తాజ్మహల్ను తాకిన యమునా నది

యమునకు మళ్లీ పెరిగిన వరద
వాటర్ లెవెల్ 205.76 మీటర్లు
ఉత్తరాఖండ్‌‌‌‌, హిమాచల్‌‌‌‌, యూపీలో 5 రోజులు వానలు
ఉత్తరాఖండ్‌‌‌‌లోని అన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్

న్యూఢిల్లీ: యమునా నదికి వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. వరుసగా నాలుగు రోజులుగా నీటి మట్టం తగ్గుతూ రాగా.. తాజాగా మళ్లీ ఎక్కువైంది. ఆదివారం రాత్రి 205.52 మీటర్లుగా ఉన్న వాటర్ లెవెల్.. సోమవారం ఉదయానికి 205.76 మీటర్లకు పెరిగింది. నీటి మట్టం 206 మీటర్లకు మించి నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. హర్యానాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వానల వల్లే నీటి మట్టం కొంత పెరిగిందని ఢిల్లీ మంత్రి ఆతిషీ చెప్పారు. నీటి మట్టం 206.1 మీటర్లకు పెరగొచ్చని, అయితే ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని, నీళ్లు సాధారణ స్థాయికి వచ్చేదాకా ఇండ్లకు పోవద్దని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆదేశించారు. ‘‘వరదలు వచ్చిన తర్వాత డెంగీ, చికున్‌‌‌‌గున్యా, మలేరియా వంటి కేసులు పెరుగుతాయనే భయం జనాల్లో ఉంది. ప్రస్తుతానికి అలాంటి పరిస్థితేమీ కనిపించడం లేదు. అలర్జీ వంటి కేసులు రిలీఫ్ క్యాంపుల్లో నమోదవుతున్నాయి” అని సౌరభ్​ చెప్పారు. 

ALSO READ :మిడ్ మానేర్​ నాలుగు గేట్లు ఓపెన్

ఉప్పొంగుతున్న గంగమ్మ
ఉత్తరాఖండ్‌‌‌‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దేవ్‌‌‌‌ప్రయాగ్‌‌‌‌లో గంగానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. అలకనంద నదిపై నిర్మించిన డ్యామ్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో హరిద్వార్‌‌‌‌లో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉత్తరాఖండ్‌‌‌‌, హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌, ఉత్తరప్రదేశ్‌‌‌‌లో వచ్చే ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాఖండ్‌‌‌‌లోని మొత్తం 13 జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.