జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయ లోపంతో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. అసలే వర్షా కాలం.. ఈ సమయంలో జీహెచ్ఎంసీ శానిటేషన్, ఇంజనీరింగ్ అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఐటీ కారిడార్‌లో వర్షాలు పడితే అంతే సంగతులు. రోడ్లపై వర్షపునీరు చేరి మోకాళ్ల వరకు నీరు చేరి ట్రాఫిక్ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఐటీ కారిడార్‌లో ఎక్కడ సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించేలా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇవేమీ శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులు పట్టించుకోవడం లేదు. రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. మ్యాన్‌హోల్ నుంచి మురుగునీరు వచ్చి గుంతల్లో చేరి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని స్వయంగా ట్రాఫిక్ సీఐ వారం రోజుల నుంచి జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటే అధికారుల నిర్లక్ష్యానికి ఇదే ఉదాహరణగా చెప్పవచ్చు. కనీసం సమస్య ఉన్న ప్రాంతంలో పర్యటించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. గచ్చిబౌలి ఫ్లైఓవర్ పక్కనే ఉన్న సౌత్ఇండియా షాపింగ్ మాల్ వద్ద ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గచ్చిబౌలి నుండి అయ్యప్ప అర్కేడ్, జనార్ధన హిల్స్‌కు వెళ్లే రహదారి వర్షపునీటి ప్రవాహానికి, మురుగునీటి ప్రవాహానికి కోతకు గురై రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. ఈ రహదారిలో వెళ్లే టూవీలర్, ఫోర్ వీలర్ వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టూ వీలర్ వాహనదారులు ఈ గుంతల్లో పడి గాయాలపాలవుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
గుంతలు కనబడుతలే..
ఈ ప్రాంతంలో రోడ్డుపై ఏర్పడ్డ గుంతలు లోతు ఎంత పెద్దగా ఉందోనని వాహనదారులు భయపడుతున్నారు. గుంతల్లో కారు ఎక్కడ దిగబడుతుందోనని అక్కడి వరకు స్పీడ్‌గా వచ్చిన వారు ఒకే సారి వాహనాలను నెమ్మదిగా పోనివ్వడం వలన ఈ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. టెలికాంనగర్కాలనీ, గచ్చిబౌలి నుండి ఐకియా స్టోర్, డెల్లైట్సాఫ్ట్వేర్ కంపెనీ, సైబర్ టవర్స్ వైపు వెళ్లే వారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కనే ఉన్న అయ్యప్ప అర్కేడ్ రోడ్డు నుండి జనార్ధన హిల్స్ మీదుగా ఐకియా స్టోర్, సైబర్ టవర్స్ వైపు వెళ్తారు. ఈ రోడ్డుపై ఏర్పడ్డ గుంతలు, రోడ్డు కోత వల్ల అవి ఎంత పెద్దగా ఉందో అంచనా లేక వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించడం, వెనుకాల వచ్చే వాహనాలు స్లో కావడం వలన ఒకదాని వెనుక ఒకటి నిలిచి ట్రాఫిక్ ఏర్పడుతుంది.
అధికారులు సమస్యలు పరిష్కరించరా..?
ఒకవైపు మ్యాన్‌హోల్ నుండి మురుగునీరు వచ్చి రహదారి గుంతల్లో చేరుతోంది. రహదారిపై ఇంత పెద్దగా గుంతలు ఏర్పడ్డ సమస్యలను అధికారులు పరిష్కరించరా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రోజులు గడుస్తున్నా అసలు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను వెంటనే పూడ్చివేయాలని ప్రయాణికులు, వాహనదారులు పేర్కొంటున్నారు. గుంతలు మరింతా పెద్దవిగా మారకుండా ప్రమాదాలు జరుగక ముందే అధికారులు మేల్కొని సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.