వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ - 2024 విడుదల..హ్యాపీనెస్​లో మళ్లీ ఫిన్లాండ్ టాప్

  •     126వ స్థానంలోనే భారత్ 
  •     వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ - 2024 విడుదల 
  •     టాప్ 20 నుంచి అమెరికా, జర్మనీ ఔట్
  •     ఎప్పట్లాగే అట్టడుగున నిలిచిన అఫ్గాన్ 

న్యూయార్క్ : ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ మళ్లీ టాప్​లో నిలిచింది. ఇండియా గతేడాది లాగే ఈసారి కూడా126వ స్థానంలోనే ఉండిపోయింది. ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డేను పురస్కరించుకుని బుధవారం ఆఫ్ ఆక్స్​ఫర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఈ మేరకు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్-–2024ను విడుదల చేసింది. మొత్తం 143 దేశాలకు ర్యాంకులు కేటాయించగా.. ఫిన్లాండ్ వరుసగా ఏడో ఏడాది కూడా నంబర్ 1గా నిలిచింది. అఫ్గానిస్తాన్, లెబనాన్, జోర్డాన్ దేశాల్లో హ్యాపీనెస్ మరింత క్షీణిస్తుండగా..

సెర్బియా, బల్గేరియా, లాట్వియా దేశాల్లో పెరుగుదల నమోదైంది. హ్యాపీనెస్ రిపోర్టులో పెద్ద దేశాలేవీ టాప్ ప్లేస్​ పొందలేకపోయాయి. టాప్ 10లో దాదాపు చిన్న దేశాలే ఉన్నాయి. 1.50 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. 3 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో కెనడా, యూకే మాత్రమే టాప్ 20లో నిలిచాయి. 

నార్డిక్ దేశాలు టాప్.. అఫ్గాన్ లాస్ట్  

హ్యాపీనెస్ రిపోర్టులో ఎప్పట్లాగే నార్డిక్ ప్రాంత దేశాలే టాప్​లో నిలిచాయి. ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్, ఐస్ ల్యాండ్, స్వీడన్ దేశాలు వరుసగా రెండు, మూడు, నాలుగో ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. హమాస్ దాడులు, గాజాపై యుద్ధం నేపథ్యంలో ఆందోళనకరమైన వాతావరణం ఉన్నా, ఇజ్రాయెల్ హ్యాపీనెస్ రిపోర్టులో టాప్ 5 ర్యాంకులో నిలిచింది. అయితే, మూడేండ్ల యావరేజింగ్ మెథడ్​ను ఉపయోగించడం వల్లే ఇజ్రాయెల్ టాప్ ర్యాంకుకు చేరినట్టు రిపోర్టు వివరణ ఇచ్చింది. ఈ రిపోర్టులో తొలిసారిగా అమెరికా

 జర్మనీ టాప్ 20 నుంచి దిగజారి 23, 24 స్థానాల్లో నిలిచాయి. కోస్టారికా, కువైట్ దేశాలు 12, 13 ర్యాంకులతో తొలిసారిగా టాప్ 20లోకి ఎంటరయ్యాయి. ఇక అఫ్గానిస్తాన్ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అన్ హ్యాపీయెస్ట్ దేశంగా నిలిచింది. ఈసారి కూడా రిపోర్టులో అట్టడుగున 143వ ర్యాంకును పొందింది. అఫ్గాన్ కంటే ముందు ర్యాంకుల్లో వరుసగా లెబనాన్, లెసోథో, సియెర్రా లియోన్, కాంగో దేశాలు ఉన్నాయి. 

ఫిన్లాండ్ టాప్​లో ఎందుకంటే..

ఫిన్లాండ్ ప్రజలు ఎక్కువగా ప్రకృతికి దగ్గరగా గడపడం.. పని, జీవితం మధ్య సమతౌల్యం పాటించడం వల్లే ఎక్కువ సంతోషంగా ఉంటున్నారని యూనివర్సిటీ ఆఫ్​హెల్సింకీ రీసెర్చర్ జెన్నిఫర్ డీ పవోలా తెలిపారు. సక్సెస్ ఫుల్ లైఫ్ అంటే ఏమిటో వారికి బాగా తెలుసన్నారు. అదే అమెరికాలో తీసుకుంటే ఆర్థికంగా సంపాదన ఎంత పెరిగితే అంత సక్సెస్​గా భావిస్తారన్నారు. ఫిన్లాండ్​లో ప్రభుత్వ అధికారుల పనితీరు బాగా ఉంటుందని

