దురుసుగా మాట్లాడాడని యువకుడికి పోలీస్ ​ట్రీట్​మెంట్​

తనకేమీ తెలియదన్న ఆఫీసర్​

నారాయణపేట, వెలుగు : నారాయణపేట జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా దురుసుగా మాట్లాడాడని, విధులకు ఆటంకం కలిగించాడని ఎస్ఐ ఓ యువకుడిని బట్టలూడదీసి కొట్టినట్టు తెలుస్తోంది. గాయాలతో బాధపడుతున్న అతడిని బంధువులు పీఎస్ ​నుంచి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. బాధితుడి కథనం ప్రకారం...ధూల్​పేటకు చెందిన ఓ వినాయక విగ్రహాన్ని శనివారం రాత్రి నిమజ్జనానికి తీసుకువెళ్తూ సరఫ్​బజార్​ప్రాంతంలో ఆపారు. ఇది చూసిన నారాయణపేట సెకండ్​ఎస్ఐ రమేశ్​ అక్కడికి వచ్చి వాహనం తీయాలని కోరాడు.  డ్రైవర్ ​లేడని కొంత సేపు టైం ఇవ్వాలని ఇద్దరు యువకులు ఎస్​ఐని కోరారు. అయితే ఎస్​ఐ నన్నే తిడతావా అంటూ ఓ యువకుడిని పక్కనే ఉన్న మార్వాడీ గల్లీలోకి తీసుకువెళ్లి తన సిబ్బందితో కలిసి చితకబాదాడు. కొంతమంది యువకులు వచ్చి ఎస్ఐకి సర్ధి చెప్పి అతడిని తీసుకువెళ్లారు. అయితే ఆదివారం నారాయణపేట పీఎస్​లో యువకుడిపై కేసు నమోదు చేశారు.

సోమవారం ఉదయం అతడి ఇంటికి వెళ్లి పోలీస్​స్టేషన్​కు తీసుకువెళ్లారు. బట్టలు విప్పించి లాఠీలతో చితకబాదారు. ‘నీ జన్మలో మగతనం లేకుండా చేస్తా’ అంటూ ఎస్​ఐ కొట్టాడని బాధితుడు వాపోయాడు. యువకుడి బంధువులు, కుల పెద్దలు వచ్చి సీఐ శ్రీకాంత్​రెడ్డితో మాట్లాడి అతడిని తీసుకెళ్లారు. అయితే మళ్లీ ఎస్​ఐ ఏం చేస్తాడో ఏమో అనుకుని సదరు యువకుడిని గుర్తు తెలియని ప్రదేశంలో ఉంచారు. దీనిపై త్వరలోనే ఎస్పీతో పాటు హెచ్ఆర్​సీకి కంప్లయింట్ ​చేయబోతున్నట్టు తెలిసింది. దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్​ఐ రమేశ్​ను వివరణ కోరగా తనకేమీ తెలియదని, మొదటి ఎస్​ఐ సురేశ్​గౌడ్​ను అడగాలని సమాధానమిచ్చాడు. ఎస్ఐ సురేష్​తో మాట్లాడగా అలాంటిదేమీ తమ స్టేషన్​లో జరగలేదని చెప్పాడు.