వైరస్ ఎప్పుడూ డేంజరే. ఏ రూపంలో అయినా ఎటాక్ చేయొచ్చు. జంతువుల ద్వారా దాడి చేయొచ్చు. గాల్లో కలిసిపోయి రావచ్చు. కంట్రోల్ చేద్దామంటే వ్యాక్సిన్లుండవు. ఈ మహమ్మారి గురించి అవగాహన పెంచుకునేలోగానే వందలు, వేలాదిమంది ప్రాణాలు కోల్పోతారు. ఆ మధ్య వచ్చిన ఎబోలా కావచ్చు. నిన్న వచ్చిన నిఫా కావచ్చు. మధ్య మధ్యలో జనాన్ని వణికించిన స్వైన్ ఫ్లూ లాంటివి, లేటెస్ట్గా వచ్చిన కరోనా కావచ్చు. ఏదైనా యమ డేంజరే. ప్రపంచాన్ని వణికించిన ప్రమాదకర వైరస్లు కొన్ని…
ఆఫ్రికాలో పుట్టిన ఎబోలా
మూడు నాలుగేళ్ల క్రితం ఎబోలా వైరస్ పేరు చెబితే ఆఫ్రికా వణికిపోయింది. 2013 నుంచి 2016 వరకు పశ్చిమాఫ్రికాలో ఈ వైరస్ బాగా విస్తరించింది. ఎబోలా.. ఇది ఒక డేంజరస్ వైరస్. ఆఫ్రికాలో పుట్టి ప్రపంచాన్ని వణికించింది. ఎబోలా వైరస్‌ను 1976లో తొలిసారి గుర్తించారు. సౌత్ సూడాన్‌లోని జారా అనే ఒక పట్టణంలో ఈ వైరస్‌ను గుర్తించారు. ఎబోలా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన జంతువుల రక్తం లేదా సలైవా (చొంగ) ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.
డెంగీ ఒక వైరల్ జ్వరం
డెంగీ వైరస్ ప్రభావం మన దేశంలో 2016లో బాగా ఎక్కువగా పడింది. న్యూఢిల్లీ, కేరళలో దాదాపు 1500 మందికి సోకినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. డెంగీ జ్వరాలు సోకని రాష్ట్రం లేనే లేదు. 1970కు ముందు డెంగీ వైరస్ కేవలం తొమ్మిది దేశాలలోనే ఉండేది. అయితే, ఆ తరువాత ఈ వైరస్ వంద దేశాల్లో విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కిందటేడాది ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో డెంగీ మరోసారి విజృంభించింది. బంగ్లాదేశ్‌లో ఎక్కువ కేసులు (1,01,000) రిపోర్ట్ అయ్యాయి. డెంగీ వైరస్ వైరల్ జ్వరం రూపంలో మనుషుల ప్రాణాలు తీస్తుంది.
కీళ్ల నొప్పుల చికున్ గున్యా
చికున్‌గున్యా వైరస్‌తో జ్వరాన పడ్డవాళ్లు ఓ పట్టాన కోలుకునేవారు కాదు. దీనివల్ల కీళ్లనొప్పులు చాలా ఎక్కువగా వచ్చేవి. 2013–2017 మధ్య కాలంలో ఇండియాలో 70 శాతం మేర చికున్‌గున్యా సోకింది. కేసుల సంఖ్యకూడా 65 వేలకు పైగా నమోదయ్యాయి. చికున్ గున్యా వ్యాధి ఎడిస్ దోమ వల్ల వస్తుంది. మొట్టమొదటిసారి 1953 లో టాంజానియాలో ఈ వ్యాధిని గుర్తించారు. తీవ్రమైన కీళ్ల నొప్పులు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. మనిషి పట్టుమని నాలుగు అడుగులు కూడా వేయలేడు.
చిన్నారులపై జికా ప్రభావం
జికా వైరస్ 2017లో మన దేశాన్ని తాకింది. మొదట రాజస్థాన్‌లోని జైపూర్‌లో దీని తీవ్రతను గుర్తించారు. దాదాపుగా 100మంది వరకు జికా బారినపడ్డారు. పొరుగున ఉన్న గుజరాత్‌లోనూ ఇది ఎఫెక్ట్ చూపించింది. జికా వైరస్‌ను 1947లో ఉగాండాలో తొలిసారి గుర్తించారు. ఆ తరువాత అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 86 దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది.
గొర్రెల నుంచి మనిషికి ఆంత్రాక్స్
సౌత్ ఇండియాపై ఎక్కువగా విరుచుకుపడిన వైరస్లలో ఆంత్రాక్స్ ఒకటి. ఛత్తీస్‌గఢ్‌లో 2007లో దీనిని గుర్తించారు. అక్కడి నుంచి ఇతర చోట్లకు ఇది పాకింది. ఆంత్రాక్స్ ఒక అంటువ్యాధి. ‘బాసిల్లస్ ఆంత్రసిస్’ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా గొర్రెల నుంచి మనుషులకు వస్తుంది. దీంతో ఆంత్రాక్స్ వ్యాధి సోకిన గొర్రెల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు.
కేరళను కుదిపేసిన ‘నిఫా’
రెండేళ్ల క్రితం నిఫా వైరస్ కేరళలో చాలా ఎక్కువగా సోకింది. ఈ వైరస్ మలేసియా, సింగపూర్లలో వందలాది మందిని బలి తీసుకుంది. 2001వ సంవత్సరంలో బంగ్లాదేశ్‌లోకి, అక్కడినుంచి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించింది. 2018లో కేరళను కుదిపేసింది. మలేసియాలో 1999లో నిఫా వైరస్‌ను తొలిసారి గుర్తించారు. ఆ తరువాత సింగపూర్‌లోకి ఎంటరైంది. ఈ వైరస్ బారినపడి ఈ రెండు దేశాల్లోనూ వందమందికి పైగా చనిపోయారు.
కుక్కకాటుతో వచ్చే రేబిస్ వ్యాధి
రేబిస్ కూడా వైరస్ వ్యాధే. కుక్క కాటు వల్ల వస్తుంది. రేబిస్ రోగాన్ని కలుగచేసే క్రిమిని ‘లిస్సా వైరస్’ అంటారు. ఇది జంతువుల లాలాజలంలో ఉంటుంది. ఈ క్రిమి ఉన్న కుక్క మనిషిని కరిచినా లేదా శరీరంమీద గాయాలున్న చోట టచ్ చేసినా దాని ద్వారా శరీరంలోకి వైరస్ ప్రవేశిస్తుంది.