 అవినీతి చాలా తక్కువన్నారు. ఉచిత విద్య, వైద్యంతోపాటు ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం, అధికారులు మెరుగ్గా పని చేస్తారన్నారు. అందుకే ఫిన్లాండ్​లో ప్రజలకు నమ్మకం, స్వేచ్ఛ వంటివి ఎక్కువగా ఉంటాయని, దీంతో  వారు సంతోషంగా ఉంటారన్నారు. 

ర్యాంకులు ఇలా కేటాయించారు.. 

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ కోసం143 దేశాల్లో ప్రజల స్థితిగతులను బట్టి ర్యాంకులను కేటాయించారు. ఆయా దేశాల్లో ప్రజల మధ్య సామాజిక మద్దతు, వారి ఆదాయం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతిరహితం, జీవితం పట్ల ప్రజలు వెలిబుచ్చిన సంతృప్తి, తలసరి జీడీపీ, ఆరోగ్యకరమైన జీవితం వంటి ప్రధాన అంశాలను బట్టి హ్యాపీనెస్ స్థాయిలను అంచనా వేశారు. యూఎన్ సస్టెయినబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్, గాలప్ వరల్డ్ పోల్ తో కలిసి  యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ కు చెందిన వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఈ మేరకు రిపోర్ట్ ను తయారు చేసింది.   

యూత్​లో ఇలా.. వృద్ధుల్లో అలా.. 

వివిధ దేశాల్లో 30 ఏండ్లలోపు వాళ్లను తీసుకుంటే లిథువేనియా అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. అదే 60 ఏండ్లకుపైబడిన వారిని తీసుకుంటే డెన్మార్క్ టాప్ లో ఉంది. నార్వే, స్వీడన్, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, స్పెయిన్ వంటి దేశాల్లో వృద్ధులే అత్యంత సంతోషంగా ఉన్నారని రిపోర్ట్ పేర్కొంది. పోర్చుగల్, గ్రీస్ దేశాల్లో మాత్రం దీనికి రివర్స్ లో ట్రెండ్ కొనసాగుతోంది. అయితే, పిల్లల్లో హ్యాపీనెస్ తగ్గిపోతోందని రిపోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా నార్త్ అమెరికా, వెస్టర్న్ యూరప్ దేశాల్లో పిల్లలు అంతగా సంతోషంగా లేరని తెలిపింది. 

126వ స్థానంలోనే ఇండియా

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టులో మన దేశం పోయిన ఏడాదిలాగే ఈ సారి కూడా126వ ర్యాంకులోనే ఉంది. మన పొరుగు దేశాలైన చైనా 60, నేపాల్ 93, పాకిస్తాన్ 108, మయన్మార్ 118, శ్రీలంక 128, బంగ్లాదేశ్ 129 స్థానాల్లో ఉన్నాయి. వయసు ఆధారంగా చూస్తే సంపన్న దేశాల్లోనే వృద్ధుల్లో జీవితంపై సంతృప్తి ఎక్కువగా ఉందని రిపోర్టు అభిప్రాయపడింది. ఇండియాలో వృద్ధులకు నాణ్యమైన జీవనం ఇంకా సరిగ్గా అందుబాటులోకి రాలేదని తెలిపింది. ప్రధానంగా ఇండియాలో వైవాహిక స్థితి, సామాజిక సంబంధాలు, ఆరోగ్యం, కుల వివక్ష, విద్య, వైద్యం అందుబాటు వంటి అంశాలు ప్రజల సంతోషాన్ని ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంది. ఇండియాలోని వృద్ధుల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటున్నా, ఎక్కువ సంతోషంగానే ఉన్నారని అభిప్రాయపడింది. 

టాప్ 10 దేశాలు ఇవే..

1. ఫిన్లాండ్

2. డెన్మార్క్

3. ఐస్ ల్యాండ్ 

4. స్వీడన్

5. ఇజ్రాయెల్

6. నెదర్లాండ్స్

7. నార్వే

8.లక్సెంబర్గ్

9. స్విట్జర్లాండ్

10. ఆస్ట్రేలియా