నర్సింహులపేట, వెలుగు: పెండ్లికి కొత్త బట్టలు కొనియ్యలేదని ఓ యువతి సూసైడ్ చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం.. నర్సింహులపేట మండలం పెద్దనాగరం గ్రామానికి చెందిన నాగన్నబోయిన నర్సయ్య కూతురు మనుష(22) ఈనెల 6న ఇంట్లో ఎవరూ లేనప్పుడు పురుగుల మందు తాగింది.
కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన తండ్రికి గడ్డి మందు తగినట్లు మనుష చెప్పడంతో మహబూబాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం యువతి చనిపోయింది. బాబాయ్ బిడ్డ పెండ్లికి కొత్త బట్టలు కొనియ్యలేదని మనస్తాపం చెంది తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్టు తల్లిదండ్రులు తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.