ఘట్ కేసర్, వెలుగు : తన చెల్లెల్ని ఓ యువకుడు ప్రేమించడాన్ని తట్టుకోలేని అన్న అతడిని కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్ పరిధి సంస్కృతి టౌన్ షిప్‌లో జరిగింది. పోచారం ఐటీసీ ఇన్ స్పెక్టర్ బి. రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ పట్టణం సూర్యనగర్ కాలనీకి చెందిన సురిమల్ల ఉదయ రాజు(23) అదే ప్రాంతంలోని ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారం యువతి అన్న తనుష్‌కు తెలియడంతో ఉదయ్ రాజును చంపుతానని బెదిరించాడు. ఆందోళనకు గురైన ఉదయరాజు ఈ నెల 8న పోచారం సంస్కృతి టౌన్ షిప్ లో ఉండి బీటెక్ చదువుతున్న తన మిత్రులు పృథ్వీ, చైతన్యల వద్దకు వచ్చాడు.
తనుష్ ఈ నెల 10న రాత్రి 8 గంటల సమయంలో మరో ముగ్గురు మిత్రులతో కలిసి 2 బైక్ లపై సంస్కృతి టౌన్ షిప్‌కు వచ్చాడు. అనంతరం ఇద్దరు మిత్రులతో కలిసి టౌన్ షిప్ నుంచి బయటకు వెళుతున్న ఉదయరాజును తనుష్ బృందం కిడ్నాప్ చేశారు. అనంతరం మల్కాజిగిరిలోని ఓ ఇంటికి తీసుకెళ్లి దాడి చేశారు. తనుష్ ఫోన్ నెంబర్ ఆధారంగా లోకేషన్‌ను గుర్తించి అప్రమత్తం చేశారు. విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు బాధితుడిని తార్నాక వద్ద వదలిపెట్టి పరారయ్యారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.