- ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఘటన
- మర్డర్ చేసి.. పోలీస్ స్టేషన్‌లో లొంగుబాటు
జయశంకర్ భూపాలపల్లి/ఏటూరు నాగారం, వెలుగు: తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువకుడు, యువతిని వేధించాడు.. కేసు పెట్టించి, జైలుకు పంపించినా అతడు పద్ధతి మార్చుకోలేదు.. జైలు నుంచి బయటికొచ్చాక కూడా వేధింపులకు పాల్పడటం మానుకోలేదు. అతడి వేధింపులను భరించలేకపోయిన యువతి, ఆ యువకుడిని కత్తితో పొడిచి చంపేసింది.అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన రాంటెంకి శ్రీనివాస్(32) గతంలో వివాహం చేసుకొని భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. భవన నిర్మాణ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇక బాధిత యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో.. ఏటూరునాగారంలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. కొన్నాళ్ల కిందటే ఆ యువతి 5వ వార్డులో చిన్న గుడిసె వేసుకొని కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నది. ఈక్రమంలో ఆ ఏరియాకు చెందిన రాంటెంకి శ్రీనివాస్ తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీనిపై శ్రీనివాస్, యువతి మధ్య అప్పట్లో గొడవ జరిగింది. అనంతరం నమోదైన కేసులో శ్రీనివాస్ జైలుకు వెళ్లొచ్చాడు.
జైలు నుంచి తిరిగొచ్చాక కూడా శ్రీనివాస్ వైఖరిలో మార్పు రాలేదు. గ్రామ పెద్దలు సర్ది చెప్పినా అతడు మారలేదు. ఈక్రమంలో బుధవారం అర్ధరాత్రి యువతిని.. ఆమె అమ్మమ్మ ఇంటి వద్ద వేధించాడు. దీంతో విసిగిపోయిన ఆ యువతి అక్కడే ఉన్న దొమ తెర, ప్లాస్టిక్ వైర్‌తో సిమెంట్ పోల్‌కు శ్రీనివాస్‌ను కట్టేసి కత్తితో పొడిచి హతమార్చింది. బుధవారం అర్ధరాత్రి 1.30 గంటలకు యువతి ఒంటరిగానే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.