రభుత్వం, బల్దియా, ఇంకా ఇతర ప్రభుత్వ సంస్థలు పని చేయడం లేదు. విద్యుత్ వాహనాల ప్రోత్సాహం మాత్రమే ఒక చర్యగా ప్రకటిస్తున్నారు. కానీ, వాహనాల కాలుష్యం తగ్గించడానికి కీలకమైన వాహనాల సంఖ్య తగ్గింపు మీద దృష్టి లేదు. పరిశ్రమల నుంచి, భవన నిర్మాణాల నుంచి గాలి కాలుష్యం తగ్గించే చర్యలు శూన్యం. హైదరాబాద్ చుట్టూ రాయి కోసం గుట్టలను ధ్వంసం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. మైనింగ్ తర్వాత రాయిని కంకరగా, పొడిగా మార్చే స్టోన్ క్రషర్ల ద్వార విపరీతమైన ధూళి గాలిలో కలుస్తున్నది. బండరావిరాల దగ్గర ఒక 3-4 కిలోమీటర్ల పరిధిలో ఉన్న చట్ట వ్యతిరేక యూనిట్ల వల్ల ఏడాదికి దాదాపు 300 టన్నుల ధూళి ఉత్పన్నం అయి, పరిసరాల్లో పొరలు పొరలుగా పడుతున్నది. స్థానిక ప్రజల అవస్థలు వర్ణనాతీతం. ఇది 2-3 గ్రామాల పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా, హైదరాబాద్ చుట్టూ అనేక వందల యూనిట్ల నుంచి వాటి సామర్థ్యం బట్టి సూక్ష్మ ధూళి కణాలు రోజు వెలువడుతూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్సీఏపీ కింద ఇచ్చిన అరకొర నిధులు పరికరాల మీద ఖర్చుబెట్టి కాలుష్యం తగ్గిస్తున్నామని మభ్య పెడుతున్నారు.
- దొంతి నర్సింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్