ఇరాన్‌లో ఓ యువతి హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ అర్థనగ్నంగా నిరసన తెలిపింది. టెహ్రాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీలో నవంబర్ 2న ఇది జరిగింది. తర్వాత కొందరు వ్యక్తులు వచ్చి ఆమెను కారులో ఎక్కించుకొని వెళ్లారు. దాదాపు రెండు రోజులు కావస్తున్న ఆమె ఆచూకీ లభించడం లేదు. హిజాబ్ ధరించాలని అక్కడి పోలీసులు ఆమెను వేధించారట. దీంతో ఆమె సగం దుస్తువులతో నిరసన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాసిజ్ పారామిలిటరీ గ్రూప్ సభ్యులు ఆమెను వేధించారని, ఆ మహిళ దుస్తులను చింపివేసినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ రాసుకొచ్చింది. అంతేకాదు యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ అమీర్ మహ్జాబ్ ఆమె భర్త నుంచి విడిపోయిందని.. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారని మెంటల్ కండిషన్ సరిగా లేదని పేర్కొంటూ X లో పోస్ట్ చేసారు. ఇరాన్ స్థానిక వార్తాపత్రిక ఫర్హిఖ్తేగన్ కూడా ఆమెను మెంటల్ హాస్పిటల్ లో చేర్చినట్లు రాసింది. నిరసన తెలిపిన రెండు రోజుల తర్వాత ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆమెను వెంటనే విడుదల చేయాలని ఇరాన్ ను ఆదేశించింది. కానీ ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియడం లేదు. అధికారుల చిత్రహింసలు, దుష్ప్రవర్తన నుంచి యువతిని రక్షించాలని ఆమ్నెస్టీ సంస్థ డిమాండ్ చేసింది.
ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి స్పెషల్ రిపోర్టర్ మై సాటో అధికారులు ఆమెపై ఎలా రియాక్ట్ అయ్యారో సహా మొత్తం డీటేల్ గా పర్యవేక్షిస్తానని ఎక్స్ లో రాశారు. ఇరాన్ లో హిజాబ్, బుర్కా లేకుండా మహిళలు బయట తిరగడం నిషేదం. జుట్టు కనబడేలా, టైట్ బట్టలు వేసుకోవద్దు. దీన్ని వ్యతిరేకించిన వారిపై ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. గతకొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవస్థకు చాలామంది మహిళలు పోరాడుతున్నారు.